బాబు పాలనలో నష్టాల్లో సహకారం

Updated By ManamMon, 09/03/2018 - 23:40
jagan
  • సీఎం ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు

  • కె.కోటపాడులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ 

jaganవిశాఖపట్నం: చంద్రబాబు పాలనలో సహకార రంగం నష్టాల బాట పట్టిందని ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా 253వ రోజు సోమవారం విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర చేశారు. అనంతరం కె.కోటపాడు వద్ద బహిరంగ సభలో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో లాభాల బాటలో ఉన్న సహకార రంగాలను 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక పూర్తిగా నష్టాల్లోకి తీసుకెళ్లారని అని జగన్ అన్నారు. కేవలం నాలుగేళ్ల కాలంలో వేలకోట్ల నష్టాల్లోకి చెక్కర ఫ్యాక్టరీని తీసుకెళ్లారన్నారు. స్థానికంగా తయారు చేసే మోలాసిస్‌ను ప్రభుత్వం కేవలం 600కు కొని వారి బినామీలకు రెండు వేలకు అమ్ముతున్నారని ఆరోపించారు. సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబే అవినీతి, అక్రమాలకు పాల్పడి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. మాడగుల నియోజకవర్గానికి ఆయువుపట్టుగా ఉన్న రైవాడ రిజర్వాయర్ నీటిని విశాఖకు తరలిస్తున్నారని, దీంతో ఆయకట్టు రైతులు కష్టాలు పడుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ఆ నీటిని విశాఖకు తరలించి.. రైవాడ రిజర్వాయర్ నీటిని పూర్తిగా ఈ ప్రాంతానికే కేటాయించవచ్చన్నారు. కానీ చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి కాదన్నారు. చంద్రబాబు వారి బంధువులకు, బినామీలకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కాంట్రాక్టులు ఇచ్చి ఇష్టమొచ్చినట్లుగా దోచుకుంటున్నారని వైఎస్ జగన్ అన్నారు. చోడవరం, కోటపాడు మధ్య రోడ్లు దారుణంగా ఉన్నాయని జగన్ అన్నారు. చంద్రబాబు పాలనలో ఇసుక మాఫీయానే కాకుండా మట్టి మాఫీయా కూడా తీవ్ర స్థాయికి చేరిందన్నారు.నీరుచెట్టు పథకం కింద చెరువుల్లో విచ్చలవిడిగా తవ్వి మట్టిని దోచుకుంటున్నారన్నారు. మాడగులలో డిగ్రీ కళాశాలను నిర్మిస్తామని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిన చంద్రబాబు నాలుగేళ్లు దాటినా దానిని నెరవేర్చలేదన్నారు. ఈ ప్రాంతానికి కీలకమైన బోడ్డెరు ఆనకట్ట హుద్‌హుద్ తుఫాన్ అప్పుడు తెగిపోతే, దానిని ఇప్పటివరకు ఆధునీకరించలేదన్నారు. మంత్రి వర్గంలో ముస్లింలకు చోటు ఇవ్వలేదని ప్లకార్డులు చూపిన ముస్లిం పిల్లలపై చంద్రబాబు అక్రమ కేసులు బనాయించారన్నారు.  గతంలో కాపు ఉద్యమం సమయంలో తునిలో రైలును తగలపెట్టి.. వైసీపీపై నిందలు వేశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు పాలనలో అవినీతి, అన్యాయం, అక్రమాలు తప్ప ఇంకేం లేవన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నవరత్నాలను అమలు చేస్తామని, ప్రతి పేదవాడి కష్టాలు తీరుస్తామని జగన్ హామీ ఇచ్చారు. కాగా, సోమవారం పాదయాత్రకు ముందు పార్టీ శ్రేణులు నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు.

English Title
Cooperation in Babu's rule
Related News