చెంప దెబ్బ... గోడ దెబ్బ

Updated By ManamThu, 09/06/2018 - 01:03
editorial

ప్రభుత్వ విధానాల కారణంగా వరుసగా రూపాయి విలువ పడిపోవడమనే చెంప దెబ్బ, పెట్రో ధరలు మండిపోవడమనే గోడ దెబ్బలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకూ చిన్నబోతుండడం ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య యుద్ధాలు, సుంకాల పోట్లు, దేశ స్థూల ఆర్థిక పరిస్థితులపై నెలకొన్న ఆందోళనల కారణంగా రూపాయి వరుసగా అయిదవ రోజూ క్షీణించింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 37 పైసలు తగ్గి 71.58వద్దకు చేరింది. అంతర్జాతీయంగా పెట్రో ధరలు విపరీతంగా పెరుగు తున్నాయనే సాకుతో ‘రోజువారీ ధరల సమీక్షా విధానాన్ని’ అమలు చేస్తూ  కేంద్రం ప్రతిరోజూ పెట్రో ధరల వడ్డనకు పాల్పడుతోంది. ఈ రెండు రోజు ల్లోనే హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్‌కు 65 పైసలు పెరగ్గా, డీజిల్‌కు 38 పైసలు పెరిగింది. ఈ ఏడాది కాలంలో పెట్రోల్ ధర లీటర్‌కు 15 రూపాయలు పెరగ్గా, డీజిల్‌కు 22 రూపాయలు అదనంగా పెరగడం దారుణం. నరేంద్ర మోదీ ప్రభుత్వం గడువు ముగిసేనాటికి పెట్రోల్ ధర లీటర్‌కు వంద రూపా యలకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకుల అంచనా. ముడి చమురు ధరల పెరుగుతుండటం వల్లే భారం వేయాల్సి వస్తుందంటున్న ప్రభుత్వం, అంతర్జాతీయ స్థాయిలో ధరలు తగ్గినపుడు ఆ ఫలితాలను వినియోగదారులకు అందించకుండా కేంద్ర, రాష్ట్ర పన్నులు వేసి మోసం చేస్తున్నాయి. పెట్రో ధరలు పెరగడంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. 

image


భారీ వర్షాల కారణంగా గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో రెండు చమురు ప్లాట్ ఫారాలు మూతపడడం, ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షల వల్ల సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతాయని ఆందోళనలతోనే బ్రెంట్ క్రూడ్ ధరలు పెరగడం భారత ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. దానికి తోడు ప్రపంచ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి వల్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి మళ్లుతున్నాయి. అంతర్జా తీయ చమురు ధరలు పెరగడంతో పాటు వర్ధమాన మార్కెట్ విక్రయాలతో దిగుమతిదారుల నుంచి విదేశీ మారక ద్రవ్యం, బ్యాంకుల నుంచి నెలవారీ డాలర్ల డిమాండ్ పెరగిన కారణంగా రూపాయి బాగా బలహీనపడింది. ముడి చమురు ధరల పెరుగుదలతో కరెంటు ఖాతా లోటు, ద్రవ్యోల్బణం పెరగ డంతో రూపాయి విలువ ఘోరంగా దెబ్బతింది. నవంబర్ గడువునాటికి ఇరాన్ చమురు దిగుమతులన్నీ అంతం చేయడానికి అమెరికా, దాని మిత్ర రాజ్యాలు తీసుకున్న నిర్ణయం, లిబియా, కెనడాల్లో సరఫరాల అంతరాయా లపై ఆందోళనలు కారణంగా చమురు ధరలు వేగంగా పెరిగాయి. ప్రపంచ చమురు ధరల పెరుగుదలతో తన ఇంధన అవసరాల్లో 81 శాతం దిగు మతులపై ఆధారపడిన ఇండియాకు దిగుమతుల భారం పెరిగి కరెంటు ఖాతా లోటు, ద్రవ్యలోటు మరింత పెరుగుతాయన్న ఆందోళనలు నెలకొన్నాయి. దాంతో ఆసియాలోనే అత్యంత ఘోరమైన కరెన్సీగా రూపాయి తయారైంది. 

