ప్రమాదకర అసమానతలు

Updated By ManamSun, 09/23/2018 - 06:02
Dangerous disparities

imageభారత దేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలు అత్యంత ప్రమా దకరమైన స్థాయిలో ఉన్నాయి. దేశంలో వనరులు, ఉత్పత్తి, సేవల ద్వారా పెరిగే సంపద అతి కొద్ది మంది చేతిలోకి చేరుతోంది. దేశంలో జరిగే ఆర్థికాభివృద్ధి ద్వారా ఒక్క శాతం మంది మాత్రమే అపరి మితంగా లాభపడుతున్నారు. అత్యంత ధనవంతులు - కటిక దారిద్య్రం అనుభవించే పేదలు, అద్భుతమైన జాతీయ రహదా రులున్న మహానగరాలు - రోడ్ల సౌకర్యంలేని గ్రామాలు, ఆకాశ హర్మ్యాలు - మురికి వాడలు, ప్రపంచంతో పోటీపడే విద్యావంతులు - పాఠశాలలకు వెళ్లని 60 లక్షల మంది పిల్లలు - మాతృభాషలో పాఠ్యపుస్తకాలు చదవలేని 8 కోట్ల మంది విద్యార్థులు (14-18 మధ్య వయసు), అత్యంత ఆధు నిక సాంకేతిక పరిజ్ఞాపం, వంద ఉపగ్రహాలు ఒకేసారి పంపే సామర్ధ్యం - రైతులు, చేనేత కార్మి కుల ఆత్మహత్యలు... వంటి సంపద, పేదరికం సమ్మిళి తమైన చిత్రమైన దేశం  భారతదేశం. 25 శాతం మంది పట్టణవాసులు కనీస సౌకర్యాలు  కూడా లేకుండా మురికి వాడల్లో జీవిస్తున్నారు.

రోజుకు 2500 మంది పిల్లలు పౌష్టికాహారం లేక చనిపో తున్నారు. ప్రతి గంటకు ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇండియా స్పెండ్ అనే సంస్థ విశ్లేషించిన ప్రకారం దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో  89 శాతం మాత్రమే విద్యుదీకరణ జరిగింది. ఇంకా 2.3 కోట్ల కుటుం బాలకు విద్యుత్ సౌకర్యం లేదు. మొబైల్ ఫోన్ సేవలు ప్రారం భమై దాదాపు 23 ఏళ్లు  అయినా, ఇంకా 43 వేల గ్రామాలకు మొబైల్ నెట్వర్క్ అందుబాటులో లేదు.దేశంలోని 2.89 లక్షల గ్రా మాల్లో స్వచ్ఛమైన తాగు నీరు పాక్షికంగానే అందుబాటులో ఉందని కేంద్రం ఇటీవల  పార్లమెం టుకు తెలిపింది. ప్రస్తుతం 62,582 గ్రామాల్లోని ప్రజలు కలుషిత నీటినే తాగుతున్నట్లు చెప్పింది. 31,022 గ్రామాలకు రహదారులు లేవు.

మరో పక్క సామాజికంగా  ప్రజలను మనుషులుగా కాకుండా కులాలుగా గుర్తించే దయ నీయ స్థితి. భారతimage రాజ్యాంగం అమలులోకి వచ్చి 68 ఏళ్లు దాటింది. రిజర్వేషన్లను అమలుపరిచే, సమీక్షించే సరైన వ్యవస్థలేదు. దేశ వ్యాప్తంగా అనేక కులాల తాము ఇంకా ఆర్థికంగా, సామా జికంగా, విద్యాపరంగా అట్టడుగున ఉన్నామని, తమని ఎస్టీల్లో, ఎస్సీల్లో, బీసీల్లో చేర్చమని కోరు తున్నారు. అత్యంత దారుణంగా అతి కొద్ది మంది వద్ద సంపద కేంద్రీకరణ, పేదరికం, నిరక్ష రాశ్యత, రోజురోజుకి పెరుగుతున్న సామాజిక అసమానతల నేపధ్యంలో భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణించ వచ్చా? అభివృద్ధి చెందుతున్న దేశంగా గత 50 ఏళ్ల నుంచి పేర్కొంటున్నారు. అభివృద్ధి చెందడం అంటే ఉత్పత్తి, టెక్నాలజీ, సంపద వంటివేనా? ప్రజలు ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా, విద్యా, వైద్య పరంగా అభివృద్ధి చెందవలసిన అవసరం లేదా?  బ్రిటన్ కు చెందిన ఆక్స్ ఫామ్ అనే స్వచ్చంద సంస్ధ నివేదిక ప్రకారం 2016 నాటికి ఆర్థికంగా అత్యంత ఉన్నత స్ధానంలో ఉన్న(బిలియనీర్లు) ఒక శాతం సంపన్నుల చేతుల్లో దేశానికి చెందిన మొత్తం సంపదలో 58 శాతం పేరుకుపోయింది. ఆర్థికంగా దిగువ స్థాయి నుంచి ఉన్న 70 శాతం మందికి చెందిన సంపదకు ఇది సమానం. కేవలం 84 మంది బిలియనీర్ల వద్ద దా దాపు రూ.17,36,000 కోట్ల విలువైన సంపద ఉంది. బిలియనీర్ల సంఖ్య గత ఏడాది 101కి పెరి గింది. బిలియనీర్లు పెరుగుతున్నారంటే ఆర్థిక వ్యవస్థ బలపడినట్లు కాదు. సంపద అతి కొద్ది మంది వద్దకే చేరుతోంది. అదే సమయంలో మరో పక్క నిరుపేదల సంఖ్య పెరుగుతోంది. తీవ్రమైన ఆర్థిక అసమానతల మధ్య బిలియనీర్ల సంఖ్య పెరిగినందువల్ల ప్రయోజనం ఉండదు. అంతర్జాతీయ స్థాయిలో ఒక శాతం సంపన్నుల వద్ద 50 శాతం సంపద ఉంది. అంటే అంత ర్జాతీయ స్థాయికంటే మించిన స్థాయిలో ఇక్కడ సంపద ఒక శాతం ధనవంతుల వద్ద కేంద్రీకృతమై ఉంది.

