ఓటర్ నమోదుపై అవగాహన కల్పించండి

Updated By ManamSat, 09/22/2018 - 00:10
rajath-kuamr
  • జిల్లా ఎన్నికల అధికారులతో సీఈవో రజత్‌కుమార్

  • సంయుక్త ఎన్నికల అధికారిణిగా ఆమ్రపాలి

  • ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

rajath-kuamrహైదరాబాద్: ఓటర్ నమోదు ప్రక్రియపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సీఈవో రజత్‌కుమార్ జిల్లాల ఎన్నికల అధికారులకు సూచించారు. శుక్రవారం సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఓటర్ జాబితా నుంచి తొలగించిన వారిలో అర్హులతోపాటు కొత్తగా ఓటర్ నమోదు చేసుకునే వారికి సంబంధించిన వివరాలను తెలియజేయాలని సూచించారు. దాదాపు అన్ని జిల్లాలకు ఈవీఎంలు, వీవీప్యాట్లు చేరుకున్నాయని, ముందుగా వాటిని ప్రాథమిక పరిశీలన చేయాలని జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించినట్టు సమాచారం. ఈ మిషన్లపై ప్రజలకు ఎలాంటి అనుమానాలు లేకుండా పూర్తిస్థాయిలో వారికి వివరించాలన్నారు. ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలోనే ప్రాథమిక పరిశీలన జరపాలని సూచించారు. బూత్ లెవల్ ఆఫీసర్ల నియామకంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఓటర్ నమోదు చేసుకున్న వారి పేర్ల నమోదు త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. నకిలీ  ఓట్ల తొలగింపుపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. 

సంయుక్త ఎన్నికల అధికారిణిగా ఆమ్రపాలి
తెలంగాణ ఎన్నికల సంఘంలో ఉన్న ఖాళీలను ఇటీవల భర్తీ చేసిన విషయం విధితమే. అయితే ఇప్పటికే అదనపు ఎన్నికల ప్రధానాధికారిగా జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ను నియమించారు. దీంతోపాటు జీహెచ్‌ఎంసీలో అదనపు కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆమ్రపాలి కాటాను ఎన్నికల  సంయుక్త అధికారిణిగా ఈసీఐ నియమించింది. ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను శుక్రవారం జారీ చేసింది. వెంటనే ఆమ్రపాలికి బాధ్యతలు అప్పగించాలని సీఈవో రజత్ కుమార్‌ను ఆదేశించింది. శుక్రవారం జరిగిన జిల్లాల ఎన్నికల అధికారుల వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమ్రపాలి కూడా పాల్గొంది. 

English Title
Encourage voter registration
Related News