చెట్టులెక్కగలవా.. ఓ టీచరమ్మ!

Updated By ManamThu, 10/26/2017 - 14:06
Teachers-Net-SignalS
  • ఈ-హాజరు కోసం టీచర్ల తిప్పలు
  • గ్రామాల్లో అందని ఇంటర్‌నెట్ సిగ్నల్
  • చెట్లు.. పుట్టలు ఎక్కుతున్న వైనం
  • నడివయసులోనూ తప్పని తిప్పలు

Poor interent, signal problem, Teachers, climb, tree, E-attendance

శ్రీకాకుళం/ విజయునగరం/సాలూరు రూరల్, అక్టోబరు 26 (మనం న్యూస్): ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయులలో చాలా మందికి చెట్లు, పుట్టలు ఎక్కక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులందరికీ ఈ-హాజరు విధానాన్ని అమలు చేస్తోంది. దీనికోసం ప్రతి పాఠశాలకూ బయోవెుట్రిక్ పరికరాలను అందించారు. పాఠశాలకు హాజరైన వెంటనే, అలాగే తిరిగి వెళ్లేటపుడు అందులో తమ వేలిముద్రలు నమోదుచేయాలి. అప్పుడే వాళ్లకు హాజరు పడుతుంది. ఏమాత్రం ఆలస్యైమెనా, లేదా అసలు వేలిముద్ర నమోదు చేయకపోయినా ఆ వివరాలన్నీ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు వెళ్లిపోతాయి. ఉపాధ్యాయుల హాజరును మెరుగుపరచడానికి చేపట్టిన ఈ విధానం మంచిదే అయినా.. అమలులో సవాలక్ష సమస్యలు వస్తున్నాయి.

ఏమిటీ సమస్య..
బయోవెుట్రిక్ పరికరాలు పనిచేయాలంటే తప్పనిసరిగా ఇంటర్‌నెట్ సిగ్నల్ అందుబాటులో ఉండాలి. నగరాలు, పట్టణాలు, వైుదాన ప్రాంతాల్లో ఉండే పాఠశాలల ఉపాధ్యాయులకు ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా.. మారుమూల, గిరిజన ప్రాంతాల వారికి మాత్రం కొన్ని ఇబ్బందులున్నాయి. ఇక్కడ మామూలుగా సెల్‌ఫోన్ సిగ్నల్ అందడమే కనాకష్టం. అలాంటిది ఇంటర్‌నెట్ సిగ్నల్ అంటే అసలు అందడం లేదు. అలాంటప్పుడు సమయానికి హాజైరెనా కూడా ఇంటర్‌నెట్ సిగ్నల్ లేక సమయానికి హాజరు వేయలేకపోతున్నారు. ఒకవేళ అందులో నమోదు చేయాలంటే... ఇదిగో ఇలా చెట్లు, మేడలు ఎక్కాల్సి వస్తోంది. చాలావరకు మారుమూల, గిరిజన ప్రాంతాల పాఠశాల భవనాలు చిన్నవి కావడంతో మేడమీదకు వెళ్లే సావకాశం ఉండదు. అందుకే ఇలా చెట్లెక్కి హాజరు వేసుకోవాల్సి వస్తోంది. లేదంటే తాము సమయానికే వెళ్లినా వెళ్లనట్లుగా అందులో నమోదవుతుంది. విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని మామిడిపల్లి పాఠశాల ఉపాధ్యాయులు ఇలాగే నానా కష్టాలు పడి చెట్లెక్కి బయోవెుట్రిక్ హాజరు వేసుకుంటున్నారు.

ఇక్కడి ప్రాధమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సూర్యకుమారి , ఉపాధ్యాయులు రమేష్, సుశీల, లావణ్య తమకు బయో మెట్రిక్ హాజరు వచ్చినప్పటి నుంచి హాజరు నమోదుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇలా సమస్యలు వస్తున్న విషయాన్ని డీఈవో శారద దృష్టికి తీసుకు వెళ్లగా ఆమె సానుకూలంగా స్పందించారు. సిగ్నల్ ఎప్పుడుంటే అప్పుడే హాజరు వేసుకోవచ్చన్నారు. అలాగే తిరిగి వెళ్లేటప్పుడు కూడా సిగ్నల్ ఉంటేనే హాజరు వేయాలన్నారు. ఎటూ పాఠశాల మొత్తం ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో ఉంటుంది కాబట్టి.. బయోమెట్రిక్ పనిచేయని చోట్ల వాళ్ల నివేదికలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఇక మీదట సమస్య తలెత్తకుండా ఉండేందుకు అందరికీ కొత్త 4జి సిమ్ కార్డులతో కూడిన బయోమెట్రిక్ మిషన్లు ఇస్తున్నామని ఆమె తెలిపారు.

ప్రయోజనాలు కూడా..
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఈ-హాజరు ప్రవేశపెట్టిన తర్వాత 80 - 85 శాతం వరకు హాజరు నమోదవుతోంది. రోజూ ఈ హాజరు వివరాలు రాష్ట్రస్థాయి వరకు వెళ్తాయి. దాంతో ముందురోజు ఎందుకు రాలేదంటూ వాళ్ల మొబైల్‌కు ఎస్‌ఎంఎస్‌లు కూడా వస్తాయి. ఆ భయంతో అంతా సరైన సమయానికి హాజరై.. వేలిముద్రలు వేస్తున్నారు.

జీతాల్లో కోత విధిస్తే.. చూస్తూ ఊరుకోం
- జేసీ రాజు, ఏపీటీఎఫ్ జిల్లా నాయకుడు

అదరాబాదరాగా ఈ-హాజరు విధానం ప్రవేశపెట్టారు గానీ అందుకు తగిన సౌకర్యాల్లేవు. సిగ్నల్ వ్యవస్థ సరిగా లేదు. సర్వర్లకు తగిన సామర్థ్యం లేదు. దీనిపేరు చెప్పి ఉపాధ్యాయుల సమయం వృథా అవుతోంది. హాజరు కోసం మిషన్లు పట్టుకొని చెట్లు, పుట్టలు ఎక్కాల్సి వస్తోంది. ఇది మరీ దారుణం. హాజరు పడకపోతే జీతాల్లో కోత విధిస్తామని అధికారులు భయ పెడుతున్నారు. అలాగైతే చూస్తూ ఊరుకోం. పూర్తి స్థాయిలో మిషన్లు పని చేస్తే సరే.. కానీ ఇలాగే సమస్యలు కొనసాగితే ఈ విధానాన్ని బహిష్కరిస్తాం.

సరైన సాంకేతికత లేకుండా అమలు అసాధ్యం
- శేషగిరి, ఫ్యాప్టో జిల్లా అధ్యక్షుడు

అనుకున్నదే తడవుగా టీచర్లకు ప్రభుత్వం ఈ హాజరు అమల్లోకి తీసుకువచ్చింది. అందుకోసం సరైన మిషనరీని ఇవ్వలేదు. రిపేర్లు చేసే సాంకేతిక యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో లేదు. సిగ్నల్స్ అందడం లేదు. బయోమెట్రిక్ మిషన్లలో సిమ్స్‌ను వాళ్లే పెట్టి ఇచ్చారు గానీ అవి సిగ్నల్స్‌ను అందుకోవడం లేదు. హాజరు కోసం టీచర్ల సమయం వృథా అవుతోంది. ప్రభుత్వం అన్నీ సమకూర్చిన తర్వాత ఈ హాజరు విధానాన్ని అమలు చేస్తే మంచిదని మా అభిప్రాయం.

English Title
Due to Poor interent signal problem Teachers get to climb on tree for E-attendance
Related News