పోల‌వరం కాంగ్రెస్‌ పార్టీ మానస పుత్రిక

Updated By ManamWed, 07/11/2018 - 16:31
Congress Leader Tulasi Reddy Fires On Chandrababu Naidu Over Polavaram Project

Congress Leader Tulasi Reddy Fires On Chandrababu Naidu Over Polavaram Project

  • కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరి పర్యటన మొక్కుబడి తంతు కాకూడదు

  • ప్రాజెక్టు నిర్మాణంపై మోడీ, బాబు సమాధానం చెప్పాలి

  • ఏపిసిసి ఉపాధ్యక్షులు  డాక్టర్‌ ఎన్‌.తుల‌సిరెడ్డి

అమరావతి: 2014లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చివుంటే ఈ పాటికి పూర్తయ్యేదని.. 2019 జూన్‌ చివరి నాటికైనా పూర్తి చేయాలని ఏపిసిసి ఉపాధ్యక్షులు  డాక్టర్‌ ఎన్‌.తుల‌సిరెడ్డి  చెప్పుకొచ్చారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర జనాభాపై భారం పడకుండా కేంద్ర నిధుల‌తో పూర్తి చేసి భూ నిర్వాసితుల‌కు న్యాయం చేయాలన్నారు. ఉన్నత ప్రమాణాల‌తో ప్రాజెక్టును నిర్మించాలన్నారు. ఏపీ ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలు అమలు, పోల‌వరం నిర్మాణంపై  ప్రధాని, మోడి, ఏపి సీఎం చంద్రబాబు ప్రజల‌కు సమాధానం చెప్పాల‌ని ఆయన డిమాండ్‌ చేశారు. పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు ప్రకృతి ప్రసాదించిన వరం అని అన్నారు. ఈ రోజు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరి పర్యటన మొక్కుబడి తంతు కాకూడన్నారు. 

"1981 మే 19న నాటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అంజయ్య శంకుస్థాపన చేశారు. 2004 జూలైలో నాటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి పరిపాలనలో మంజూరు చేశారు. 2004-2014 మధ్య కాంగ్రెస్ పాల‌నలో రాష్ట్ర బడ్జెట్‌ నుంచి రూ.5,136 కోట్లు ఖర్చు చేసి 32 శాతం పని పూర్తి చేయడమైంది. 25.10.2005న పర్యావరణ అనుమతి, 6.7.2006న వన్యమృగ సంరక్షణ అనుమతి, 2010 జూలైలో అటవీ అనుమతి, 4.1.2011న టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ అనుమతి తెప్పించడమైంది. జల‌యజ్ఞం క్రింద చేర్చడమైంది. విభజన చట్టంలో సెక్షన్‌ 90 ద్వారా జాతీయ ప్రాజెక్టుగా చట్టబద్దత కల్పించడమైంది. 20.2.2014న నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుందని ప్రకటించారు. 2014లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి వుంటే కేంద్ర ప్రభుత్వ నిధుల‌తో ఈ పాటికి పూర్తి అయ్యి వుండేది.

1998 నుంచి 2004 వరకు కేంద్రంలో ఆరుసంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ పోల‌వరంపై ఆరు పైస‌లు ఖర్చు పెట్టలేదు. 1983-2004 మధ్య 16 సంవత్సరాల‌ టిడిపి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ 16 పైస‌లు ఖర్చు పెట్టలేదు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్ర నిధుతో సత్వరం పూర్తి చేయాల‌ని చట్టం చెబుతున్నప్పటికీ ప్రాజెక్టు నత్తనడకన సాగుతుండటం శోచనీయం. భౌతికంగా 56 శాతం పని పూర్తయింది. ఇంకా 44 శాతం పనిమిగిలే వుంది. 
ఆర్థికంగా 26 శాతం ఖర్చు చేయడమైంది. ఇంకా 74 శాతం నిధులు విడుదల‌ కావాలి. రివైజుడు అంచనా విలువ రూ.54,113 కోట్లు ఇంత వరకు ఆమోదం పొందలేదు.


ఇప్పటి వరకు. రూ.13,798 కోట్లు ఖర్చు అయ్యింది. ఇంకా రూ.41,692 కోట్లు ఖర్చు చేయాలి.2019 జూన్‌ చివరి నాటికి కేంద్ర ప్రభుత్వ నిధుల‌తో ప్రాజెక్టును పూర్తి చేయాల‌ని, భూ నిర్వాసితుకు న్యాయం చేయాల‌ని, ఉన్నత ప్రమాణాల‌తో ప్రాజెక్టును నిర్మించాల‌ని, కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ డిమాండ్‌ చేస్తోంది" అని తులసిరెడ్డి చెప్పుకొచ్చారు.

English Title
Congress Leader Tulasi Reddy Fires On Chandrababu Naidu Over Polavaram Project
Related News