ఆచితూచి.. దూకుడు!

Updated By ManamSun, 09/02/2018 - 02:35
editorial

imageఇప్పుడు ఏ నలుగురిని కదిపినా ఒకటే చర్చ.. ఎలక్షన్లు వచ్చేస్తున్నాయంటగా! జమిలి, ముందస్తు లాంటి మాటలు కూడా విస్తృతంగా వినిపిస్తున్నాయి. దేశమంతా ఒక రకమైన ఎన్నికల వాతావరణం కమ్ముకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐదేళ్ల పాలనకు ఈ ఎన్నికలు గీటురాయిగా మారను న్నాయి. గత ఎన్నికల నాటికి రాజకీయంగా ఇంకా అంత పరిపక్వత కనిపించని రాహుల్ గాంధీ.. ఈసారి ఏఐసీసీ అధ్యక్షుడు కావడంతో పాటు పార్లమెంటు లోపల, బయట కూడా మోదీ సర్కారు మీద విమర్శల వాడి.. వేడి పెంచు తున్నారు. రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ, ‘న ఖావూంగా.. న ఖానేదూంగా’ అన్న మోదీ మాటలన్నీ నీటిమూటలేనని చెబుతున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు మీద కూడా అవినీతి మరక పడిందని ఆయన అంటున్నారు. దానికితోడు పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు లాంటి వాటి వల్ల చిన్న వ్యాపా రుల నడ్డి విరిగిందని చెబుతూ సామాన్యులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో వరుసపెట్టి పర్య టనలు పెట్టుకుని క్షేత్రస్థాయిలో ప్రజలకు తన ముఖాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు చూపించాలని భావిస్తున్నారు. ఇంత కుముందు కంటే ప్రసంగాలలో చెణుకులతో ఆకట్టుకోవాలని చూస్తున్నారు. అయితే, ఉత్తరాది వరకు పర్వాలేదు గానీ దక్షిణాదిలో రాహుల్ గాంధీ ప్రసంగాలకు అనువాదాలు అంత సరిగా కుదరడం లేదు. ఆయనొకటి చెబుతుంటే అనువాదం చేసే నాయకులు మరోటి చెబుతున్నారు.

image


గతంలో తెలంగాణలో అయితే దాసోజు శ్రవణ్, ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఉండవల్లి అరుణ్‌కుమార్ లాంటివాళ్లు ప్రముఖ నాయకుల ప్రసంగాలను అనువదిస్తుంటే.. వాళ్లు అన్న దాన్ని మరింత బలంగా చెప్పినట్లుండేది. కానీ ఇటీవల తెలంగా ణలో కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన సభలో రాహుల్ ప్రసం గాన్ని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అనువదించినపుడు హిందీ, తెలుగు రెండు భాషలు వచ్చినవాళ్లు చాలా ఇబ్బంది పడ్డారు. స్వయంగా రాహుల్ కూడా ఒకటి రెండు సందర్భా లలో ఉత్తమ్ అనువాదాన్ని సరిచేశారు. ఒకవైపు దూకుడుగా వెళ్లాలని కాంగ్రెస్ అధిష్ఠానం చూస్తుంటే.. మరోవైపు స్థానికం గా మాత్రం ఇలాంటి సమస్యలు పెట్టుకుని జనంలోకి వెళ్తే పార్టీ బలోపేతం కావడం మాట అటుంచి మరింత గందర గోళంలోకి వెళ్లే ప్రమాదముంది. దానికితోడు.. కాంగ్రెస్ బస్సుయాత్ర కమిటీకి వరుసపెట్టి నాయకులు రాజీనామా లు చేస్తున్నారు. ఇది పార్టీలో అంతర్గత తగాదాలను బయట పెడుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే అసలే బలంగా కని పిస్తున్న అధికార పార్టీని ఢీకొట్టి నిలబడటం మరింత కష్టం అవుతుంది. 

కొంగర కలాన్‌లో నేడు నిర్వహించనున్న ప్రగతి నివే దన సభను కేసీఆర్ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కేవలం ఇన్నాళ్లూ తాము సాధించిన ప్రగతిని నివేదించడం మాత్రమే కాక.. రాబోయే కాలంలో అమలుచేయబోయే మరిన్ని పథకాల గురించి కూడా ఆయన ప్రస్తావించే అవ కాశం ఉంది. అందుకోసమే ముందుగానే ఉన్నతాధికారు లతో భేటీలు, కేబినెట్ సమావేశాల లాంటివన్నీ చకచకా నిర్వహిస్తూ దూకుడుగా వెళ్తున్నారు. కేసీఆర్ వ్యూహాలు ఎప్పుడెలా ఉంటాయో ఊహించడం చాలా కష్టం. ఇప్పటికే వివిధ వర్గాల వారీగా పథకాలు ప్రవేశపెట్టి వ్యక్తిగత లబ్ధి చేకూరేలా చూసి ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. 

