తిలా పాపం తలా పిడికెడు

Updated By ManamThu, 06/21/2018 - 06:17
pnb
  • పి.ఎన్.బి బాగోతంలో 54 మంది అధికారుల వైఫల్యం  

imageముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పి.ఎన్.బి)లో రూ. 13,600 కోట్ల మోసానికి సూత్రధారులుగా వ్యవహరించింది కొద్ది మంది తప్పుదోవ పట్టిన ఉద్యోగులే కావచ్చు. కానీ, బ్యాంక్‌నకు చెందిన అనేక విభాగాల్లో రిస్కు-నియంత్రణ, పరిశీలనలో విస్తృతంగా ఉన్న లోపాల వల్ల ఆ బాగోతం వెంటనే బయటపడలేదని బ్యాంక్ స్వీయ అంతర్గత దర్యాప్తులో తేలింది. 

ముంబైలోని ఒకే ఒక్క శాఖలో కొద్ది మంది ఉద్యోగుల నిర్వాకం వల్ల ఈ తప్పిదం జరిగిందని ప్రభుత్వ రంగానికి చెందిన రెండవ పెద్ద బ్యాంక్ పి.ఎన్.బి ఇంతకుముందు ఆరోపించింది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన దగ్గరి బంధువు మెహుల్ చోక్సీల నియంత్రణలో ఉన్న రెండు నగల గ్రూప్‌లకు ఆ ముంబై శాఖ కొన్నేళ్ళపాటు నకిలీ బ్యాంక్ గ్యారంటీలను జారీ చేస్తూ వచ్చింది. వాటిని విదేశాల్లోని ఇతర భారతీయ బ్యాంకుల శాఖల్లో సమర్పించి వారు విదేశీ రుణం రూపంలో కోట్లాది డాలర్లు కొల్లగొట్టారు. భారతీయ బ్యాంకింగ్ రంగంలో ఇంత పెద్ద మోసం ఇంతకుముందెన్నడూ చోటుచేసుకోలేదు. 

ఇందుకుగాను 21 మంది అధికారులను సస్పెండ్ చేసినట్లు బ్యాంక్ సి.ఇ.ఓ సునీల్ మెహతా గత ఏప్రిల్‌లో వెల్లడించారు. లొసుగులలో ప్రమేయం ఉన్నట్లు తేలిన ఇతరులు ఎవరినీ ‘‘వదిలేదు లేదు’’ అని కూడా ఆయన ప్రకటించారు. ఈ మోసాన్ని ‘‘చిన్నపాటి సంక్షోభం’’గా ఆయన అభివర్ణించారు. అయితే, ఈ మోసంపై దర్యాప్తు జరిపిన పి.ఎన్.బి అధికారులు సమర్పించిన 162 పేజీల అంతర్గత నివేదిక చూస్తే, లోపాలు ఏదో ఒక శాఖకు చెందిన కొద్ది మంది అధికారులకు పరిమితైవెునవి కావని తెలుస్తుంది. ఏకంగా 54 మంది పి.ఎన్.బి అధికారులు విధి నిర్వహణలో విఫలమయ్యారని ఈ నివేదిక తేటతెల్లం చేసింది. వారిలో క్లర్కుల నుంచి విదేశీ మారక ద్రవ్య మేనేజర్లు, ఆడిటర్లు, ప్రాంతీయ కార్యాలయాల అధిపతుల వరకు రకరకాల వారున్నారు. వారంతా ఈ మోసాన్ని కళ్ళు అప్పగించి చూశారే తప్ప నష్ట నివారణకు ఉపక్రమించలేదు. ఒక విధంగా వారు ఈ మోసం నిరాఘాటంగా సాగడానికి వీలు కల్పించారు. 

