అసెంబ్లీలో ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర అసంతృప్తి..!

Updated By ManamTue, 03/13/2018 - 12:14
Dhulipalla Narendra Kumar

Dhulipalla Narendra Kumar

అమరావతి: గుంటూరులో అతిసార వ్యాధి విషయంలో మున్సిపల్ శాఖ తీరుపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల అనంతరం మాట్లాడిన ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాలింగ్ అటెన్షన్ ద్వారా అతిసార విషయాన్ని ధూళిపాళ్ల ప్రస్తావించారు. రాజధానికి 30 కిలోమీటర్ల దూరంలో అతిసార కారణంగా 10మంది చనిపోతే సభలో కనీసం ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు. అతిసార నివారణపై అధికార యంత్రాంగం స్పందించలేదన్నారు. ఫిర్యాదు వచ్చిన 3 రోజులకు అధికారులు స్పందించారన్నారు.

" గుంటూరు జిల్లాలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కలుషితమైన నీరు తాగడం వలన తీవ్ర అస్వస్థతతో వందలమంది ఆస్పత్రి పాలయ్యారు. 10మంది ప్రాణాలు కోల్పోవడం దురుదుష్టకరం. సమస్య తీవ్రతను ప్రభుత్వ పరంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరముంది. ఆస్పత్రిలో ఉన్న రోగులను పరామర్శించిన ఉన్నతాధికారులు, మంత్రులు, నేతలు వెళ్లారు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా కచ్చితమైన కారణాలు చెప్పుకపోవడం బాధాకరం. అసలు ఈ వ్యవహారంపై స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం ఎందుకు స్పందించలేదన్నది నా ప్రశ్న" అని ధూళిపాళ్ల ఒకింత అసంతృప్తికి లోనయ్యారు.

తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలా జరగడమా..?
"నలభై ఏళ్ల కిందట తాగునీటి పైపులైన్ వేశామని సంబంధిత మంత్రి గారు చెబుతున్నారు.. కాదని నేను చెప్పట్లేదు. కానీ పర్యవేక్షించే బాధ్యత మున్సిపల్ అధికార యంత్రాంగం మీద ఉంది. ఎప్పటికప్పుడు శాంపిల్స్ తీయడం, చెక్ చేయడం, వాటర్ క్వాలిటీ చెక్ చేయడం ఇవన్నీ కూడా అధికారులు మరిచిపోయారు. నిజంగా అదే జరిగుంటే సమస్య ఇందాకా వచ్చేది కాదు. ఈ ఘటనలో కొంత మంది అధికారులు సస్పెండ్ చేశామని చెబుతున్నారు.. కానీ వారు ఏ స్థాయి అధికారులో నాకు అర్థం కావట్లేదు?. మన ప్రభుత్వం.. తెలుగుదేశం సమస్య ఉన్నచోటు స్పందిస్తుంది. కానీ మనం ఈ విధంగా పొంతనలేని సమాధానాలు చెప్పడం సబబు కాదు. కచ్చితమైన కారణాలు చెప్పకుండా ఫలానా అయ్యిండొచ్చు అని చెప్పడం బాధాకరం.. అసలు ఇలాంటి సమాధానం ప్రభుత్వం పరంగా రావడం కరెక్టు కాదు"అని ఆయన చెప్పుకొచ్చారు.

కచ్చితమైన కారణాలేంటో మంత్రి చెప్పాల్సిందే..!
కలకలం రేపిన గుంటూరు ఘటనలో మంత్రి కచ్చితమైన కారణాలు చెప్పాలని ఈ సందర్భంగా ధూళిపాళ్ల డిమాండ్ చేశారు. ఇది మామూలు విషయం కాదని వందల మంది ఆస్పత్రులపాలవ్వడం.. పది మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో సభకు సరైన సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్న మంత్రి నిర్దారించకపోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై సమగ్రమైన నిర్ణయం తీసుకొని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై విచారణ జరిపి.. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చనిపోయిన వారి కుటుంబీకులకు ప్రభుత్వం పరంగా సాయం చేయాలని ఈ సందర్భంగా ఆయన సర్కార్‌‌కు సూచించారు.

English Title
Dhulipalla Narendra Kumar Discontent In AP Assembly Over Guntur Diarrhea Incident
Related News