తెలంగాణ గుండె ధైర్యానికి నిలువెత్తు రూపం

Updated By ManamSun, 09/09/2018 - 00:24
kaloji

imageతెలుగు వాళ్ళ రక్తనాళాల్లో కలిసిపోయిన కాళోజీ తెలంగాణ గుండె ధైర్యానికి నిలువెత్తు రూపం. శతాబ్దాల తరబడి పరాయి పాలనలో సుదీర్ఘకాలం బానిసత్వానికి, అణిచివేతకు, రాక్షస హింసకు గురైన తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన గొప్ప వక్తులలో ప్రజాకవి కళోజీ నారాయణరావుది అగ్రస్థానం. 1944 సెప్టెంబర్ 9న కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని రట్టిహళి గ్రామంలో జన్మించిన కాళోజీ వరంగల్ జిల్లా మడి కొండలో నివాసముంటూ మరణించేవరకు అహరహం శ్రమ జీవుల కోసం, పౌరహక్కుల సాధన కోసం, సామాన్యుని కోసం తపించి శ్రమించి, దోపిడి వ్యవస్థను ధిక్కరించిన కవి యోధు డు. తన పార్థివదేహం సైతం ప్రజావాళికి ఉపయోగపడాలని కాకతీయ మెడికల్ కళాశాలకు దానం చేసిన అభినవ శిబి చక్రవర్తి. కాళోజీ కాలం రెక్కలపై నడిచొచ్చిన కవి జీవిత కాలం ప్రజాక్షేత్రంలోనే ఉండి ప్రజల పక్షం నిలిచి పాలకుల అవ్యవ స్థను ప్రశ్నించాడు.

ప్రశ్నించడం నేర్పినవాడు. కవిత్వానికి అలంకారశాస్త్రాలు, విమర్శకులు ప్రమాణం కాదని, సామాన్య ప్రజల బాధలని గాథలని చిత్రించేటప్పుడు సామాన్యుడికి అర్థ మయ్యే రీతిలోనే కవితా శిల్పం ఉండాలని కాంక్షించాడు. కాళో జీ వ్యక్తిత్వం వజ్రతుల్యమైంది. అందుకే ఆయనను క్షోభ పెట్టిన ప్రతి సంఘటనను కవిత్వీకరించాడు. రూసో, సోక్రటీస్ లా ప్రశ్నించాడు. యుద్ధంలో ఫ్రాన్స్ కవులంతా చెల్లాచెదు రు గా పారిపోతే లూయి అరగాన్ ఒక్కడే దేశంలో నిలబడి ప్రజా విశ్వాసాన్ని వెల్లడించే గీతాలు రాశాడు. కాళోజీ లూయి అర గాన్ వంటివారు. అలా ఎవరికీ తెలియకుండా అజ్ఞాతంగానే ఉండి రచనలు సాగించాడు. తెలంగాణ మూగజీవాల హృద యాల్ని ప్రతిబింబింపజేశాడు అని శ్రీశ్రీ కాళోజీని ప్రశంసిం చాడు.

‘‘అవనిపై జరిగేటి అవకతవకలు చూసి
ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు
పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె
మాయమోసము జాచి మండి పోవును ఒళ్ళు’’

అని అన్నపుడే అర్థమైంది కాళోజీ అంతరంగ ఆర్ధ్రత, ఆగ్రహం. అంతులేనివని లోకంతో గొడవకు అదే మూలమని అర్థమైంది. మనిషి ఆర్తి ఆయన ఆలోచనల మూల పదార్థం. మనిషే ఆయన బతుకు పాఠ్యాంశం.
కాళోజీ జీవితం సుస్పష్టమైనది నిక్కచ్చిగా, నిర్మొహ మాటంగా నిర్భయంగా చెప్పడం మాట్లాడడం కవిత్వీక రించడం కాళోజీ నైజం. అన్యాయాన్నెదిరించడం ద్రోహ మైతే ఆ ద్రోహమే నా జన్మ హక్కు అనే సిద్ధాంత పునా దిపై నిలబడి సమాజంలో వివిధ రూపాలలో జరుగుతున్న అన్యాయాలను ఎదురించడాన్ని జన్మహక్కు చేసుకున్న కవి కాబట్టి అతడు ప్రజాకవి అయ్యాడు. 1969 నుండి 1972 వర కు తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తిని రగిలించినవాడు. తల్లి కోడి తన రెక్కల కింది పిల్లల్ని కాపాడుకున్నట్లు నిజాం నిరం కుశ పాలనలో తెలంగాణ ప్రజల్ని తన కవిత్వపు రెక్కల కింద రక్షించినవాడు.

ప్రజాకవి కాళోజీ కవిత్వం జంకుగొంకు లేకుండా నిర్భ యంగా నైజాం పాలనను వ్యతిరేకించింది. మధ్యయుగాల నా టి నిరంకుశ పాలన కళ్ళముందు సాగుతుండగా, ఆ పాలన కింద సతమతమై కష్టాలు పడుతున్న ప్రజలను చూసి తన కం ఠాన్ని విప్పిన కవి కాళోజీ. ‘మాతృదేశము’ అన్న గేయంలో 

లాఠిదెబ్బలు లక్ష్యమేమి
కఠిన శిక్షయే కాదు కాదు
చావుకైనను జంకనీయదు అని నిశ్చయంగా...

