నేటి నుంచి బర్రెల పంపిణీ

Updated By ManamSat, 08/11/2018 - 04:10
buffalo
  • రూ. 1500 కోట్ల బడ్జెట్.. ఒక్కో దానికి రూ.80 వేల ధర

  • ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం సబ్సిడీ.. బీసీలు, ఇతరులకు 50 శాతం

  • అదనంగా రవాణాకు రూ.5వేలు.. బీమాతో పాటు 300 కిలోల దాణా

  • అవగాహన లేమితో ఆసక్తి చూపని పాడిరైతులు

tsహైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమంతో పాటు ఆర్థికం గా అభివృద్ధి చెందేందుకు ప్రతిష్టా త్మకంగా పాడి బర్రెల పంపిణీ కార్య క్రమాన్ని చేపట్టింది. ఈ పథకాన్ని శనివారం వరంగల్ అర్బన్ జిల్లాలోని ముల్కనూరులో డిప్యూటీ సీఎం కడి యం శ్రీహరి, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వంద మందికి పాడి బర్రెలను పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలోని పాల సహకార సంఘాల్లోని సభ్యులకు రూ.1500కోట్ల వ్యయంతో పాడిబర్రెలను సబ్సిడీపై పంపిణీ చేయనుంది. ఫలితంగా విజయ డెయిరీ పరిధిలోని 63,304 మంది సభ్యులు, ముల్కనూరు మహిళా డెయిరీలో 19,307 మంది, కరీంనగర్ డెయిరీలో 57,206 మంది, మదర్ డెయిరీలో 43,006 మందికి సబ్సిడీ బర్రెలు అందనున్నాయి. అయితే ఒక్కో పాడి బర్రెకు రూ.80వేలను ధరగా నిర్ణయించారు. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు 75శాతం, బీసీలు, ఇతరులకు 50శాతం సబ్సిడీని ప్రభుత్వం చెల్లించనుంది.

బర్రెలకు బీమా..
ప్రభుత్వం ఒక్కో బర్రె ధరను రూ.80వేలుగా నిర్ణయించింది. ఈ ధరకు మేలురకమైన బర్రెలు ఇతర రాష్ట్రాల్లో అందుబాటులో ఉంటాయి. స్థానికంగా తెలంగాణ ప్రాంతంలో ఉండే బర్రెలు రోజుకు నాలుగు లీటర్లకు మించి ఇచ్చే పరిస్థితి లేదు. అంత డబ్బు పెట్టి స్థానికంగా దొరికే బర్రెలు తీసుకుంటే.. ప్రయోజనం ఉండదు. దీంతో రైతులు ఎక్కువగా పాలిచ్చే హరియాణ, ముర్రా జాతి వంటి మేలు రకాలను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చేందుకు ఆసక్తి చూపుతారు. గతంలో కొంతమంది పాడి రైతులు అధిక పాల దిగుబడినిచ్చే మేలు జాతి పాడిబర్రెలను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చా రు. అక్కడి వాతావరణ పరిస్థితులకు.. ఇక్కడి వాతావరణ పరిస్థితులకు తేడా ఉండడంతో అధికశాతం బర్రెలు మృత్యువాతపడ్డాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోసారి ఆ బర్రెల వైపు చూసేందుకు పాడి రైతులు ఆసక్తి చూపలేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం పాడిగేదెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో బర్రెలు ఇక్కడి వాతావరణాన్ని తట్టుకోలేవనే భావనతో చాలామంది వెనకడుగు వేశారు. ఈ విషయాన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఒక్కో బర్రెకు యూనిట్ కాస్ట్‌లో మూడేండ్ల పాటు బీమా సౌకర్యం కల్పించడంతో పాటు 300 కిలోల దాణాను ప్రభుత్వం ఇవ్వనుంది. రైతులు కోరుకున్న ప్రాంతంలో ఎంచుకున్న పాడి బర్రెను కొనుగోలు చేసి ఇచ్చే విధంగా అధికారులు మార్గదర్శకాలు రూపొందించారు. అంతేకాకుండా ఒక్క పాడి బర్రెకు రూ.5వేల చొప్పున రవాణా కోసం అదనంగా చెల్లిస్తోంది.

రూ.40 వేలు చెల్లించలేకే..
- సామ నిర్మల, నల్లగొండ

రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పాడి బర్లకు రూ.40 వేలు కట్టాలని జెప్పిండ్రు. పేపర్లనేమో ఉచితంగా పంపిణీ జేస్తమని రాసిండ్రు. అయినా ఒక్క దానికి రూ.40 వేలు యాడదెచ్చి కట్టాలె. అప్పోసప్పో తెచ్చి కడ్దామంటే.. అయి బతుకుతయో లేదో తెల్వదు. పోయినసారి ఊళ్ల అట్లనే తెచ్చిన బర్లు సచ్చినయ్. బర్రె సస్తే.. అప్పు మీద పడ్తదని ఈసారి పైసలు కట్టలేదు.

English Title
Distribution of bulls from today
Related News