ఎస్... సురేష్ రెడ్డి వస్తున్నారు..

Updated By ManamFri, 09/07/2018 - 13:05
Ex-Speaker Suresh Reddy conform to Join TRS
  • సురేష్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి?

ktrహైదరాబాద్ : టీఆర్‌ఎస్‌లో చేరికపై మాజీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత సురేష్ రెడ్డి అధికారికంగా స్పందించారు.  ఈ నెల 12న కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం తాను టీఆర్ఎస్‌లో చేరడం లేదని, రాష్ట్రాభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. మాజీమంత్రి కేటీఆర్‌తో భేటీ అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

పదవులు కోసమో, మరో దాని కోసమో కారు ఎక్కడం లేదని... ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య రాయబారిగా ఉంటానని సురేష్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే తాను ఓటమి భయంతో టీఆర్ఎస్‌లో చేరటం లేదని పేర్కొన్నారు. ‘కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్రాభివృద్ధిలో పాల్గొంటాను. నిన్ననే టీఆర్ఎస్ టికెట్ల పంపిణీ పూర్తయింది. ఓటమి భయంతో ఈ నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రం అభివృద్ధి వేగవంతం అవ్వాలంటే మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి రావల్సిన అవసరం ఉంది.

రాష్ట్రాభివృద్ధి ఆగిపోకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నా. వేగంగా పోతున్న కారులో డ్రైవర్‌ను మార్చాల్సిన అవసరం లేదు. మేం కలిసి పనిచేయకపోయినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేశాం. నేను సభాపతిగా పనిచేశాను. అసెంబ్లీలో కేసీఆర్ ఆలోచనా విధానాలను చూశాను. ఆయన నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుంది.’ అని అన్నారు.

సురేష్ రెడ్డి స్థాయికి తగ్గట్టు గౌరవం
సురేష్ రెడ్డి స్థాయికి తగిన పదవి ఇస్తామని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. 1989 నుంచి సురేష్ రెడ్డి, కేసీఆర్ మంచి మిత్రులని ఆయన పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సురేష్ రెడ్డికి తగిన పదవి ఇస్తామని, తమ ఆహ్వానాన్ని మన్నించి టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నందుకు సంతోషంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. 

కాగా సురేష్ రెడ్డికి ఇచ్చే పదవిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. కాగా  గత ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన సురేష్ రెడ్డి... టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చేతిలో  ఓడిపోయారు. ఈసారి కూడా బాల్కొండ అభ్యర్థిగా ప్రశాంత్ రెడ్డి పేరును కేసీఆర్ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆపరేషన్ ఆకర్ష్..
అయితే నిజామాబాద్ జిల్లాకు చెందిన డీ శ్రీనివాస్ ...తిరిగి సొంత గూటికి చేరతారనే వార్తల నేపథ్యంలో ఆయనకు చెక్ పెట్టేందుకే సురేష్ రెడ్డిని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా సురేష్ రెడ్డిని టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించినట్లు సమాచారం. మరోవైపు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా టీఆర్‌ఎస్ అధిష్టానంకు టచ్ లో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

English Title
Ex-Speaker Suresh Reddy conform to Join TRS
Related News