119 స్థానాల్లో పోటీ

Updated By ManamSat, 09/08/2018 - 22:54
bjp
  • రాష్ట్రవ్యాప్తంగా 50 భారీ సభలు

  • 15న సమర శంఖారావం

  • అమిత్‌షా హాజరు, ప్రచార బాధ్యతలు ఆయనకే

BJPహైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ రద్దు నేపథ్యంలో కమలనాథులు ప్రత్యేక దృష్టిసారించారు.  ముందస్తు ఎన్నికల దృష్ట్యా మరింత దూకుడుగా వెళ్లనున్నారు. ఎన్నికలకు పూర్తిస్థాయిలో సమాయత్తమవ్వాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. టీఆర్‌ఎస్ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజల్లోకి వెళ్లనున్నారు. రాష్ట్రంలోని 119 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్నికల శంఖారావం పూరించడానికి భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 50 భారీ బహిరంగసభలు నిర్వహించనున్నారు. ఇప్పటికే 40మంది అభ్యర్థుల జాబితా ఆ పార్టీ అధిష్టానం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో గెలుపు బాధ్యత కమలదళపతి అమిత్ షా తన భుజాన ఎత్తుకోనున్నారు. అయితే రాష్ట్రంలో బీజేపీ తీసుకోవాల్సిన చర్యలపై ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ఆ పార్టీ జాతీయ సమావేశాల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

15న మహబూబ్‌నగర్‌లో సభ
ముందస్తు ఎన్నికల కోణంలోనే బీజేపీ అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానం సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అమిత్‌షాతో కలిసి సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణ బాధ్యతలు పూర్తిగా తానే చూసుకుంటానని భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సభలకు కేంద్రమంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు హాజరుకానున్నారు. ఇక కర్ణాటక ఎన్నికల బాధ్యతలు నిర్వహించిన పార్టీ జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి తెలంగాణలో తిష్ట వేసి, ప్రత్యేక వ్యూహాలు రచించనున్నారు. ఈ నెల 15న మహబూబ్ నగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారు. దీనికోసం రాష్ట్ర నేతలు భారీ జనసమీకరణ చేస్తున్నారు. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా రాష్ట్రనేతలకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కాగా ఇటీవల కిషన్‌రెడ్డి సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మహబూబ్ నగర్ సభలో రాష్ట్రంలో బీజేపీ ఆట మొదలవుతుంది. ఎలాగైనా రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అభ్యర్థుల ఎంపిక అధిష్టానిదే.. 
రాష్ట్రంలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక బీజేపీ అధిష్టానం తీసుకుంది. ఇప్పటికే 40మంది అభ్యర్థుల జాబితా సిద్ధంగా చేసినట్లు తెలుస్తోంది. జాబితా రూపకల్పనలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు సమాచారం. మేనిఫెస్టో కూడా అధినాయకత్వమే దగ్గరుండి చూస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో వివిధ కమిటీల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే బూత్‌స్థాయి కమిటీలు, శక్తి కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రచారం చేస్తున్నారు. ప్రచారానికి బీజేపీ అనుబంధ సంస్థలను కూడా వినియోగించుకుంటున్నారు. అయితే మహబూబ్‌నగర్‌లో జరిగే ఎన్నికల శంఖారావం సభ తర్వాత రాష్ట్రంలో కీలకపరిణామాలు చోటుచేసుకుంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు చెందిన పలువురు సీనియర్ నేతలు బీజేపీ నాయకులతో టచ్‌లో ఉన్నారని, త్వరలోనే కమలం తీర్థం పుచ్చుకుంటారని పేర్కొంటున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్ వ్యతిరేక శక్తులతో చర్చలు జరిపామని, కలిసొచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తామని చెబుతున్నారు. 

లోపాయికారీ ఒప్పందం..?
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు లోపాయికారీ ఒప్పందం చేసున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో తాజా పరిస్థితులు పరిశీలిస్తే ఈ ఆరోపణలకు బలం చేకూరుతున్నాయి. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీతో కేసీఆర్, కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ కావడం, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా గవర్నర్ ఆమోద ముద్ర వేయడం, ఒక స్థానం మినహా మిగతా నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట అభ్యర్థులను ప్రకటించకపోవడంతో రెండు పార్టీలు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నాయా అనే సందేహం అందరిలో కలుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బీజేపీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి టీఆర్‌ఎస్ పరస్పరం సహకరించుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అంతేకాకుండా 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏన్డీఏ కూటమికి సీట్లు తగ్గితే టీఆర్‌ఎస్ సహాయం తీసుకుంటారని భావిస్తున్నారు. 

Tags
English Title
Compete in 119 seats
Related News