కాంగ్రెస్ హామీలు ప్రజల్లోకి..

Updated By ManamSun, 09/23/2018 - 00:46
Uttam kumar reddy
  • వినతులు పరిగణలోకి తీసుకోవాలి

  • మేనిఫెస్టో కమిటీ సమావేశంలో ఉత్తమ్

uttamహైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ  అంటే నమ్మకం..భరోసా...ఇచ్చిన హామీలు అమలు చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంచేందుకు ప్రయత్నించాలని, అందుకోసం సాంకేతికంగా, న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా  అమలు చేసే హామీలనే ఎన్నికల ప్రణాళికలో చేర్చాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మేనిఫెస్టో కమిటీని కోరారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశంలో ప్రసంగించారు.  కమిటీ చైర్మన్ దామోదర రాజనరసింహ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలు చాలా ప్రధానమని, వాటిని ప్రజల్లోకి తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. రైతులకు రుణమాఫీ, 17 రకాల వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరలు, యువతకు నిరుద్యోగ భృతి, అధికారంలోకి రాగానే లక్ష ఉద్యోగాలు, పింఛన్ నగదు పెంపు, అర్హులందరికీ పెన్షన్లు తదితర హామీలను ఇప్పటికే ప్రకటించామని, కొన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకుని వారిచ్చే వినతిపత్రాల ఆధారంగా కూడా మేనిఫెస్టో రూపొందించాలని ఉత్తమ్ సూచించారు. 

ఈవీఎంల పరిశీలనపై అధ్యయనం చేయాలి 
ఓటర్ల నమోదు , ఈవీఎంల పరిశీలన తదితర అంశాలపై లోతుగా అధ్యయనం చేయాలని, ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు పార్టీ పరంగా అప్రమత్తంగా ఉండాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. కార్యకర్తల ఓటు నమోదు, కొత్త ఓటర్లను చేర్పించేందుకు కృషి చేయాలని కోరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ రామచంద్ర కుంతియా మాట్లాడుతూ, రాష్ట్రంలో లక్షలాది నకిలీ ఓటర్లు నమోదయ్యారని, ఈ విషయంలో పార్టీ పరంగా చేస్తున్న పోరాటాన్ని ఆయన అభినందించారు. ఈ సమావేశానికి టీపీసీసీ ఎన్నికల సమన్వయకమిటీ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి అధ్యక్షత వహించారు.

కాంగ్రెస్‌లోకి రాజవర్ధన్ రెడ్డి, బందూలాల్
టీఆర్‌ఎస్ నాయకుల అణచివేత ధోరణిపై విసుగెత్తిన ప్రజలు అసహనంతో ఉన్నారని, ప్రజలు తిరగబడే రోజులు ఎంతో దూరంలో లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం గాంధీభవన్ లో మహబూబాబాద్‌కు చెందిన సీనియర్ నాయకుడు రాజవర్ధన్ రెడ్డి, నగరంలోని కార్వాన్ నియోజకవర్గానికి చెందిన బందూలాల్ ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఉత్తమ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమలో మాజీ మంత్రి డీకే అరుణ కూడా పాల్గొన్నారు.

English Title
Congress guarantees people
Related News