రాష్ట్రంలో కాన్పు కష్టమే! 

Updated By ManamMon, 04/16/2018 - 04:24
1-pregnt-lady
  • ప్రసవం ఖరీదైన వ్యవహారం దేశ సగటు కన్నా ఖర్చు ఎక్కువ

  • గ్రామాలలో సగటు ఖర్చు 20 వేలు.. పట్టణాలు.. నగరాలలో పాతికపైనే

  • ఆపరేషన్లు ఆస్పత్రి బిల్లు... ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలు.. ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వేలో వెల్లడి

1-pregnt-ladyహైదరాబాద్: తెలంగాణలో బిడ్డకు జన్మనివ్వడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని జాతీయ స్థాయి సర్వే ఒకటి వెల్లడించింది. ఆస్పత్రుల్లో ప్రసవానికయ్యే సగటు ఖర్చు దేశం మొత్తం మీద మన రాష్ట్రంలోనే ఎక్కువని తేల్చింది. జాతీయ స్థాయి సగటు కన్నా రూ.7 వేలు ఎక్కువని పేర్కొంది. గ్రామస్థాయిలో ఈ ఖర్చు కాస్త తగ్గినా పట్టణాలలో సగటున    రూ.25 వేలు వెచ్చించాల్సిందేనని స్పష్టం చేసింది. సాధారణ ప్రైవేటు ఆస్పత్రులలో వేలల్లో ఉన్న డెలివరీ ఖర్చు కార్పొరేట్ ఆస్పత్రులకు వచ్చేసరికి లక్షల్లోనే ఉంటోందని తెలిపింది. అయితే, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకం ‘కేసీఆర్ కిట్’తో గ్రామాలలో పరిస్థితులు మారుతున్నాయని తెలిపింది. నిరుపేదలతో పాటు మధ్య తరగతి ప్రజలూ ప్రభుత్వ ఆస్పత్రుల వైపు చూస్తున్నారని వెల్లడించింది. ఈమేరకు నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్(ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ సర్వేలో సోషల్ కన్‌జంప్షన్ సర్వే ఆన్ హెల్త్(ఎస్‌సీఎస్‌హెచ్) కూడా పాల్గొంది.

జాతీయ సగటు రూ.13 వేలు..
దేశవ్యాప్తంగా ప్రసవం కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించే మహిళలు సగటున రూ.13 వేలు వెచ్చిస్తున్నారని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ పేర్కొంది. ప్రసవం కష్టం కావడమో, బిడ్డ అడ్డం తిరగడమో మరేదై నా కారణంతో వైద్యులు ఆపరేషన్‌వైపు మొగ్గడం ఈ పరిస్థితికి కారణమని తేల్చింది. ఇక తెలంగాణలో సీ సెక్షన్(ఆపరేషన్)ల సంఖ్య ఎక్కువేనని ఈ సర్వే వెల్లడించింది. ఆపరేషన్ తర్వాత తల్లీబిడ్డలు ఎంతకాలం ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చిందనే అంశమూ ఈ బిల్లును ప్రభావితం చేస్తోందట! బెడ్ చార్జీలు.. ఇతరత్రా ఖర్చులు సదరు కుటుంబంపై అదనపు భారం మోపుతోందని తెలిపింది. సగటున ప్రసవ ఖర్చు దేశవ్యాప్తంగా రూ.13,039 గా ఉంటే.. తెలంగాణలో మాత్రం ఈ మొత్తం రూ.20,645 లుగా ఉందని, అదీ గ్రామీణ ఆస్పత్రులలో వెచ్చించాల్సిన మొత్తమని సర్వే తేల్చింది. ఓ మోస్తరు పట్టణం నుంచి నగరాలలో ఈ సగటు మొత్తం రూ.25 వేలుగా ఉందని వెల్లడించింది. మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో సగటు ప్రసవ ఖర్చు రూ.13,657 మాత్రమేనట! అంటే.. దేశ సగటు కన్నా కాస్త ఎక్కువ! తెలంగాణలో మాత్రం ఈ వ్యత్యాసం రూ.7 వేలకు పైనే ఉందని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ పేర్కొంది.

జననాలు ఎక్కువే.. ఖర్చూ ఎక్కువే..
రాష్ట్రంలో జననాలు ఎక్కువేనని, దాంతోపాటు ప్రసవానికి అయ్యే ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటోందని సర్వేలో వెల్లడైంది. ఈ రెండింటితో పాటు సాధారణ ప్రసవాల కన్నా ఆపరేషన్ల సంఖ్య ఎక్కువ గా ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనివల్ల ఆపరేషన్‌కు అయ్యే ఖర్చుతో పాటు మందులు ఇతరత్రాలకయ్యే మొత్తం పెరుగుతోందని తెలిపింది. ఆపరేషన్ తర్వాత ఆస్పత్రిలో ఉండాల్సిరావడం ఖర్చును మరింత పెంచుతోందని, సాధారణ ప్రసవాలలో ఈ మొత్తం తగ్గుతోందని పేర్కొంది. సీ సెక్షన్ తర్వాత ఆస్పత్రిలో ఉండే రోజుల సంఖ్య కూడా తెలంగాణలో ఎక్కువని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ పరిశోధ కులు చెబుతున్నారు. ఇక రోజుల పసిగుడ్డుకు పాలివ్వడం మొదలు పెట్టిన తల్లులు ఆరు నెలలలోపే ఆపేస్తున్నారని వెల్లడించారు. ప్రతీ ముగ్గురు తల్లులలో ఇద్దరు తమ బిడ్డలకు పాలిచ్చే కాలాన్ని ఆరు నెలలకు కుదించేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు టీఆర్‌ఎస్ సర్కారు సీఎం కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే! ఈ పథకం కింద ప్రభుత్వ ఆస్పత్రులలో బిడ్డకు జన్మనిచ్చే తల్లులకు ప్రసవ సమయంలో అవసరమయ్యే వస్తువులను ప్రభుత్వం అందజేస్తోంది. తల్లీ బిడ్డలకు ప్రభుత్వ ఆస్పత్రులలో మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవడంతో పేద, మధ్య తరగతి ప్రజల రాక పెరిగింది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల సంఖ్య పెరిగిందని పరిశోధకులు చెబతున్నారు.

తెలంగాణలో బిడ్డకు జన్మనివ్వడానికయ్యే సగటు ఖర్చు:    రూ.20,645
జాతీయ సగటు వ్యయం:    రూ.13,039
ఆంధ్రప్రదేశ్‌లో సగటు వ్యయం:    రూ.13,657
తెలంగాణలో సగటున రూ.7,000లు ఎక్కువగా వెచ్చించాల్సి వస్తోంది
ప్రతీ మూడు జననాల్లో ఒకటి తక్కువ బరువుతో పుడుతున్నారు
 

Tags
English Title
The condition of the state is difficult!
Related News