‘చిన‌బాబు’ రివ్యూ

Updated By ManamFri, 07/13/2018 - 13:10
chinababu
Chinababu

నిర్మాణ సంస్థ‌: 2డి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ద్వార‌కా క్రియేష‌న్స్
తారాగ‌ణం: కార్తీ, సాయేషా, ప్రియా భవాని శంకర్, సత్య రాజ్, భానుప్రియ, సూరి, శంకర్, ఆర్థన బిను.
స్వ‌ర‌క‌ర్త‌: డి.ఇమాన్‌
ఛాయాగ్ర‌హ‌ణం: వేల్‌రాజ్‌
కూర్పు: రుబ‌న్‌
స‌హ నిర్మాత‌లు : సి.హెచ్. సాయి కుమార్ రెడ్డి, రాజశేఖర్ కర్పూర, సుందర పాండియ‌న్‌
నిర్మాత‌లు: సూర్య‌, మిరియాల ర‌వీంద‌ర్‌రెడ్డి
క‌థ‌-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్వం : పాండిరాజ్
సెన్సార్‌:  యు
విడుద‌ల‌: 13.07.2018

తొలి సినిమా నుంచి కూడా వైవిధ్య‌మైన స్క్రిప్ట్ లు ఎంపిక చేసుకుని సినిమాలు చేయ‌డానికి ముందుంటారు కార్తి. ఆయ‌న న‌టించిన తాజా త‌మిళ సినిమా `క‌డైకుట్టి సింగ‌మ్` తెలుగులో `చిన‌బాబు` పేరుతో విడుద‌ల‌వుతోంది. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ, కామెడీ చిత్రంగా తెర‌కెక్కిన ఈ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. కార్తి త‌న గ‌త చిత్రం ` ఖాకి`తో మంచి మార్కులు స్కోర్ చేశారు. ఈ సినిమా ఆయ‌న్ని ఫ్యామిలీ ఆడియ‌న్స్ కి మ‌రింత ద‌గ్గ‌ర చేస్తుందా? ఎలా ఉంది? ఒక‌సారి చూసేయండి.

క‌థ‌: 
కృష్ణంరాజు (కార్తీ) రైతు. ఫార్మ‌ర్ అని చెప్పుకోవ‌డాన్ని గ‌ర్వంగా భావించే వ్య‌క్తి. ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుకుని తండ్రి వ్య‌వ‌సాయ బాధ్య‌త‌ల‌ను తీసుకుని ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంటాడు. ఐదుగురు అక్క‌ల త‌ర్వాత పుట్టిన త‌మ్ముడు కావ‌డంతో అత‌నంటే అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తారు. ఇద్ద‌రు అక్క‌లు త‌మ కుమార్తెను అత‌నికే ఇచ్చి పెళ్లి చేయాల‌నుకుంటారు. కృష్ణంరాజు తండ్రి రుద్ర‌రాజు (స‌త్య‌రాజ్‌)కి ఇద్ద‌రు భార్య‌లు. చివ‌రికి కృష్ణంరాజు ప‌రిస్థితి కూడా అలాగే త‌యార‌వుతుందేమోన‌ని అనుకుంటుండ‌గా ఓసారి బ‌స్సులో నీర‌ద (సాయేషా)ను చూస్తాను కృష్ణంరాజు. తొలిచూపులోనే ప్రేమిస్తాడు. త‌నతండ్రికి అమ్మాయిని చూపించి, ఆయ‌న అంగీకారంతోనే ప్రేమిస్తాడు. కొడుకు ప్రేమ‌ను అంగీక‌రించిన రుద్ర‌రాజు ఒక కండిష‌న్ కూడా పెడ‌తాడు. అదేంటి?  సురేంద‌ర్‌రాజు (శ‌త్రు) చేసిన త‌ప్పు ఏంటి? అత‌ని రాజ‌కీయ జీవితానికి కృష్ణంరాజు చేసిన అన్యాయం ఏంటి? త‌ండ్రి వ్య‌వ‌సాయ బాధ్య‌త‌ల‌ను తీసుకున్న కృష్ణంరాజు, ఆయ‌న బ‌తికి ఉండ‌గానే కుటుంబ బాధ్య‌త‌ల‌ను కూడా తీసుకున్నాడా? ఇద్ద‌రు మేన‌కోడ‌ళ్లు, మ‌ధ్య‌లో న‌చ్చిన అమ్మాయితో ఎలా న‌లిగిపోయాడు?  చివ‌రికి ఎవ‌రు క‌న్విన్స్ అయ్యారు? ఎవ‌రిని పెళ్లి చేసుకున్నాడు?  సురేంద‌ర్‌రాజు ప‌రిస్థితి ఏమ‌యింది? వ‌ంటివ‌న్నీ మిగిలిన అంశాలు

chinababu

ప్ల‌స్ పాయింట్లు
- కార్తీ, స‌త్య‌రాజ్‌, సాయేషా మిగిలిన వారి న‌ట‌న‌
- ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన విధానం
- ఇమాన్ పాట‌లు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌
- సిట్చువేష‌న‌ల్ కామెడీ

