వాయుగుండం.. రెండు రోజులు భారీ వర్షాలు

Updated By ManamTue, 03/13/2018 - 16:25
Depression In Arabian sea Kerala Likely ToGet Heavy Rains
  • మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు.. సముద్రం పోటు మీద ఉంటుందని హెచ్చరిక 

Depression In Arabian sea Kerala Likely ToGet Heavy Rains

ఎర్రటి ఎండాకాలంలో చల్లటి వాయుగుండం ఏర్పడింది. దక్షిణ అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ వాయుగుండం ప్రభావం వల్ల రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాలకు తోడు పెనుగాలులు వీస్తాయని హెచ్చరించింది. అయితే, తెలుగు రాష్ట్రాలపై దాని ప్రభావం మాత్రం ఏమీ ఉండబోదు. దక్షిణ కేరళపైనే వాయుగుండం ప్రభావం చూపిస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం నాటికి దక్షిణ శ్రీలంక, మాల్దీవ్స్-కమొరిన్‌కు ఆనుకుని హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా పరిణామం చెందిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆ వాయుగుండం మంగళవారం ఉదయం 8.30 గంటలకు అరేబియ సముద్రం నైరుతీ తీరాన తిరువనంతపురానికి 390 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని చెప్పారు. ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా పరిణామం చెందే ప్రమాదముందని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చిరించింది. ఆ వాయుగుండం రాబోయే రోజుల్లో తమిళనాడు తీరాన్ని తాకే ప్రమాదముందని హెచ్చరించింది. సముద్రం ఉగ్రరూపం దాల్చే ప్రమాదముందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. కాగా, గత ఏడాది వచ్చిన ఓఖీ తుఫాను నేపథ్యంలో వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఓఖీ తుఫానుపై ముందే హెచ్చరించినా సరైన చర్యలు తీసుకోవడంలో కేరళ ఎల్డీఎఫ్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. 

English Title
Depression In Arabian sea Kerala Likely ToGet Heavy Rains
Related News