‘జెట్’ స్పీడులో కేసీఆర్
సరిగ్గా గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజ శేఖరరెడ్డి హయాంలో జరిగినట్లే ఇప్పుడూ ఒకరకంగా జరుగుతోంది. అప్పట్లో ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, 108 లాంటి వన్నీ వివిధ కుటుంబాలకు ఎంతగానో ఉప యోగపడ్డాయి. ఆ కుటుంబంతో పాటు వారి స్నేహితులు, బంధువులు అంతా కూడా మళ్లీ రాజశేఖరరెడ్డే అధికారంలోకి రావాలని బలంగా కోరుకున్నారు. జీవితంలో ఎన్నడూ కాం గ్రెస్ పార్టీకి ఓటేసేది లేదని ఒట్టు పెట్టుకున్న వాళ్లు సైతం ఆరోగ్యశ్రీలో వాళ్ల ఇంట్లో వాళ్లకు చికిత్స చేయించిన తర్వాత తాము వైఎస్‌ఆర్‌కే ఓటేస్తున్నామని భావించి స్థానిక కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారు. ఇప్పుడు సరిగ్గా కేసీఆర్ పాలనలో కూడా అలాగే జరుగుతోంది. అప్పటికంటే మరింత విస్తృ తంగా గొల్లకురుమలు, బంజారాలు, బ్రాహ్మణులు, వృత్తి పనివారు.. ఇలా ప్రతి ఒక్కవర్గాన్నీ లక్ష్యంగా చేసుకుని వారి కి మేలు కలిగించేలా పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తు న్నారు. దానివల్ల ఆయా కుటుంబాల వాళ్లంతా ఎప్పటికీ టీఆర్‌ఎస్‌కు రుణ పడిపోయి ఉంటారు. అంతటి దీర్ఘకాలిక వ్యూహంతో కేసీఆర్ దూసుకుపోతున్నారు. ఆయన వేగాన్ని అందుకోవ డం ఎవరికీ సాధ్యం కావడం లేదు. 

అలాంటి కేసీఆర్‌ను ఎదుర్కోడానికి అవసరమైతే మహా కూటమిని ఏర్పాటు చేయాలని కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమకు ఆగర్భశత్రువైన తెలుగుదేశం పార్టీతో కూడా చేతులు కలిపేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు కూడా చాప కింద నీరులా చకచకా సాగిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీకి మాత్రం కాంగ్రెస్‌తో కలిసేందుకు కొన్ని ఇబ్బందులున్నా యి. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజనకు గురి కావడానికి ప్రధాన దోషి కాంగ్రెసేనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిసు ్తన్నారు. అందుకే గత ఎన్నికలలో కనీసం ఒక్కటంటే ఒక్క చోట కూడా ఆ పార్టీని గెలవనివ్వలేదు. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో ఎన్ని హామీలు ఇస్తున్నా, బీజేపీని దోషి గా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నా కూడా ఆ పార్టీని ఆదరించే అవకాశాలు చాలా తక్కువ. అలాంటి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే దానివల్ల తాము ఇప్పుడు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఎంత నష్టం జరుగుతుందోనన్న భయం టీడీపీకి లేకపోలేదు. అదే సమయంలో.. కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకోడా నికి కూడా టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

‘కుమార’ సంభవం
కాంగ్రెస్-టీడీపీ మధ్య మైత్రీ బంధాన్ని సాకారం చేసేం దుకు కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి గౌడ రంగంలోకి దిగారు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించు కోడానికి, తన కొడుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మా యి ఇంటికి వెళ్లడానికి వచ్చినట్లుగా విజయవాడ వచ్చినా.. ప్రత్యేకంగా, ఏకాంతంగా 40 నిమిషాల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఆయన మంతనాలు సాగించారు. ఇటు చంద్రబాబు కూడా తనకు ఎంత ముఖ్యమైన కార్యక్ర మాలున్నా.. వాటన్నింటినీ వాయిదా వేసుకుని మరీ కుమార స్వామితో చర్చించడానికి సమయం వెచ్చించారు. అవతల తిరుపతిలో రతన్ టాటా లాంటి దిగ్గజం వేచి చూస్తున్నారని ఆయనకు తెలుసు. టాటాల సహకారంతో నిర్మించబోయే కేన్సర్ ఆసుపత్రి సముదాయానికి ఆయనతో కలిసి భూమి పూజ చేయాల్సిన చంద్రబాబు.. అక్కడకు వెళ్లే కార్యక్రమాన్ని కూడా కుమారస్వామితో భేటీ కోసం కొంతసేపు వాయిదా వేయడానికి ప్రాధాన్యం ఇచ్చారంటేనే.. ఆ సమావేశం ఎంత ముఖ్యమైనదో అర్థమవుతుంది. తెలంగాణలో తమకు పెద్ద గా బలం లేనట్లు కనపడుతున్నా.. కేడర్ మాత్రం యథాత థంగా ఉందన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించారు. క్షేత్ర స్థాయిలో కేడర్ బలం ఉన్న తమ పార్టీకి.. తెలంగాణలోని 119 స్థానాల్లో దాదాపు 40 వరకు ఇవ్వాలని ఆయన కుమార స్వామి వద్ద ప్రతిపాదన పెట్టినట్లు విశ్వసనీయంగా తెలు స్తోంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్‌లో అసెంబ్లీ టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంది. అలాంటప్పుడు ఏకంగా 40 స్థానాలు టీడీపీకి ఇచ్చేస్తే తమవాళ్ల పరిస్థితి ఏంటన్నది కాంగ్రెస్ నేత లకు ప్రశ్నార్థకంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరెవరికి ఎన్నెన్ని స్థానాలు ఇచ్చుకోవాలనేంత వరకు ఇంకా చర్చలు వెళ్లలేదు. తొలుత తెలంగాణ విషయం తేలితే, అప్పుడు రెండు రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకోవాలా.. వద్దా అనే విషయాన్ని చంద్రబాబు ఖరారు చేసుకునే అవకాశం ఉంది. కానీ ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే అది తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే కొత్త అధ్యాయం అవుతుంది. 

