ట్రిపుల్ అటాక్..

Updated By ManamSun, 02/11/2018 - 11:42
representational
  • ఒకేసారి డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా దాడి.. ఆందోళన చెందుతున్న వైద్య నిపుణులు

representationalన్యూఢిల్లీ: జ్వరం వస్తేనే అల్లాడిపోతుంటాం. మరి, ఆ జ్వరం మలేరియానో లేదంటే డెంగ్యూనో లేకపోతే చికెన్ గున్యానో అయితే.. పడే బాధలు చెప్పనలవి కాదు. మరి, మూడు కలిసి ఒకే సారి మన శరీరంపై దాడి చేస్తే.. ఊహించడానికే ఒళ్లు వణికిపోతుంటుంది కదా. ఆ మూడు కలిసి వస్తే.. చికిత్స మరింత కఠినమవుతుంది. ఆరోగ్య పరిస్థితి విషమిస్తుంది. ఇప్పుడు అలాంటి కేసులే నమోదవుతున్నాయి. ఆరోగ్య నిపుణులను కలవరపెడుతున్నాయి. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ)లో అలాంటి రెండు కేసులు డాక్టర్లను ఆందోళనకు గురిచేశాయి. ఆ కేసులకు సంబంధించిన వివరాలను డాక్టర్ మహ్మద్ అబ్దు్ల్లా వెల్లడించారు. 2016లో మూడేళ్ల చిన్నారి, 21 ఏళ్ల యువకుడు ఆ మూడు కేసులతో ఆస్పత్రిలో చేరారని చెప్పారు.

ఇద్దరికీ చలి, ఒళ్లునొప్పులు, తలనొప్పితో తీవ్రమైన జ్వరం ఉందని, ముందుగా చెక్ చేస్తే మలేరియా ఉన్నట్టు తేలిందని, మలేరియాకు చికిత్స చేస్తుండగా.. రిపోర్టులు చూసి షాక్ తగిలినంత పనైందని డాక్టర్ అబ్దుల్లా చెప్పారు. మలేరియాతో డెంగ్యూ, చికెన్ గున్యా కూడా దాడి చేసినట్టు తేలిందని వివరించారు. దీని నివారణకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జాతీయ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని సూచిస్తున్నారు. కాగా, గత జూన్‌లో ఈ మూడు కేసులతో 55 ఏళ్ల వ్యక్తి తమ ఆస్పత్రిలో చేరినట్టు శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇనిస్టిట్యూట్ కూడా చెబుతోంది. ఇక, దోమల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు అంతంత మాత్రంగానే ఉంటుండడంతో ఈ మూడు రోగాలు కలిసి విజృంభిస్తున్నాయని అపోలో ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ సూరన్‌జిత్ ఛటర్జీ చెబుతున్నారు. ఒకేసారి రెండు రకాల జ్వరాలతో ఆస్పత్రికి వచ్చే రోగులను ఇప్పటిదాకా చూశాం కానీ, ఇలా మూడింటి కలయికతో ఇన్‌ఫెక్షన్లు సోకడం ఆందోళన కలిగించే అంశమని అంటున్నారు. కాబట్టి యుద్ధప్రాతిపదికన దాని నివారణకు చర్యలు ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

English Title
Dengue Malaria Chikungunya Triple Attack
Related News