రూపాయి దానికదే స్థిరపడాల్సి ఉందని, కరెన్సీ క్షీణతకు దేశీయ అంశాలు కారణం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్థిక వ్యవస్థను విదేశీ ప్రత్యక్ష మదుపులు (ఎఫ్‌డీఐ), ఎగుమతులు-దిగుమతులపై ఆధారపడేలా చేసిన దే శ, విదేశీ కార్పొరేట్ శక్తుల అనుకూల విధానాలను రూపొందించిన ప్రభుత్వాల వైఖరి మారకుండా రూపాయి మారకపు విలువను పటిష్టం చేయడం సాధ్యం కాదు. మన దేశ స్టాక్ మార్కెట్‌లోకి వచ్చిన విదేశీ సం స్థాగత మదుపులు లాభాలను ఆర్జించి, తమ మాతృదేశ మార్కెట్లలో వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు లేదా వడ్డీరేట్లు పెరగడంతో ఇండియా నుంచి వెనక్కి మళ్లుతున్నాయి. ప్రపంచ ఆర్థిక పరిణామాలే కాకుండా, దేశ వృద్ధి రేటు 2008లో 5-6 శాతం మధ్య ఊగిసలాడింది. ముఖ్యంగా ప్రస్తుత ఖాతా లోటు స్థూల దేశీయోత్పత్తిలో 5.3 శాతానికి పడిపోయింది. సాధారణంగా ఇది 3 శాతం దాటితేనే ప్రమాద సూచికగా ఆర్థికవేత్తలు భావిస్తారు. అదే సమ యంలో వాణిజ్య లోటు జీడీపీలో 7 శాతానికి చేరింది. వీటికి తోడు అధిక ద్రవ్యలోటు, అధిక ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థను చిక్కుల్లోకి నెట్టాయి. పారిశ్రామిక ఉత్పత్తి రంగం వృద్ధి చెందకపోవడంతో ఎగుమతులు బాగా మందగించాయి, అదే సమయంలో రూపాయి విలువ క్షీణిస్తుండడం, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ వంటి ఆదాయాన్ని మిగుల్చుకునే రంగాల్లో నెలకొన్న తీవ్ర అనిశ్చితితో బంగారం కొనుగోలు డిమాండ్ భారీగా పెరగడం కూడా ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తోంది. రూపాయి పతనం ప్రత్యక్షంగా, పరోక్షంగా సామాన్య ప్రజలపై అనేక రూపాల్లో ప్రతికూల ప్రభావం చూపుతుంది. రూపా యి పతనంతో దేశీయ ముడి అవసరాల్లో 76శాతం, సహజవాయు అవసరాల్లో 19 శాతం, బొగ్గు అవసరాల్లో 20 శాతం చేసుకుంటున్న దిగుమతుల వ్యయం భారీగా పెరుగుతుంది. దాంతో ఇంధనంపై ప్రధానంగా ఆధారపడిన వ్యవసాయ, పారిశ్రామిక రంగాల ఉత్పాదక ఖర్చులు విపరీతంగా పెరుగు తాయి. దాంతో నిత్యావసరాల ధరలు ప్రజలు భరించలేని స్థాయికి చేరుకుం టాయి. సామాన్యుని జీవనప్రమాణాలు ఘోరంగా తయారవుతాయి. ఆర్బీఐ ద్వారా ద్రవ్య రేట్ల సవరణతో మార్కెట్‌ను నియంత్రించడం, ఎగుమతుల- దిగుమతుల సమతుల్యం చేసే ఆర్థిక విధానాల స్థానంలో ప్రజల కొనుగోలు శక్తిని పెంచే దేశీయ మార్కెట్ కేంద్రిత విధానాలను రూపొందించడంపై ప్రభు త్వాలు దృష్టి సారించకపోతే ఆర్థిక వ్యవస్థ మరింత లోతైన సంక్షోభంలోకి జారుకుంటుంది. ఈ నేపథ్యంలో పాలకులు వ్యవసాయ, పారిశ్రామిక రంగా లను సమన్వయిస్తూ దేశీయ మార్కెట్‌ను పరిపుష్టం చేసే విధానాలను రూపొందించాలి. 

Tags
English Title
editorial
Related News