చీకటి వెలుగుల రంగేళి!

Updated By ManamWed, 11/07/2018 - 07:29
Diwali

హరిత దీపావళితో పర్యావరణాన్ని, 
ప్రజారోగ్యాన్ని పరిరక్షించుకుందాం!

దీపావళి అంటేనే ‘దీపాల శ్రేణి’ సంబురం. దీప జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిద ర్శనంగా భావిస్తారు. దీపాలను సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీక లుగా భావిస్తారు. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలం శరధ్రు తువులో దీపావళి అరుదెంచడం విశేషం. ప్రాణశక్తికి ప్రతీక దీపం.. ఆనందానికి మరో రూపం. చీకటిని పారదోలి వెలుగునిచ్చే సాధనం. అసత్యంపై సత్యం సా ధించే విజయానికి ప్రతీక దీపం. అజ్ఞానం నుంచి జ్ఞానానికి, దుఃఖం నుంచి ఆనందానికి, నిరాశలోంచి ఆశాభావంలోకి చేరాలన్న మనిషి నిరంతర తపనకు దీపం సంకేతం. ఆనందోత్సాహాలతో జాతి, కుల, మత వర్గ భేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే దీపావళి పండుగ భారతీయ బాహుళత్వ సంస్కృతికి ప్రతి బింబం. నరకాసురవధ, రావణుడిపై రాముని విజయం వంటి పురాణ గాథల మాట ఎలా వున్నా చీకటిని, కష్టాలను పారదోలుతూ వెలుగు, సుఖాలు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి నిలుస్తుంది. పంచభూతాలలో ప్రధాన మైనది అగ్ని. ఈ అగ్ని ప్రాణికోటి మనుగడకు ఉపకరించే తేజస్సును, ఆహారాన్ని ఐహికంగాను, విజ్ఞాన ధర్మగరిమను ఆధ్యాత్మికంగాను ప్రసాదిస్తుంది. అంతేగాక మానవులకు విజ్ఞానం, వివేకం, వినయాలకు దీప ప్రజ్వలన సంకేతమని భారతీయుల నమ్మకం. 
 

image

కృష్ణదేవరాయల కాలంలో దీపావళిని లక్ష్మీ ఉత్సవంగా జరుపుకునేవారు. నిజానికి ఈ దీపావళి పండుగ అన్ని దేశాల్లోనూ వివిధ రూపాల్లో ఉంది. అగ్నిపై మానవుని విజయానికి, ఆ ప్రకృతి శక్తిని మానవీకరించడానికి సంకేతమే ఈ దీపా వళి పండగని ప్రపంచంలో వివిధ జాతుల ప్రజలు దీపాల పండుగను జరుపు కుంటారని చరిత్రకారులు చెబుతున్నారు. దీపావళి సరదా పండుగే అయినా అందులో గొప్ప దార్శనికత ఉంది. కొందరు ఈ పండుగను అనవసరంగా డబ్బు లు తగలేసే పండుగని, పర్యావరణ విధ్వంసక సంబురమని విమర్శించడంలో వాస్తవం ఎంత ఉన్నప్పటికీ ఇంటిల్లిపాదికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని చేకూర్చే పండుగ ఇది. దేశవ్యాప్తంగా ఒక్క దీపావళి పండుగ రోజు కాల్చే టపాకాయల విలువ వందల కోట్లు చేస్తుంది. తమిళనాడులోని శివకాశిలో ఉన్న 8 వేలకు పైగా ఉన్న బాణసంచా పరిశ్రమలు భారత దేశంలోని 90 శాతం టపాసులను ఉత్పత్తి చేసి, వెయ్యి కోట్లకు పైగా టపాసుల వ్యాపారం జరుగుతుంది. అయితే దేశ రాజధాని ఢిల్లీ సహా దేశవ్యాప్త నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో దీపావళి రోజున జరిగే సంబురాల్లో తగలేసే టపాకాయలు నుంచి విడుదలవబోతున్న కాలుష్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బాణసంచాతో మిరుమిట్లు గొలిపే దీపావళి పండుగకు ముందుగానే దేశ రాజధానిలో వాయు కాలుష్య ప్రమాదపు ఘంటి కలు మోగిస్తున్నాయి. ఆదివారం నాటికి తగ్గిన తీవ్రత దీపావళికి ముందు సోమ వారం నాడు సురక్షిత పరిమితి కంటే 20 రెట్లు ప్రమాదకర స్థాయికి పెరిగింది.

