వర్సటీల స్వతంత్రత దెబ్బతీయొద్దు

Updated By ManamTue, 07/17/2018 - 01:07
Sri Hari
  • నేరుగా నిధులిచ్చే మార్గదర్శకాలుండాలి.. అధ్యాపకులకు ఇన్‌సర్వీస్ శిక్షణ తప్పనిసరి..

  • రాష్ట్రాల హక్కులను హరించడం తగదు.. ఉన్నత విద్యామండలి బిల్లు సరిగాలేదు

  • 20వ తేదీలోగా కేంద్రానికి ప్రతిపాదనలు.. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడి

imageహైదరాబాద్: ఉన్నత విద్యా మండలి చట్టం ముసాయిదా విశ్వవిద్యాలయాల స్వంతంత్రను దెబ్బతీసే విధంగా ఉందని, రాజ్యాంగపరవైున రాష్ట్ర హక్కులను కేంద్రం హస్తగతం చేసుకోవడం మంచిదికాదని డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. కేంద్రం.. యూజీసీ స్థానంలో ఉన్నత విద్యామండలి చట్టాన్ని తీసుకొస్తున్న నేపథ్యంలో సోమవారం అంబేద్కర్ యూనివర్సిటీలో వీసీలు, విద్యావేత్తలు, నిపుణులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ చట్టాల సంస్కరణలు సామాన్యులకు విద్యనందించే విధంగా ఉండాలని, వర్సిటీలకు నేరుగా నిధులిచ్చే మార్గదర్శకాలుండాలని అభిప్రాయపడ్డారు. ఈ బిల్లుపై పూర్తిగా చర్చించి, సీఎం ఆమోదం తర్వాత ఈ నెల 20వ తేదీలోగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని ఆయన చెప్పారు. అధ్యాపకులకు ఇన్‌సర్వీస్ శిక్షణ కచ్చితంగా ఇవ్వాలని కోరారు. శ్వవిద్యాలయాల అధికారులను నేరుగా నియమిస్తూ అధికార వికేంద్రీకరణ చేయడం మంచిదికాదన్నారు. ఇటీవల కేంద్రమే కొన్ని వర్సిటీల్లో వీసీలను నియమించడం కూడా తప్పుడు సంకేతాలు పంపే ప్రమాదముందన్నారు. కేంద్రం ప్రతిపాదించిన బిల్లులో ఎక్కువగా బ్యూరోక్రాట్లు ఉండి, తక్కువ సంఖ్యలో విద్యావేత్తలు, నిపుణులు ఉన్నారని, ఈ విధానం కూడా మంచి విద్యా వ్యవస్థకు అనుకూలం కాదన్నారు. విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీల నమోదులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో ఉందన్నారు.  ఇప్పటికే దేశంలో నూతన విద్యావిధానంపై ఒక కమిషన్ వేసి, నివేదిక రాకుండానే మళ్లీ కొత్త కమిషన్ వేసి అభిప్రాయాలు అడగటం వల్ల ప్రయోజనంలేదన్నారు. కొత్త సంస్కరణలు తీసుకొచ్చే ముందు ప్రజలు, సంబంధిత భాగస్వాముల అభిప్రాయాలు తీసుకొనే సమయం ఇవ్వాలన్నారు. రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాల అవసరాలు మేరకు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు రాజ్యాంగం కల్పించిందని, కొత్త బిల్లు వల్ల ఈ వెసులుబాటును తొలగించే విధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రతిపాదలను పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలు తమ గళాన్ని వినిపిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీలు  కేశవరావు, అసదుద్దీన్ ఒవైసీ, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి, అంబేద్కర్ ఒపెన్ యూనివర్సిటీ వీసీ సీతారవు, ఉన్నత విద్యామండలి వైఎస్ ఛైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Tags
English Title
Do not damage the autonomy of the Varsity
Related News