అసలు కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగానే తెలుగుదేశం పార్టీని దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామా రావు స్థాపించారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా వాళ్లతోనే పొత్తు పెట్టుకోవడం అంటే పెద్ద సాహసమే అవుతుంది. అం తటి సాహసానికి కూడా చంద్రబాబు వెళ్తున్నారంటే.. ఆంధ్ర ప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవు తుంది.

జగన్... ప‘వన్’ అయ్యేనా?
ఒకవైపు జగన్, మరోవైపు పవన్ దూకుడుగా ఉండ టంతో ఈసారి ఎన్నికలు చాలా రసవత్తరంగా ఉండే అవ కాశం కనిపిస్తోంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడతామని పవన్ ప్రకటించినా, పొత్తుల గురించి ఎన్నికల సమయంలో ఆలోచిస్తామంటూ.. ఒక చిన్న ఫీలర్ వదలడంతో ఆయన  కూడా పొత్తుల గురించి ఆలో చిస్తున్న విషయం అర్థమవుతుంది. పవన్ ఎటువైపు మొగ్గు తారో చెప్పలేని పరిస్థితి. అటు వైఎస్‌ఆర్‌సీపీతోనైనా పొత్తు పెట్టుకోవచ్చు లేదా తెలుగుదేశంతోనైనా కలవచ్చు. ఆయన ప్రసంగాలలో అందరినీ విమర్శిస్తున్నారు. ఎవరినీ వదలడం లేదు. అలాగని ఈరోజు విమర్శించినవారిని రేపు చంక నెక్కించుకోరా అంటే.. చెప్పలేం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు కాబట్టి ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. చంద్రబాబును ఓడించాలన్న ఏకైక లక్ష్యం తో ఉన్న జగన్‌మోహన్ రెడ్డి కూడా పవన్‌ను కలుపుకొంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న 34 స్థానాల్లో అత్యధికం.. అంటే దాదాపు 30 వరకు తమకే వస్తాయన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా మొత్తం (15/15)తెలుగుదేశానికే వెళ్లిపోయింది. తూర్పు గోదావరిలో కూడా అత్యధిక స్థానాలు (13/19) వాళ్లకే వెళ్లాయి. ఆ తర్వాత కూడా వైఎస్‌ఆర్‌సీపీ నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి వెళ్లిపోయారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జనసేనతో కలిస్తే గోదావరి జిల్లాలను చాలావరకు చేజిక్కించుకోవచ్చని వైఎస్‌ఆర్‌సీపీ వ్యూహకర్తలు అంటున్నారు. ఎటూ ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వై ఎస్‌ఆర్‌సీపీ కొంత బలంగానే కనిపిస్తోంది. అందుకే పొత్తుల విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఈసారి చంద్రబాబును నిలువరించగలిగితే, 2024 ఎన్నికల నాటికి ఆయన రాజకీయాల్లో అంత దూకుడుగా ఉండే అవకాశం ఉండబోదని, అందువల్ల తమ పని సులువవు తుందని భావిస్తున్నారు. 

ఇలా ఎవరికి వాళ్లు ‘ముందస్తు’గానే ఎన్నికల ఏర్పాట్లు చేసుకుంటూ, పొత్తుల విషయాలను ఖరారు చేసుకునే  దిశగా అడుగులు వేస్తూ పోలింగ్ యుద్ధాన్ని ఎదుర్కోడానికి సకల అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ పొత్తుల్లో ఎన్ని సాకారం అవుతాయో, ఇంకెన్ని విఫలం అవుతాయో తెలియా లంటే మాత్రం మరికొంత కాలం వేచి చూడాల్సిందే. 

English Title
elections are coming
Related News