కాంట్రవర్సీ ‘షో’!

Updated By ManamSun, 08/12/2018 - 02:32
makutam

imageసాహసమే పెట్టుబడిగా సాగుతున్న టీవీ రియాల్టీ షోల సంఖ్య మనదేశంలో ఒక్కసారిగా పెరుగుతోంది. ఓ వైపు వీక్షకాదరణ లభిస్తుండడం, మరో వైపు ఇందులో పాల్గొన్నవారికి మంచి పాపులారిటీ వస్తుండడంతో అడ్వెంచరస్ రియాల్టీ షోలపై నిర్మాతలు దృష్టి పెడుతున్నారు. ఈ తరహా షోలకు యాంకరింగ్ చేయడమంటే కత్తి మీద సాము. అయినా కూడా రొటీన్ సినీ లైఫ్ నుంచి రిలీఫ్ కోసం ఇలాంటి బాధ్యతలను చేపట్టేందుకు సెలబ్రిటీలు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు.

గొడవలే ప్రధానం
image
సాధారణంగా వివాదాలు లేని, రాని రియాల్టీ షో అంటూ ఏదీ ఉండదు. ఏ షో అయినా వివాదాల పుట్టగానే మారుతున్న ప్రస్తుత తరుణంలో తెరమీద లేదా తెరవెనుక ఇలాంటి అడ్వెంచరస్ రియాల్టీ షోలు కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. ముఖ్యంగా అఫైర్లు ఇందులో భాగంగా మారాయి. బిగ్‌బాస్, రోడీస్, ఇండియన్ ఐడల్,  ఇండియాస్ గాట్ ట్యాలెంట్, కౌన్ బనేగా కరోడ్‌పతి, సారేగామా, డ్యాన్స్ ఇండియా డ్యాన్స్, గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ చాలెంజ్, మాస్టర్ షెఫ్.. ఇలా మనదేశంలో టాప్ టెన్ రియాల్టీ షోల్లో వివాదాలు వస్తూ పోతూ ఉంటాయి. ‘కామెడీ నైట్స్’ వంటి షోల్లో అయితే ఏకంగా చెప్పులతో కొట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. దీంతో షో చేసేవారి మధ్య గొడవలు తారస్థాయికి చేరి షో ఆగిపోయింది కూడా. ఇక ‘ఇండియన్ ఐడల్’లో దక్షిణాది పార్టిసిపెంట్స్ లేకపోతే ఈ రియాల్టీ షోకు రేటింగ్స్ చాలా తక్కువ వస్తాయన్న కారణంతో మన దక్షిణాది రాష్ట్రాల వారికి ఇటీవల కాలంలో విపరీతంగా ప్రాధాన్యం ఇస్తూ ఆఖరుకి విన్నర్స్ లేదా రన్నర్స్‌గా ప్రకటిస్తున్నారన్న ఆరోపణలు బలంగానే ఉన్నాయి. ‘బిగ్ బాస్’ పార్టిసిపెంట్స్ మధ్య ప్రేమలు, వివాదాలు చినికి చినికి గాలివానలా మారి బాహాటంగానే పంచాయితీలు జరుగుతూ వస్తున్నాయి. ఇక మాస్టర్ షెఫ్ పోటీల్లో పార్టిసిపెంట్స్‌ను ఇష్టానుసారం తిట్టే షెఫ్‌లు సృష్టించే భయానక వాతావరణంతో సాగిన ‘హెల్స్ కిచెన్’ ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. రామ్‌సే గార్డన్‌ను ఈ షో ద్వారా అసహ్యించుకునే వారు ఎంతమంది ఉన్నారో ఇష్టపడి షో చూసేవారు అంతేమంది ఉన్నారు.

బాలు కూడా..
‘పాడుతా తీయగా’ వంటి రియాల్టీ షోల్లో ఎస్పీ బాలసుబ్రమణ్యం చక్కగా పాడిన వారిని అభినందిస్తూనే మరో వైపు పాడటంలో ఉన్న తప్పులను ఎత్తిచూపే విధానం కూడా మొద ట్లో బాగా విమర్శలపాలైంది. ఇక ‘నేటి సింగర్లు ఇలా.. మా కాలంలో అలా’ అంటూ బాలు చెప్పే ఉదాహరణలు ప్రోగ్రామ్‌కు హాజరైన జడ్జిలను కూడా పలు సందర్భాల్లో బాధించడంతో కొందరు మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్లు ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టేలా చేస్తోంది. 

నానిపై సెటైర్లు
తెలుగు ‘బిగ్ బాస్ 2’కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హీరో నానిపై నెట్‌లో నడుస్తున్న సెటైర్లు, ట్రాలింగ్‌లు అన్నీ ఇన్నీ కావు. ఇక షోలో పాల్గొన్న తేజస్వి, భానుశ్రీల వివాదాలు షోను కాస్త అన్‌పాపులర్ చేసినా వివాదాలు లేని రియాల్టీ షోలు సాధ్యం కావని మరోమారు తేల్చిచెప్పాయి. ‘కౌశల్ ఆర్మీ’ పేరుతో నటుడు కౌశల్ ఫ్యాన్స్ నానితో సహా ఇతర పార్టిసిపెంట్స్‌పై నిత్యం ఇంటర్నెట్ వేదికగా చేస్తున్న వివాదాలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఆఖరుకి ఈ షోను నడిపిస్తోంది కౌశల్ ఆర్మీనే అనేలా సాగుతోంది సరికొత్త వివాదం.
- భార్గవి కరణం
 

image

 

English Title
Controversy 'Show'!
Related News