కరువు రక్కసి కాటుకు సింధూ నాగరికత బలి!

Updated By ManamMon, 04/16/2018 - 16:27
Drought Washed Out Indus Valley Civilisation
  • కరువు రక్కసి వల్లే అంతరించిన నాindus valley civilisation representationalగరికత

  • 900 ఏళ్ల పాటు పీడించిన కరువు కాటకాలు

  • ఐఐటీ-ఖరగ్‌పూర్ అధ్యయనంలో వెల్లడి

ఖరగ్‌పూర్: ఆధునిక నాగరికతకు మూలం ఓ రకంగా సింధు నాగరికతే అని చెబుతుంటారు. అయితే, కాలం మరుతున్నా కొద్దీ ఆ సింధూ నాగరికత కూడా అంతరించిపోయింది. మరి, ఆ సింధు నాగరికత అంతరించిపోవడానికి గల కారణాలను సమాజం ముందుంచారు ఐఐటీ-ఖరగ్‌పూర్ (ఐఐటీ-కేజీపీ) శాస్త్రవేత్తలు. ఎప్పుడో 4,350 ఏళ్ల క్రితం కనుమరుగై పోయిన ఆ నాగరికత.. కేవలం కరువు రక్కసి వల్లే కనిపించకుండా పోయిందట. దాదాపు 900 ఏళ్ల పాటు కరువు రక్కసి పీడనకు బలైపోయిందట. ఆధారాలతో సహా ఐఐటీ-కేజీపీ శాస్త్రవేత్తలు దానిని నిరూపించారు. అంతేకాదు, అప్పట్లో కరువు కేవలం 200 ఏళ్లే ఉందన్న వాదనలకూ తెరదించుతూ.. దాదాపు 9 శతాబ్దాల పాటు కరువు కాటకాలు విజృంభించాయని శాస్త్రవేత్తలు తేల్చారు. దానికి సంబంధించిన కథనం ప్రఖ్యాత త్రైమాసిక అంతర్జాతీయ జర్నల్ ఎల్సీవర్‌లో ప్రచురితమైంది.

5 వేల ఏళ్ల క్రితం నుంచి ఉన్న వర్షాకాల పరిస్థితులను అధ్యయనం చేసిన ఐఐటీ-కేజీపీ భూగర్భ, భూభౌతిక స్వరూప శాఖల శాస్త్రవేత్తలు ఈ సరికొత్త విషయాలను వెలుగులోకి తెచ్చారు. నదీ తీరాల వెంబడి జలం ఆధారంగా జీవనం సాగించిన పౌరులు.. రానురాను కరువు కాటకాలతో వారికి ప్రాణాధారమైన ఆ నీరే లేకుండా పోవడంతో వలస బాట పట్టినట్టు శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో తేల్చారు. అలా అలా వర్షాలు బాగా కురిసే తూర్పు, దక్షిణ ప్రాంతాల వైపునకు తమ వలసలను కొనసాగించినట్టు శాస్త్రవేత్తలు తమ అధ్యయనం ద్వారా తేల్చారు. లేహ్-లద్ధాఖ్‌లోని ‘సో మొరిరి సరస్సు’లో 5 వేల ఏళ్ల నాటి వర్షాకాల పరిస్థితులను శాస్త్రవేత్తలు అధ్యయనం చేయగా ఈ విషయాలు తేలిశాయి. ఒకప్పుడు ముసురు పెట్టిన ఆ ప్రాంతంలోనే ఒక్క చుక్క కూడా లేని పరిస్థితులు రాజ్యమేలినట్టు గుర్తించారు.

‘‘ఒకప్పుడు నాగరికత అలరారిన ఆ ప్రాంతంలోనే క్రీస్తు పూర్వం 2,350 (4,350 ఏళ్ల క్రితం) నుంచి క్రీస్తు పూర్వం 1450 వరకు అక్కడ తీవ్ర వర్షాభావ పరిస్థితులు రాజ్యమేలాయి. రానురాను కరువు రక్కసి కాటేయడం.. భూములు బీడు వారడంతో పచ్చదనం, పచ్చిక ఉండే ప్రదేశాలవైపు జనాలు వలస వెళ్లడం ప్రారంభించారు. అలా అలా సింధూ నాగరికత మొత్తం అంతరించిపోయింది’’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన అనిల్ కుమార్ గుప్తా అనే శాస్త్రవేత్త వివరించారు. గంగ-యమున తీరాల్లోని ఉత్తర ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, బెంగాల్, మధ్యప్రదేశ్, విదర్భ, దక్షిణ గుజరాత్ తదితర ప్రదేశాలకు తరలిపోయారని గుప్తా వివరించారు. 

English Title
Drought Washed Out Indus Valley Civilisation
Related News