కమిటీలతో కాలయాపన వద్దు 

Updated By ManamSat, 09/22/2018 - 22:55
ramakrishna
  • పాత పింఛన్ పునరుద్ధరించాలి

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి 

  • ఉద్యోగులతో కలిసి ప్రత్యక్ష ఆందోళనలు

  • రౌండ్‌టేబుల్ సమావేశంలో నిర్ణయం

ramakrishnaవిజయవాడ: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసేందుకు కమిటీలతో కాలయాపన చేయవద్దని సీపీఐ. సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని, లేకుంటే ఉద్యోగ సంఘాలతో కలిసి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.  శనివారం విజయవాడ దాసరి భవన్‌లో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో సీపీఎస్ రద్దు కోసం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్), వైసీపీ, ఆమ్ ఆద్మీ నేతలు, వివిధ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన సీపీఐ నాయుకుడు రామకృష్ణ మాట్లాడుతూ, సీపీఎస్‌పై ప్రభుత్వం వైఖరిని స్పష్టం చేయకుండా, కమిటీలతో కాలయాపన చేయడాన్ని వామ పక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయన్నారు. పాత పింఛన్ విధానాన్నే అమలు చేయాలని దశలవారీగా చేపట్టిన ఉద్యమం విజయవంతమైందన్నారు. చలో అసెంబ్లీ పిలుపుతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఒక మిలిటెంట్ తరహాలో ఉద్యమించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారన్నారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలలో సీపీఎస్ రద్దుపై కొనసాగిన ఆందోళనలు ప్రభుత్వాన్ని గడగడ లాడించాయన్నారు. శాసనమండలిలోనూ పీడీఎఫ్ ఎమ్మెల్సీలు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారని గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో సీపీఎస్ సమస్య ఉందని, దీనిపై పెద్దఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ, ప్రపంచీకరణ విధానాలతోనే సీపీఎస్‌ను దేశంలో ప్రవేశపెట్టారన్నారు. పార్లమెంటులో సీపీఎస్‌పై చట్టం చేస్తున్న సమయంలో వామపక్ష పార్టీలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయని, మిగిలిన పార్టీలన్నీ మౌనంగా ఉన్నాయని గుర్తుచేశారు. ఫ్యాప్టో ఆధ్వర్యాన సీపీఎస్ రద్దు చేయాలంటూ సీఎం చంద్రబాబు మెడలు వంచేలా ఉద్యో గులు, ఉపాధ్యాయులు ఉద్యమించారని ప్రశంసించారు. భవిష్యత్తులో ఇది ఒక బలమైన ఉద్యమంగా మారబోతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెండు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతల వెనుకున్న ఉద్యోగ, ఉపాధ్యాయులంతా స్వచ్ఛందంగా సీపీఎస్ ఉద్యమంలోకి రావాలని సూచించారు. ఈ సమావేశాంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వర్లు(వైవీ), వైసీపీ నేత పి.గౌతమ్‌రెడ్డి, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నాయకుడు పోలారి, ఆమ్‌ఆద్మీ పార్టీ  నాయకులు పోతిన వెంకట రామారావు, ఏఐబీఈఏ నాయకులు బీవీవీ కొండలరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు, ముస్లిం జేఏసీ నాయకులు సుధీర్, ఆల్ యూనివర్శిటీస్ సీపీఎస్ యూనియన్ నాయకులు భానుప్రసాద్, ఫ్యాప్టో చైర్మన్ పి.బాబురెడ్డి పాల్గొన్నారు.

English Title
Do not delay the committees
Related News