మందిర్ మార్గ్, జవహర్ నెహ్రూ స్టేడియం, మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడి యం ప్రాంతాలలో గాలిలో నలుసులు తీవ్రస్థాయిలో ఉన్నట్లు రికార్డు అయింది. గత ఏడాది దీపావళి సమయంలో ఢిల్లీలో కాల్చిన బాణసంచా వల్ల పి.ఎమ్. 2.5 (నలుసు పదార్థ కాలుష్యం 2.5) కాలుష్యం సురక్షిత పరిమితి కంటే 6.6 రెట్లు పెరిగిందని సీఎస్‌ఈ అధ్యయనం వెల్లడించింది. అయితే దీపావళికి ముందే 20 రెట్లు ప్రమాదకర స్థాయికి చేరుకున్న రాజధానిలో కాలుష్యం వల్ల ఎలాంటి విపత్తు ముంచుకొస్తుందో? సుప్రీంకోర్టు దీపావళి రోజు రాత్రి రెండు గంటలు మాత్రమే బాణసంచా కాల్చాలని స్పష్టమైన ఆదేశాలిచ్చినా, ఆ తీర్పును దేశ వ్యాప్తంగా అమలు జరిపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి కనీస మాత్రం ప్రయత్నం కూడా చేయలేదని పర్యావరణ వేత్తలు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు చెందిన అంశాలపై (శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల ఆడవాళ్ళ ప్రవేశం వగైరా) సుప్రీంకోర్టు ఆదేశాల అమలు తరచూ వివాదాస్పదంగా మారాయి. అదేతీరులో దీపావళి సంబురాల్లో బాణసంచా వినియోగంపై హరిత టపాసులే వినియోగించాలని, రెండుగంటలే టపాసుల సంబురాలు జరుపుకోవాలని సుప్రీం కోర్టు ఆంక్షలు విధించినా అమలు చేసే యంత్రాంగం లేక పోవడం, సామాజిక మాధ్యమాల్లోనూ, కొన్ని హిందుత్వ సమూహాలు ఆ ఆంక్షల్ని ధిక్కరించడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈసారి కూడా దీపావళి సృష్టించే వాయు కాలుష్యం భారతీయులకు ఒక సవాలుగా మారనుంది. 
 

image

దీపావళి పేరుతో వివిధ కార్పొరేట్ కంపెనీలు ఆఫర్లు, అక్షయ తృతీయ పేరుతో నగల వ్యాపారం, బట్టల వ్యాపారం ఒక్కటేమిటి వివిధ రకాల చిన్న పెద్ద వ్యాపారాలు జోరందుకుంటాయి. దాంతో సమాజమంతా కళకళలాడుతూ అంద ర్ని సంతోషపెట్టే దీపావళి అంటే చిన్న పెద్దలందరికీ ఎంతో సంతోషం, సరదా. అయితే మాల్స్ వచ్చిన దగ్గర నుంచి వీధి చివరి దుకాణాదారులు, రోడ్ల వెంబడి చిల్లర వ్యాపారస్తులకు తీవ్ర నష్టం వాటిల్లింది. విదేశీ సంస్కృతి మీద మోజుతో స్వదేశీయలకు తీవ్రనష్టం కలిగిస్తూ చైనా టపాసులు వంటి అనేక సరకులను మాల్స్‌లో వేలకు వేలు ఖర్చుచేస్తూ, చిరు వ్యాపారస్తుల దగ్గర కొనేటప్పుడు మాత్రం గీసిగీసి బేరమాడుతుంటారు.

ప్రముఖ, కంప్యూటర్లు, ప్రింటర్ల మేకింగ్ కంపెనీ హెచ్‌పీ ఇండియా ‘వీధి వ్యాపారస్తులకు మద్దతు తెలపండి.. మన ఇళ్ళలోని దీపాలు వారి ఇళ్ళలో కూడా కాంతులు నింపుతాయి’ అని చిరు వ్యాపారులకు సాయం చేసినప్పుడే, వారి బతుకులు కళకళలాడినప్పుడే నిజమైన దీపావళి అనే ఉద్దేశంతో చేసిన ‘ఉమ్మీద్ కా దియా’ అనే యాడ్ ఇప్పుడు నెటి జన్లను తెగ ఆకట్టుకుంటోంది. ప్రమిదల్లో తైలాన్ని నింపి దీపాలు వెలిగించి, బాణ సంచా ఆర్భాటంగా కాల్చినంత మాత్రాన దీపావళి రాదు. ప్రజలందరిలో సుఖ సంతోషాలను, ఆకలి కేకలు వేసే చిన్నారుల కళ్లల్లో వెలుగులు నింపినపుడు,  పర్యావరణ విధ్వంసక, భూతాపాన్ని పెంచి మానవ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చే, విషకాలుష్యాలను వెదజల్లే బాణసంచాను కాల్చకుండా నిగ్రహంగా వ్యవ హరించినపుడు నిజమైన దీపావళి వచ్చినట్లవుతుంది. ఓ చిరుదివ్వెను వెలిగిం చినా అది చీకటిని పారదోలి వెలుగు పువ్వులు నింపుతుంది. పర్యావరణ విధ్వం సాన్ని చొరవతో నిరోధించి, సామాన్యులకు జీవనోపాధిని కల్పించి వారి జీవన ప్రమాణాలు పెంచే విధానాలను ప్రభుత్వాలు చేపడితే దేశంలో నిజమైన దీపావళి వెల్లివిరుస్తుంది.

భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకొని ఉదాసీనమైన, చీకట్లు అలుముకుంటున్న స్థితి నుంచి ఉత్సాహభరితమైన, వెలుగులు విరజిమ్మే ఆశలు, ఆకాంక్షలతో దృఢ సంకల్పాన్ని ప్రోదిచేసుకునేందుకు ఈ సందర్భంగా వ్యక్తులు, వ్యవస్థలు పునఃసంకల్పించాలి. ప్రజల జీవితాల్లో పండుగ వాతావరణం తీసుకు రావటం కోసం ప్రభుత్వాలు ప్రజల కొనుగోలు శక్తిని పెంచే విధానాల రూప కల్పనకు శ్రీకారం చుట్టడం ద్వారా దీపావళి ముఖ్య ఉద్దేశాన్ని, స్ఫూర్తిని సాకారం చేసి వారి బతుకుల్లో వెలుగులు తీసుకురావాలి. 

English Title
Diwali
Related News