రండి.. కేసీఆర్‌ను ఓడిద్దాం

Updated By ManamSat, 09/08/2018 - 00:07
Uttam kumar reddy
  • పార్టీలు, ప్రజాసంఘాలకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ పిలుపు

  • పొత్తులపై చర్చించేందుకు కమిటీ ఏర్పాటు..

  • రాహుల్, నెహ్రూ కుటుంబంపై వ్యాఖ్యలను ఖండించిన కుంతియా

 uttamహైదరాబాద్: రానున్న ఎన్నికలు  కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్యేనని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ రాష్ట్రానికి పట్టిన దుష్టశక్తి అని, దాన్ని తరమి కొట్టేందుకు తెలుగు దేశంతో సహా ఇతర విపక్షాలు, ప్రజాసంఘాలు, విద్యార్ధి, యువజన , మహిళా , ఉద్యోగ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర గ్రూప్‌లు అన్నీ తమతో కలిసి రావాలని ఉత్తమ్ పిలుపు ఇచ్చారు. శుక్రవారం నాడు గాంధీభవన్‌లో పీసీసీ విస్తృత సమావేశం జరిగింది. రానున్న ఎన్నికలు, పొత్తుల గురించి చ ర్చించారు. సమావేశం తీసుకున్న నిర్ణయాలను ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ ఆర్‌సీ కుంతియా, మల్లుభట్టి విక్రమార్క, గీతారెడ్డి, మధుయాస్కీగౌడ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికలు ఓ ధర్మయుద్ధమని, ఇందులో అందరూ కలిసి రావాలన్నారు. శాసన సభను ఎందుకు రద్దు చేశారో ఒక్క కారణం కూడా కేసీఆర్ చెప్పలేకపోయారన్ని ఉత్తమ్ విమర్శించారు. ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్న కేసీఆర్ ఇంత వరకు ఒక్క బీసీ సామాజిక వర్గానికైనా భవనం కట్టించారా అని ప్రశ్నించారు. ధర్మయుద్ధంలో మౌనంగా ఉన్నా అవతలివారికి సహకరించినట్లేనని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు. 

పొత్తుల కోసం కమిటీ
కలిసి వచ్చే ఇతర పార్టీలతో పొత్తుల కోసం చర్చించేందుకు ఓ కమిటీ వేస్తున్నట్లు ఉత్తమ్ ప్రకటించారు. ఈ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు, ఆర్సీ కుంతియా, మల్లుభట్టి విక్రమార్క, ప్రతిపక్ష నాయకుడు జానా రెడ్డి, మండలిలో విపక్ష నాయకుడు షబ్బీర్ అలీ సభ్యులుగా ఉంటారు. 

ఇంటికే బీఫామ్ 
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులపై ఇప్పటికే పలు మార్లు సర్వే నిర్వహించామని ఉత్తమ్ ప్రకటించారు. గెలుపు అవకాశాలు, సామాజిక న్యాయం ప్రతిపాదికన అభ్యర్ధులను పూర్తి మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. సీట్ల కోసం పైరవీలు చేసుకునేందుకు గాంధీభవన్‌కు రావొద్దని, అట్లాగే ఢిల్లీకి కూడా పోవద్దని, నాయకుల చుట్టూ తిరగాల్సిన అవసరంలేదన్నారు. పీసీసీ ఎంపిక చేసిన అభ్యర్థులకు బీఫావ్‌ును ఇంటికే పంపిస్తామన్నారు. 

11 నుంచి 18 వరకు జెండా పండుగ
ఈ నెల 11 నుంచి 18 వరకు కాంగ్రెస్ జెండా పండుగ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించామని ఉత్తమ్ తెలిపారు. ఈ రోజుల్లో అన్ని గ్రామాల్లో , ప్రతి ఇంటిపైనా, ప్రతి వాహనంపైనా కాంగ్రెస్ జెండాలు ఎగుర వేయాలని ఉత్తమ్ కోరారు. ఓటర్ల జాబితాలను పరిశీలించి, పేర్లు లేని వారితో, అర్హులైన వారితో వెంటనే దరఖాస్తులు పెట్టించాలని కోరారు. 

సచివాలయానికి రాని కేసీఆరే పెద్ద బఫూన్: కుంతియా
సచివాలయానికి రాని ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ తప్ప మరొకరు లేరని ఆర్సీ కుంతియా విమర్శించారు. అలాంటి కేసీఆర్ కంటే పెద్ద బఫూన్ ఎవరు ఉంటారని కుంతియా ప్రశ్నించారు. ప్రజలు మెజార్టీ ఇచ్చినా ముందస్తుకు ఎందుకు పోతున్నారో కేసీఆర్ ఎందుకు చెప్పలేకపోతున్నారని విమర్శించారు. కేవలం జాతకాల పిచ్చితోనే ముందస్తుకు పోతున్నారని, ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేరన్నారు. అభివృద్ధి చేశామని చెబుతున్న ముఖ్యమంత్రి తాను అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి వచ్చిన పెట్టుడులు ఎన్నో చెప్పాలన్నారు. తన మిత్రుడు మోదీని ఒక నెలలోనే మూడు సార్లు కలిసిన కేసీఆర్ తెలంగాణ కోసం ఏం సాధించారో చెప్పాలన్నారు. కేసీఆర్ కేవలం నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగానే మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మానసిక స్థితి సరిగాలేకే ఇష్టం వచ్చినట్లు అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా వద్దకు కుటుంబంతో సహా వెళ్లి కాళ్లుకు మొక్కినప్పుడు తెలియదా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీపైనా, నెహ్రూ కుటుంబంపైనా కేసీఆర్ చేసిన వ్యాఖ్యాలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

English Title
Come on, let's defeat KCR
Related News