ఎగుమతిదార్లకు ఊరట

Updated By ManamWed, 09/12/2018 - 22:33
elections

tvన్యూఢిల్లీ: మరమ్మతుల నిమిత్తం దిగుమతి అవసరమయ్యే మొబైల్ ఫోన్‌లు, కలర్ టీవీలు, నిర్దిష్ట వైద్య పరికరాల  వంటి కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతికి సంబంధించి ప్రభుత్వం నిబంధనలను సడలించింది. మరమ్మతుల అనంతరం ఈ వస్తువులను తిరిగి ఎగుమతి చేయాలనే షరతుపై సుంకాలు లేకుండా వాటి దిగుమతికి అనుమతి ఇస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.   ఎగుమతి చేసిన ఎలక్ట్రానిక్ వస్తువులను, వాటిని ఎగుమతి చేసిన ఏడేళ్ళ లోపల, మరమ్మతుల నిమిత్తం ఇప్పుడు దిగుమతి చేసుకోవచ్చు.  అయితే, వాటిని దిగుమతి చేసుకున్న ఏడాది లోపలే తిరిగి ఎగుమతి చేయవలసి ఉంటుంది.  ఇంతకు ముందు, ఎగుమతి చేసిన వస్తువులను తిరిగి దిగుమతి చేసుకునేందుకు వాటిని ఎగుమతి చేసిన మూడేళ్ల లోపు మాత్రమే అనుమతించేవారు. ఆరు నెలల లోపల వాటికి మరమ్మతులు చేసి తిరిగి  ఎగుమతి చేయాల్సి ఉండేది. జిరాక్స్ పరికరాలు, ప్రింటర్లు, మొబైల్ ఫోన్లు, కలర్ టీవీలు, ఎల్‌సీడీ/ఎల్‌ఈడీ ప్యానెల్‌లతో పాటు వైద్య పరికారాలైన ఈసీజీ, ఎంఆర్‌ఐ, అల్ట్రా సౌండ్ వంటి పరికరాలు వంటివి ఈ నోటిఫికేషన్ పరిధిలోకి వస్తాయి.  మరమ్మతుల నిమిత్తం ఆ వస్తువులను దిగుమతి చేసుకున్నవారు వాటికి మరమ్మతులు చేసిన తర్వాత, లేదా చక్కదిద్దిన తర్వాత, దిగుమతి చేసుకున్న ఏడాదిలోపలే వాటిని తిరిగి ఎగుమతి చేయకపోతే వారు కస్టమ్స్ సుంకాలను చెల్లించాల్సి ఉంటుందని సీబీఐసీ పేర్కొంది. ‘‘ఉత్పత్తుల తయారీ, ఎగుమతిదార్లకు ఇది స్వాగతించదగ్గ పరిణామం. ఎగుమతి చేసిన వస్తువులను మరమ్మతులకు దిగుమతి చేసుకుని తిరిగి ఎగుమతి చేసేందుకు దీర్ఘకాలిక సుంక రహిత సమయం దొరుకుతోంది ’’ అని ఈవై ట్యాక్స్ పార్ట్నర్ అభిషేక్ జైన్ అన్నారు.

Tags
English Title
Delight for exporters
Related News