ప్రపంచంలో ఏడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం మనది. అయితే దేశంలో ఆదాయం పెరుగుదల అత్యంత అసమానలతో కూడి ఉంది. ఆక్స్ ఫాం సర్వే ప్రకారం 2017లో దేశంలోని 73 శాతం సంపద ఒక్క శాతం మంది అత్యంత ధనవంతుల వద్దకు చేరింది. దేశంలోని దాదాపు సగం అంటే 67 కోట్ల మంది సంపద ఒక్క శాతం మాత్రమే పెరిగింది. గత ఏడాది 12 నెలల కాలంలో సంపన్నుల సంపద రూ.20,91,300 కోట్లు పెరిగింది. ఈ మొత్తం దాదాపు దేశ 2017-18 బడ్జెట్ తో సమానం.  ఈ విధంగా తీవ్రమైన ఆర్థిక, సామాజిక అసమానతలు ఏడాది కేడాది పెరిగిపోవడం సామాజిక స్థిరత్వానికి చాలా ప్రమాదకరం. దేశ ఆర్థిక వృద్ధి రేటు ఏడాది కేడాది పెరుగుతూ ఉంటే దేశం అభివృద్ధి చెందుతున్నట్లు లెక్క కాదు. పెరిగే సంపద మెజార్టీ భారతీయులకు చేరినాడే అభివృద్ధి చెందుతున్నట్లు భావించాలి. విధానాలలోని లోపం వల్లే అతి కొద్ది మంది సంపద అపరమితంగా పెరుగుతుంటే, దేశంలోని అత్యధిక మంది సంపద ఒక్క శాతానికి మించి పెరగడంలేదు. ఉత్పత్తి, సంపద, సాంకేతికతతోపాటు ప్రజలు ఆర్థిక, సామాజిక, విద్య, వైద్య పరమైన అన్ని అంశాలలో అసమానతలు లేకుండా అభివృద్ధి చెందాలి. సంపద, సాంకేతిక, రవాణా సౌకర్యాలన్నీ అందరికీ సమానంగా కాకపోయినా కొద్దిపాటి వ్యత్యాసంతో అందరికీ చేరాలి. సగటు ఆయుష్సు కూడా పెరగాలి. ఆనాడే అభివృద్ధి చెందుతున్న దేశంగా పేర్కొనవచ్చు. భారత రాజ్యాంగంలో 42వ సవరణ ద్వారా 1976లో  సామ్యవాదం అనే పదాన్ని   ప్రవేశికలో చేర్చారు. సామ్యవాదం అంటే.. సమసమాజ స్థాపన, ప్రజల మధ్య ఆర్థిక అంతరా లను క్రమంగా తగ్గించడం, ఉత్పత్తి శక్తులను (భూమి, శ్రమ, పెట్టుబడి) ప్రభుత్వం నియంత్రిం చడం ద్వారా సంపద కొద్ది మంది వ్యక్తుల చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా సాధ్యమైనంతవరకు జాతీయం చేయడం.

ఈ విధంగా ప్రజలకు సమాన అవకాశాలతోపాటు వాటిని అందిపుచ్చు కోవడానికి అవసరమైన తోడ్పాటును అందించడం. ఆచరణలో అందుకు విరుద్ధంగా జరుగు తోంది. రాజ్యాంగం అమలులోకి వచ్చి 68 ఏళ్లు, సామ్యవాదం అనే పదం చేర్చి 40 ఏళ్లు దా టింది. సర్వోత్కృష్ఠమైన భారత రాజ్యాంగాన్ని సమీక్షించి, విధానాలను, చట్టాలను సవరించు కోవలసి ఉంది.  ప్రజల మధ్య తీవ్రమైన ఆర్థిక, సామాజిక అసమానతలు, ప్రాంతాల మధ్య అసమానతలు భారీ స్థాయిలో ఉన్నప్పుడు దీనిని అభివృద్ధి చెందుతున్న దేశం అని ఎలా అన గలం. అభివృద్ధి చెందుతున్నది ఎవరు? అందరూ ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది.

- శిరందాసు నాగార్జున, 
సీనియర్ జర్నలిస్ట్
 9440222914

English Title
Dangerous disparities
Related News