అని పలికాడు. నిజానికి ఇదొక గర్జన, మొక్కవోని ధైర్యం తో ఉద్యమ లక్ష్యసిద్ధిని కోరుతున్న కవి వేటినీ లక్ష్యపెట్టక, చావుకి జంకక, కఠిన శిక్షకు వెరువక ఉద్యమ ఆవేశాన్ని విస్తరిం చాడు. క్రూరమైన నిజాం ఫ్యూ డల్ అణిచివేత కా లం నుండి తు ది శ్వాస ఆడేదాకా అనేక మారు రూపాల దమన నీతికి వ్యతి రేకంగా పోరాడిన కలేజా కాళీజీ.

తెలంగాణ వేరైతే దేశానికి ఆపత్తా
తెలంగాణ వేరైతే తెలుగు భాషా మారుస్తారా
తెలంగాణ వేరైతే కిలోగ్రాము మారుతుందా
తెలంగాణ వేరైతే రూపాయికి పైసలు నూరు కాకపోతాయా

తెలంగాణ వేరైతే కోర్టు అమలు అధికారము మారుతుం దా-  అంటూ కాళీజీ ఎందుకు తెలంగాణ వద్దంటున్నారో చెప్పండంటూ ఆంధ్ర నాయకులను నిలదీసి ప్రశ్నించాడు. తె లంగాణ వేరైతే కులం తగ్గిపోతుందా... బలం సన్నగిల్లుతుందా, రూపాయికి పైసలు నూరు కాకాపోతాయా? అంటూ దేశానికి విపత్తు లాగా వేర్పాటువాద తెలంగాణను చూడడం సరికాదంటాడు. 1969లో విద్యార్థుల గుండెల్లోంచి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఉద్యమమంతా స్వచ్ఛందంగా తీవ్రతరంగా ఎగిసిందో ప్రతి సంఘటనను అక్ష రబద్ధం చేశాడు కాళోజి. తెలంగాణ ప్రజల ఆర్థిక సామాజిక, సాంస్కృతిక జీవన పురోభివృద్ధికి తెలంగాణ ఏర్పడాలని కాళో జీ చిత్తశుద్ధితో బలంగా అవిశ్రాంతంగా పోరాడాడు.

image


1946-48 మధ్య కాలంలో వరంగల్ కోటలో బత్తిని మొగిలయ్య అనే స్వాతంత్రోద్యమ కార్యకర్తను రజా కార్లు వెంటపడి చంపిన కొద్దిరోజుల్లో హైదరా బాద్ ముఖ్యమంత్రి ‘సర్‌మీర్జా ఇస్మాయి ల్’ వరంగల్ సందర్శించాడు. అప్పు డు కాళోజీ నగర బహిష్కరణ ఎదుర్కొంటూ హైదరాబాద్‌లో ఉండి ముఖ్యమంత్రికి ఇలా బహిరంగ లేఖ రాశాడు.

కోట గోడల మధ్య ఖూని జరిపిన చోట
గుండాల శక్తులు గోచరించినవా?
బజార్లో బాలకుని బల్లెంబుతో బొడుచు
బద్మాషునేమయిన వసిగట్టినావా?
మొగిలయ్య భార్యతో మొగలయ్య మాతతో
మొగమాటమును లేక ముచ్చటించితివా

...అని వేసిన ప్రశ్నలు తెలంగాణ అంతట మారు మోగి నాయి. తెలంగాణ ప్రజల హృదయాలలో రగిలే ఆవేశానికి ప్రతిరూపమే కాళోజి కవిత.

1946లో నిజాం ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని నిషేధించినపుడు
ప్రజా సంస్థపై పగసాధించిన
ఫలితము తప్పక బయటపడున్
నిక్కుచు నీల్గే నిరంకుశత్వము
నిల్వలేక నేలగూలున్

కాళోజీ కమ్యూనిస్టు పార్టీవాడు కాదు. కమ్యూనిస్టులతో సంబంధం కూడా లేదు. కాని ఒక ప్రజాపార్టీని నిషేధించ డంలో ప్రభుత్వ కుటీలనీతిని కనిపెట్టి ప్రభుత్వం గతి ఏమవు తుందో కవిగా తీర్పునిచ్చాడు. ఆ తర్వాత జరిగింది కూడా అదే తెలంగాణ సాయుధ పోరాటం ఉగ్రరూపం దాల్చింది. పోరాట యోధులు దొరల పనిపట్టారు. ప్రభుత్వాన్ని పతనం చేశారు. ప్రజారాజ్యాన్ని స్థాపించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య విలువలకు, ప్రజల హక్కులకు భంగం కలిగినప్పుడల్లా ప్రతిస్పందించి అధికారుల అధీకృత హింసను ప్రతిఘటిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణకై పాటుపడవలసిందిగా ‘నా గొడవ’ను వినిపించాడు కాళోజీ.

హింసను చేపట్టిన హిరణ్యకశపునిపై నరసింహస్వామి చేసి న ప్రతిహింస సరైనదే అంటూ సంప్రదాయక విశ్వాసాన్ని చెప్పి ప్రతిహింసను సమర్థించాడు. 1974 ప్రాంతంలో ప్రజల హక్కులకు భంగం వాటిల్లగా హక్కులను కాపాడుకోవడానికి ప్రజలు తిరుగబడితే ప్రభుత్వం హింసాయుతంగా ఉద్యమాన్ని అణిచివేసింది. ఆ పిరిస్థితుల్లో ప్రతిహింస తప్ప వేరే మార్గం లేదన్నాడు కాళోజీ. విశాల మానవ సాన్నిహిత్యాన్ని, స్నేహ మయ జీవితాన్ని కలలు కన్న కాళోజీని తలచుకోవడం ఇవాళ మనకెంతో స్ఫూర్తిదాయకం.

- ఆగపాటి రాజ్‌కుమార్
పరిశోధక విద్యార్థి, తెలుగు విభాగం, 
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్లు

English Title
courage of Telangana
Related News