హస్తినలో ధర్నా

Updated By ManamTue, 02/13/2018 - 02:06
jagan
  • ముహూర్తం.. మార్చి 5.. ప్రతిపక్ష నేత జగన్ వెల్లడి

  • ప్రత్యేక హోదాయే డిమాండు.. నెల్లూరు భేటీలో పార్టీ నిర్ణయం

  • ఎంపీల రాజీనామాపైనా చర్చ.. ఇప్పుడే వద్దన్న ప్రతిపక్ష నేత

jaganనెల్లూరు/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద మార్చి 5వ తేదీన భారీ ధర్నా నిర్వహించాలని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు పునఃప్రారంభం అవుతున్న సందర్భంగా అదే రోజు దేశ రాజధాని వేదికగా ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్.. అక్కడే ముఖ్యనాయకులతో సోమవారం సుదీర్ఘంగా రెండు గంటల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై ముమ్మరంగా చర్చలు జరిగాయి. చర్చల అనంతరం నిర్ణయాలను పార్టీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి వెల్లడించారు. ఢిల్లీలో నిర్వహించే ధర్నాలో పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారన్నారు. మార్చి ఒకటో తేదీన ముందుగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అలాగే మూడో తేదీన పార్టీ ముఖ్య నాయకులంతా పాదయాత్రలో పాల్గొంటారన్నారు. అనంతరం అదే రోజు వైఎస్ జగన్ జెండా ఊపి నాయకుల ఢిల్లీ యాత్రను ప్రారంభిస్తారన్నారు. భవిష్యత్తు కార్యాచరణ గురించి కూడా సమావేశంలో చర్చించామన్నారు. ప్రత్యేక హోదా మన హక్కు.. ప్యాకేజి మాకొద్దు అనేదే పార్టీ నినాదమని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా అనేది ఏపీకి సంజీవని లంటిదని, కానీ హోదాతో సమాన ప్యాకేజి అంటూ ఇన్నాళ్లూ చంద్రబాబు కల్లబొల్లి కబుర్లు చెప్పారని భూమన ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాకు చంద్రబాబు సర్కారు సమాధి కట్టిందని ఆయన మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతామని, అవసరమైతే రాజీనామాలు చేయడానికి కూడా తమ పార్టీ ఎంపీలు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. కాగా ఈ సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. 

రాజీనామాలపై చర్చ
సమావేశంలో ప్రధానంగా ఎంపీల రాజీనామాలపై ముమ్మరంగా చర్చ జరిగినట్లు తెలిసింది. ప్రత్యేకహోదా కోసం సభలో గట్టిగా పట్టుబట్టి.. అవసరమైతే వెంటనే రాజీనామాలు చేయాలని కొంతమంది నాయకులు ప్రతిపాదించారు. అయితే, రాజీనామాలు చేయడం వల్ల తక్షణ ప్రయోజనం ఏమీ ఉండబోదని.. పైగా దానివల్ల సభలో మాట్లాడే అవకాశం లేకుండా పోతుందని జగన్ సూచించినట్లు సమాచారం. పార్లమెంటు సమావేశాలు మళ్లీ ప్రారంభం అయ్యేలోగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రాష్ట్రంలో రాజకీయ పార్టీలు గట్టిగా డిమాండు చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ కూడా ఎంపీల రాజీనామా దిశగా ఆలోచిస్తున్న నేపథ్యంలో, వాళ్ల కంటే ముందుగానే రాజీనామాలు చేస్తే ప్రజల్లో సానుభూతి వస్తుందని ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక కీలక నేత ప్రస్తావించగా.. దాన్ని జగన్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. ఎప్పుడన్న విషయాన్ని పక్కన పెడితే, రాజీనామాలు మాత్రం చేయాల్సిందేనని అందరూ ఏకగ్రీవంగా అభిప్రాయపడినట్లు సమాచారం.

English Title
Dharna in hastina
Related News