విభజన మూల్యం

Updated By ManamSat, 03/10/2018 - 07:56
image

imageఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు, వివక్ష, అణచివేతలు కాదన లేకపోయినా, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చు కునేందుకు తగినంత ప్రజాప్రతినిథుల మూక బలం ఉండేదికదా అని కొందరు వగర్చుతున్నారు. వారి వగర్పాటు పట్టించుకోకపోయినా విభజన చట్టం హామీలకంటే అధికంగా మరెన్నో అవకాశాలతో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్ర యోజనాలకోసం పాటుపడతామని బీజేపీ అధినేతలు నాలుగేళ్ళ క్రితం చేసిన వాగ్దానాలు నీటిమీద రాతలుగానే మిగిలాయి. ప్రత్యేక ప్యాకేజీలతో ఉద్ధరించక పోతే పోనీ, కనీసం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని 94వ షెడ్యూలు ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామికాభ్యున్నతి కోసం పన్ను రాయితీలకు తోడుగా తప్పనిసరిగా చేపట్టవలసిన కొన్ని ఆర్థిక చర్యల నైనా  కేంద్రం అమలు చేసేందుకు ప్రయత్నించాల్సి ఉంది. మళ్లీ సార్వత్రిక ఎ న్నికలు సమీపిస్తున్న నాటికీ విభజన చట్టంలోని కనీస అంశాలు, రాష్ట్రాల అవసరాలు తీర్చడంలో కేంద్రం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తెలుగు వారిలో ఆగ్రహం పెల్లుబికింది.

                 ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో వెనకబడిన ప్రాం తాల అభివృద్ధికి వీలుగా భౌతిక, సామాజిక, మౌలిక సదుపాయాల విస్తృతి సహా మరికొన్ని అభివృద్ధి పథకాలకు కేంద్రం సహకారమందించాలని విభజ న చట్టం హామీలను నెరవేరుస్తున్నామని కేంద్రం లెక్కలు చూపుతోంది. అయితే వెనకబడిన ప్రాంతాల్లో ఏర్పాటుచేసే పరిశ్రమలకు కేంద్రం అందిస్తున్న రా యితీలు, నిధులు కేవలం కంటితుడుపు చర్యలుగా మిగిలిన విషయంపై రెం డు రాష్ట్రాల ప్రజల్లో అసంతృప్తి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఏడాది ఆర్థిక బడ్జెట్‌లను కేంద్రం నుంచి అందే అద్వైత సహకారంతో కూడిన ఊహా జనిత అంచనాలు, లెక్కలతో రెండు రాష్ట్రప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి. 2018- 19 ఆర్థిక సంవత్సరానికిగాను ఆంధ్రప్రదేశ్ విత్తమంత్రి యనమల రామకృ ష్ణుడు గురువారం ప్రవేశపెట్టిన రూ.1.91 లక్షల కోట్ల భారీ బడ్జెట్ ఆద్యంతం నంబర్ గేమ్‌ను తలపింపచేసింది. కేంద్రం నుంచి విభజన హామీలు, ప్రత్యేక ప్యాకేజీలు అందక, ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూ కేంద్రీకృతమైన రెవెన్యూ ఆదాయం విభజన తర్వాత లేకపోవడంతో ఆదాయపు వనరులు లేక, అనేక ఆర్థిక బాల్యారిష్టాలతో కునారిల్లుతున్న రాష్ట్రానికి కేంద్రం చేయూత అం దించకపోవడం మరీ దారుణం. నవ నిర్మాణ దీక్ష, పునర్నిర్మాణ మహాయజ్ఞం తలపెట్టి నిధులు సక్రమంగా అందని తెలుగు రాష్ట్రాల పరిస్థితి దయనీయంగా తయారైంది. 

                    మిషన్ భగీరథ తాగునీటి పథకం, మిషన్ కాకతీయ సాగునీటి పథకాలను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణ ప్రభుత్వానికి నిధులు అందించకపోవ డంతో తెలంగాణ ప్రభుత్వాన్ని అసహనానికి గురిచేస్తోంది. అదేవిధంగా విభజనలో పారిశ్రామిక వనరులను కోల్పోయి వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మారిన నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కేటాయించకుండా మోదీ ప్రభు త్వం తన రాజకీయ ప్రయోజనాన్ని మాత్రమే చూసుకోవడం బాధ్యతా రాహిత్యం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు ముప్పై సార్లు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర పాలకులతో మొరపెట్టుకున్నా పట్టించుకున్న కమల నాథుడే లేడు.