ఈ 54 మందిలో ఎనమండుగురిపై పోలీసులు ఇదివరకే కుంభకోణంలో వారి పాత్రలకుగాను అభియోగాలు మోపారు. పి.ఎన్.బి అధికారులు ఈ నివేదికను బ్యాంక్‌నకు చెందిన ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్ విభాగానికి ఏప్రిల్ 5న సమర్పించారు. నివేదికతోపాటు బ్యాంకు రికార్డులను, అంతర్గత ఇ-మెయిల్స్ పత్రాలను వారు జతపరచారు. మోసం వెలుగు చూసిన తర్వాత కూడా  బ్యాంక్‌పై నియంత్రణ చర్యలు కొరవడినట్లు ఈ నివేదిక వెల్లడిస్తోంది. పి.ఎన్.బిపై ఎలాంటి పెనాల్టీ విధించలేదు. సీనియర్ స్థాయి మేనేజర్లలో మార్పు చేర్పులు కూడా చేయలేదు. ముంబైలోని బ్రాడీ హౌస్ శాఖ ఈ కుంభకోణానికి ప్రధాన కేంద్రంగా నిలిచింది. అక్కడి నుంచి బ్యాంక్ డిప్యూటి మేనేజర్ గోకుల్‌నాథ్ షెట్టి ‘స్విఫ్ట్’ ఇంటర్ బ్యాంక్ మెసేజింగ్ నెట్‌వర్క్‌పై కొన్నేళ్ళపాటు మోసపూరిత రుణ గ్యారంటీలను జారీ చేస్తూ వచ్చారు. నియమానుసారంగా అయితే, దైనందిన రీకన్సిలియేుషన్ రిపోర్టులు న్యూఢిల్లీలోని పి.ఎన్.బి ప్రధాన కార్యాలయం వరకు వెళ్ళాలి. బ్రాడీ శాఖ అధిపతి వాటిపై సంతకాలు చేసి ప్రతి నెల ముంబై సిటీ ప్రాంతీయ కార్యాలయానికి పంపాలి. అది దాని నియంత్రణలో ఉన్న శాఖలకు ఆల్-క్లియర్ సర్టిఫికెట్లు ఇస్తుంది. కానీ, బ్రాడీ హౌస్ శాఖ నుంచి గత ఏడాది 12 నెలవారీ నివేదికల్లో కేవలం రెండు మాత్రమే వచ్చినప్పటికీ, ప్రాంతీయ కార్యాలయం అన్నీ నియమానుసారం సాగుతున్నట్లుగా ‘‘తప్పుడు’’ కాంప్లియన్స్ సర్టిఫికెట్ జారీ చేసేసింది. ఇలాంటివి చాలా జరిగాయి. ఎన్నో నివేదికలు కనిపించకపోయినా, సీనియర్ ఇన్‌స్పెక్షన్ అధికారుల్లో ఒక్కరూ నోరు మెదపలేదు.

 వారు 2010 నుంచి 2017 మధ్యలో బ్రాడీ హౌస్ శాఖను 10 సార్లు సందర్శించినా ఎలాంటి ‘‘ప్రతికూల’’ నివేదికనూ ఇవ్వలేదని అంతర్గత దర్యాప్తు నివేదిక వెల్లడించింది. షెట్టి మొత్తం మీద 1200లకు పైగా మోసపూరిత క్రెడిట్ గ్యారంటీలను జారీ చేసినట్లు ఈ నివేదిక బహిరంగపరచింది. గత ఏడాది మేలో రిటైరవడానికి కొద్ది వారాల ముందు ఆయన తన వ్యక్తిగత యాహూ ఇ-మెయిల్ అడ్రస్ ఉపయోగించి 22 ఇ-మెయిల్స్ పంపారు. వాటిలో 18 మెయిల్స్ అర్ధరాత్రి పంపారు. అవన్నీ మోదీ గ్రూప్‌నకు ప్రమేయం ఉన్న పెద్ద మొత్తాలలో విదేశీ మారక ద్రవ్యంతో కూడిన లావాదేవీలకు సంబంధించినవి. బ్యాంక్ ట్రెజరీ శాఖ దీన్ని పట్టించుకోలేదు. పి.ఎన్.బి విధానం ప్రకారం ఏ అధికారీ మూడేళ్ళకు మించి ఒకే కార్యాలయంలో ఉండకూడదు. కానీ, బ్రాడీ హౌస్ శాఖలో షెట్టి ఏడేళ్ళు పనిచేశారు. మూడుసార్లు బదలీ ఉత్తర్వులు జారీ అయినా ఆయనను రిలీవ్ చేయలేదు.

English Title
Failure of 54 officers in PNB
Related News