ముందస్తు ఎన్నికల్లో మైనారిటీల ఓట్లే కీలకం  

Updated By ManamThu, 09/06/2018 - 23:00
TRS

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో మైనారిటీల ఓట్లు కీలక భూమిక పోషించబోతున్నాయి. మైనారిటీలను కాంగ్రెస్ ఆకట్టుకుంటుందనే భయంతోనే అధికార తెరాస ముందస్తు ఎన్నికలకు పోతుందనే చర్చ  రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. తెరాస అధికారంలోకి  రాక ముందు ముస్లీం మైనారిటీలు కాంగ్రెస్‌కు అండగా ఉన్నారు. తెదేపా అధికారంలో ఉన్న కాలంలో కూడా అత్యధికులైన మైనారిటీలు కాంగ్రెస్‌కు ఓట్లేసిన దాఖలాలు ఉన్నాయి. తెరాస ఎన్నికల బరిలోకి దిగడం, అధికారంలోకి రావడం, మజ్లీస్‌తో స్నేహ పూర్వక సంబంధాలు కొనసాగించడంతో  మైనారిటీల అండ తమకు దండిగా ఉందని తెరాస భావిస్తుంది. మజ్లీస్‌లో స్నేహ పూర్వక సంబంధాలు కొనసాగించడంతో పాటు వారి ప్రయోజనాలు పరిరక్షించడంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదారంగా వ్యవహరించారనే వాదన వినబడుతుంది.

image


మైనారిటీల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా  ఆ వర్గాలను ఎంతగానో ప్రభావితం చేసిందనే ఆలోచనలో ఉన్నారు. తెలంగాణలోని సుమారు 40 నియోజక వర్గాల్లో ముస్లీం ఓటర్ల ప్రభావం ఉంటుందని అధికార తెరాస భావించింది. మరో 12 నియోజక వర్గాల్లో 20 నుండి 30 వేల వరకు ముస్లీం మైనారిటీలు ఉన్నారనే గణాంకాలు ఉన్నాయి. తెలంగాణలో ఉన్న  44.65 లక్షల మంది ముస్లీంలలో 17.13 లక్షల మంది హైదారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నారు. ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి అసెంబ్లీలో తీర్మానం చేసింది. ముస్లీంలకు రెసిడెన్సియల్ స్కూల్స్ ఏర్పాటు చేసింది. ఉపాధి అవకాశాలు మెరుగపరిచింది.

 రైతులు, ఉద్యోగులు, ముస్లీంలను తెరాస బలంగా భావించడం వల్లనే ముందస్తుకు వెళ్లడం జరుగుతుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ వర్గాల అండదండలను ఓటుగా మలచుకొనేందుకే పక్కా ప్రణాళికతో ముందస్తుగా ఎన్నికల బరిలోకి పోతున్నామని తెలిపారు. జాతీయ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ భాజపాతో సయోధ్య కొనసాగిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో మంచి అవగాహన కలిగి ఉన్నారు. 

Tags
English Title
Farmers, employees, and Muslims are the strength of TRS
Related News