                         నవ్యాంధ్రప్రదేశ్‌కు 5 ఏళ్ళు కాదు, పదేళ్ళ కాలం ప్రత్యేక హో దా కేటాయించాలని, కేంద్ర సంచిత నిధి నుంచి రూ. 10వేల కోట్లు నూతన రాష్ట్ర రెవెన్యూ లోటు భర్తీకోసం కేటాయించాలని ఘంటా భజాయించిన వెంకయ్యనాయుడు ప్రయత్నాలు ఏ ప్రయోజనాల్లో కరిగిపోయాయో తెలియ డం లేదు. బిడ్డ కోసం తల్లిని చంపేశారని వ్యాఖ్యానిస్తూ నవ్యాంధ్రప్రదేశ్‌కు ఢిల్లీని మించిన రాజధాని నిర్మాణానికి అన్ని విధాలుగా సహకరిస్తామని ప్రధాని మోదీ ప్రకటించినా, రాజధాని శంకుస్థాపన సమయంలో పిడికెడు మట్టి, కాసిన్ని యమునా నది నీళ్ళు తప్ప ఎలాంటి సహకారమూ అందించక పోవడం చారిత్రక అన్యాయం. చిట్టచివరి ఎన్నికల బడ్జెట్ వచ్చేంత దాకా ప్రతిసారీ బడ్జెట్ ప్రతిపాదనల్లో తెలుగు రాష్ట్రాలకు రావలసిన న్యాయమైన కేటాయింపులు ఉండకపోతాయాయని చెకోర పక్షుల్లా ఎదురుచూస్తూ, కేంద్ర పాలకుల్ని మచ్చిక చేసుకునే చర్యలతో రాష్ట్ర పాలకులు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం శూన్యం. పైగా అనుకున్నట్లుగానే వేల కోట్లు నిధులను తెలుగు రాష్ట్రాలకు అందిస్తున్నామని కేంద్రం లెక్కల ప్రచారం చేసింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేటాయించకూడదని, ఆయా రాష్ట్ర అభివృద్ధి అవసరాలకు తగిన నిధులను కేటాయించే విధా నం అమలులోకి వచ్చిందని ఆర్థిక మంత్రి జైట్లీ చెబుతుంటే అలాంటి నిర్ణయ మేమీ తీసుకోలేదని ఆర్థిక సంఘం సభ్యులు అభిజిత్ సేన్ గతంలోనే స్పష్టం చేశారు. విభజన హామీలను నెరవేర్చకుండా ఇబ్బందిపెట్టడమే కాకుండా, పెద్దనోట్ల రద్దుతో ఏర్పడిన ద్రవ్య చలామణి గందరగోళం, జీఎస్టీ పేరుతో రాష్ట్రాల ఆదాయాన్ని సైతం కేంద్రం ఖాతాలోకి మళ్లించే చట్టాన్ని కేంద్రం రూ పొందించడంతో గోరుచుట్టుపై రోకటి పోటులా తెలుగు రాష్ట్రాలు విలవిల్లాడి పోయాయి.

                            ప్రత్యేక దృష్టి, ప్రత్యేక తోడ్పాటు పేరుతో నవ్యాంధ్రప్రదేశ్‌కు కేం ద్రం పూర్తిగా అండదండలు అందిస్తుందని చెప్పిన మాటలన్నీ నీటి మూట లుగా మిగిలాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనకబడిన జిల్లాల అభివృద్ధి, పోలవరం, రాజధాని నిర్మాణాలకు ఆర్థిక సహాయం విషయంలో కేంద్రం అర కొర నిధులిచ్చి అంత చేశాం, ఇంత చేశాం అని ప్రకటనలు చేస్తోంది. గత బడ్జెట్‌లో బెంగళూరు మెట్రో, ముంబయి సబర్బన్ల విస్తృతికి వేల కోట్ల రూపాయలు కేటాయించిన కేంద్రం తెలుగు రాష్ట్రాల విషయంలో పక్షపాతంతో వ్యవ హరించింది. ఈ నేపథ్యంలో నవ్యాంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ప్రభు త్వం కేంద్రంతో పోరాట వైఖరిని చేపట్టింది. ప్రభుత్వమే బడ్జెట్ కేటాయింపు ల్లో కేంద్రం వివక్షకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలతో కలసి రాష్ట్ర బంద్‌ను నిర్వ హించాల్సి వచ్చింది. కేంద్ర మంత్రివర్గం నుంచి టీడీపీ మంత్రులు రాజీనామా లు చేశారు. ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో తలపడేందుకు చంద్రబాబు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్రం విధానాలను తీవ్రంగా దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగానే వ్యవసాయం దివాలాతీసి, రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. బడ్జెట్ కేటాయింపుల్లోను, విభజన హామీలను నెరవేర్చడంలోనూ తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని అభిశంసించారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఒక్క తాటిపై తెచ్చి సమాఖ్యస్ఫూర్తిని కొనసాగించే లక్ష్యంతో థర్డ్ ఫ్రంట్  ఏర్పాటుకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రాబోయే సార్వ త్రక ఎన్నికల సందర్భంగా రాజకీయ సమీకరణాలు ఎలా మారినా, వివిధ రాజకీయ పక్షాలు వంతుల ప్రకారం ‘విభజన మూల్యం’ చెల్లించక తప్పదు.

English Title
Division cost
Related News