మైన‌స్ పాయింట్లు
- తెలుగువారికి అర్థం కాని త‌మిళ నేటివిటీ
- అన‌వ‌స‌ర‌మైన కొన్ని స‌న్నివేశాలు
- బ‌లవంతంగా చొప్పించిన విల‌నిజం

స‌మీక్ష‌
ఏ సంక్రాంతికో, ద‌స‌రాకో ఇలాంటి సినిమా వ‌చ్చి ఉంటే భారీ హిట్ కొట్టి ఉండేది. `చిన‌బాబు` ప‌క్కా పండుగ సినిమా. చ‌దువుల కోసం, ఉద్యోగాల కోసం ఎంత ప‌ట్ట‌ణాల్లో ఉన్నా.. మ‌న మూలాలు ప‌ల్లెటూళ్ల‌లోనే ఉంటాయి. పండ‌క్కో, ప‌బ్బానికి ఇంటిల్లిపాదినీ క‌లుసుకుంటే వ‌చ్చే ఆనందంతోనే మిగిలిన జీవితాన్నంతా సాగ‌దీస్తుంటాం. ఈ సినిమా చూస్తున్న‌ప్పుడు మ‌న ఇంట్లో వాళ్లంద‌రితో క‌లిసి భోజ‌నం చేసినంత ఆనందంగా అనిపిస్తుంది. తోబుట్టువులు, వాళ్ల ఇళ్ల‌ల్లో జ‌రిగే వేడుక‌లు, ఎవ‌రెవ‌రు ఏం చ‌దివిస్తున్నారోన‌నే ఆస‌క్తి, సారె పెట్ట‌డం... ఇవ‌న్నీ మ‌నం మ‌న ఇళ్ల‌ల్లో చూసే అంశాలే. అలిగే వారు కొంద‌రు, వారి అల‌క‌ల‌ను తీర్చేవారు మ‌రికొంద‌రు.. ఈ సినిమా అంతా ఇలాంటి అంశాల చుట్టూ సాగుతుంది. మంచి విందు భోజ‌నంలాంటి చిత్రంలో పంటికింద రాయిలా మ‌న‌కు ప‌రిచ‌య‌మైనా లేని త‌మిళ సంస్కృతి క‌నిపిస్తుంది. తెలుసుకోవ‌డంలో త‌ప్పులేదు కానీ, కొన్ని సార్లు, కొన్ని స‌న్నివేశాలు ఎందుకు వ‌స్తున్నాయో, పోతున్నాయో అర్థం కాదు. ఫ్యామిలీ ఎమోష‌న్స్ మాత్ర‌మే ఉంటే ఫైట్లు, యాక్ష‌న్ ఎపిసోడ్లు మిస్ అయిపోతాయ‌ని అనుకున్నారేమో.. ద‌ర్శ‌కుడు విల‌న్ పాత్ర‌ను సృష్టించారు. అయితే ఇందులోవిల‌నీ బ‌లంగా అనిపించ‌దు. ఒక వైపు హీరో విల‌న్‌ని అస‌లు ప‌ట్టించుకోడు. కానీ విల‌న్ మాత్రం ప‌గ ప‌గ అని అల్లాడుతుంటాడు. అది స‌రిగా అతికిన‌ట్టు అనిపిచందు. స్టార్టింగ్‌లో సూర్య క‌నిపించే స‌న్నివేశం మాత్రం అభిమానుల‌కు పండుగే. కొన్ని చోట్ల తెలుగు బోర్డులు పెట్టినట్టు, కొన్నిచోట్ల తెలుగు సాంప్ర‌దాయాల‌ను పెట్టి ఉంటే ఇంకా బావుండేది. సినిమా ఆద్యంతం రైతు గొప్ప‌దనాన్ని చెప్పిన తీరు, రైతును పాజిటివ్‌గా చూపించిన తీరు బావున్నాయి. 

రేటింగ్‌: 3/5
బాట‌మ్ లైన్‌: `చిన‌బాబు`.. మ‌న కుటుంబంలో వ్య‌క్తి.

English Title
Chinababu movie Review
Related News