ఫైస్లా హోగయా 

Updated By ManamThu, 09/06/2018 - 03:31
telangana

kcrహైదరాబాద్: అసెంబ్లీ రద్దు ఊహాగానాలకు గురువారం పొద్దున తెరపడింది. నాలుగు ఏండ్ల ఐదు నెలల తెరాస ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయిం చుకున్నారు. ఈ మేరకు శరవేగంగా పావులు కదుపుతున్నారు. గురువారం మధ్యహ్నాం ఒంటి గంటలకు ప్రత్యేక మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏక వాక్యంలో అసెంబ్లీ రద్దుకు తెలంగాణ మంత్రిమండలి  నిర్ణయం అనే తీర్మానం చేయబోతున్నారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే గవర్నర్ నరసింహన్‌ను రాజ్ భవన్‌లో మధ్యాహ్నాం 1.30 గంటలకు కలుసుకొని మంత్రివర్గ నిర్ణయాన్ని తెలియచే స్తారు. ఇదే తీర్మానం ప్రతిని శాసనసభ కార్యదర్శికి పంపిస్తారు. స్పీకర్ మధుసూదనాచారి సంతకంతో కూడిన అసెంబ్లీ రద్దు నిర్ణయాన్ని గవర్నర్‌కు అందచేయడం జరుగుతుంది. దీంతో రద్దు ప్రక్రయ పూర్తవుతుంది. ఆ తర్వాత గవర్నర్ నరసింహన్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరతారు.  శాసనసభను రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు పోవడానికి గల కారణాలను తెలియచేయచేసేందుకు పార్టీ ముఖ్యులతో మధ్యహ్నం  తెలంగాణ భవన్‌లో సమావేశం ఏర్పాటు చేశారు.  అసెంబ్లీ రద్దుకు సంబంధించి ఇప్పటికే  పార్టీ అధిష్టానం నుండి  పలువురు ఎమ్మెల్యేలకు  సంకేతాలు అందాయి. అధికారిక కార్యక్రమాల్లో ఉన్న మంత్రులంతా  బుధవారం రాత్రికే  నగరానికి చేరుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయం సమాచారం పంపింది. 6న అసెంబ్లీ రద్దు, 7న హుస్నాబాద్‌లో బహిరంగ సభ అనే సందేశాలు కరీంనగర్ జిల్లా  పార్టీ ప్రజా ప్రతినిధులకు చేరాయి. రెండు రోజుల పాటు ఫామ్‌హౌజ్‌లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సాయంత్రం నగరానికి చేరుకున్నారు. ఆ వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. కె. జోషి, శాసనసభ కార్యదర్శి నర్సింహ్మచార్యులు, సాధారణ పరిపానల శాఖ    ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మంగళవారం గవర్నర్‌తో చర్చించిన అంశాలను ఈ సందర్భంగా ఎస్.కె. జోషీ ముఖ్యమంత్రికి వివరించారు. 

kcr

శాసనసభ రద్దుకు సంబంధించి తయారు చేసిన ఏక వాఖ్య తీర్మానం, దానికి మంత్రివర్గ ఆమోదం, గవర్నర్‌కు అందచేయడం తదితర అంశాలపైన చర్చించినట్టు తెలిసింది. శాసనసభను రద్దు చేయడంలో ఉత్పన్నం కానున్న రాజ్యాంగపరమైన అంశాలు, శాసనపరమైన సమస్యలు చర్చకు వచ్చినట్టు  తెలిసింది. దీంతో కేబినెట్ భేటీ, తీసుకోనున్న నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది.  ముఖ్యమంత్రితో భేటీకి ముందే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్. కె. జోషి సచివాలయంలో ప్రభుత్వ ముఖ్యకార్యదర్శులు, పోలీసు డైరెక్టర్ జనరల్ మహేందర్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ ఐపిఎస్ అధికారులతో చర్చించారు. ఆపధర్మ ప్రభుత్వంలో తీసుకోవలసిన చర్యలు, అనుసరించవలసిన విధానాలు తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించినట్లు తెలిసింది. గురువారం నుండి తెలంగాణలో అపధర్మ ప్రభుత్వం అమలులోకి రాబోతున్నందున మంత్రి వర్గం ఆమోదం పొందాల్సిన కీలకమైన ఫైళ్ల పై  చర్చ జరిగినట్లు తెలిసింది.  ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో అధికారులు, అనధికారులు, ఉద్యోగ సంఘాలతో సమావేశమై  వివిధ అంశాలపైన  మెరుపు వేగంతో నిర్ణయాలు తీసుకున్నారు.  మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, మిజోరాం రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిపించడానికి ఈ నెల 10 తర్వాత నోటిఫికేషన్ వెలువడే  అవకాశం ఉన్నందున ఈ రాష్ట్రాలతో కలిపి తెలంగాణలో ఎన్నికలు జరిపించడానికి వీలుగా గురువారం అసెంబ్లీని రద్దు చేయాలని నిర్ణయించుకున్న ముఖ్య మంత్రి కేసీఆర్  ముందస్తు  రాజకీయ వ్మూహంతో పావులు కదిపారు. అసెంబ్లీ రద్దు, ఎన్నికల ప్రచారం పై పార్టీ ముఖ్యులతో సమాలోచనలు జరిపారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఉదయం మంత్రివర్గాన్ని సమావేశపరిచి అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకున్న వెంటనే గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో కలుసుకొని తీర్మానాన్ని అందచేయడం, తీర్మానం ప్రతిని శాసనసభ కార్యదర్శికి పంపించడం,  ఆ వెంటనే తెలంగాణ భవన్‌లో ముఖ్యులతో సమావేశం కావడం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం  ఢిల్లీ పరిణామాలపై కూడా  అధికారు లు, అనధికారులతో సమాలోచనలు జరిపారు. ముందస్తు ఖాయంగా తెలడంతో కేసీఆర్‌కు కలిసొచ్చిన కోట కరీంనగర్  నుంచే ముందస్తు  సభలు నిర్వహించేందుకు నిర్ణయించారని కరీంనగర్‌కు జిల్లా ఎమ్మెల్యే  ఒకరు తెలియచేశారు. శుక్రవారం నాటికి మీరంతా మాజీలవుతారు అని ఐటి మంత్రి కేటీర్ తనను కలుసుకున్న ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసిన  వాఖ్యలు అసెంబ్లీ రద్దుకు సంకేతాలని పేర్కొన్నారు. గురువారం ఉదయం అసెంబ్లీని రద్దు చేసే ఆవకాశం ఉన్నందున పోలీసులు అప్రమత్తమయ్యారు.

English Title
Faisala Hoagia
Related News