కౌలు రైతులకు ‘సాయం’లేదు

Updated By ManamWed, 03/21/2018 - 01:51
pocharam
  • 96 శాతం భూ రికార్డుల ప్రక్షాళన

  • ఆరు బ్యాంకుల్లో చెక్కుల చెల్లుబాటు

  • గతంలో రైతులనుంచి శిస్తు వసూలు

  • నేడు రైతులకు చెల్లింపు: పోచారం

pocharamహైదరాబాద్: రైతులకు అందించే ముందస్తు పెట్టుబడి ఎకరాకు రూ.4 వేలు పథకాన్ని కౌలు రైతులకు ఇచ్చే పరిస్థితిలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం శాసనసభలో సభ్యులు ఏనుగు రవీందర్‌రెడ్డి, పుట్టా మధుకర్, వేముల వీరేశం, వి.శ్రీనివాస్‌గౌడ్, ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్య అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. చెరుకు పంటతో పాటు సంవత్సరం మొత్తం పంటకాలంగా ఉండే కొన్ని ఉద్యాన పంటలకు రెండు సార్లు చెక్కుల పంపిణీ ఉంటుందని తెలిపారు. పార్ట్ ఏ కింద రాష్ట్రవ్యాప్తంగా 96 శాతం(1.42 లక్షల ఎకరాలు) వివాదరహిత భూములను సర్వే చేసినట్టు చెప్పారు. పార్ట్ బి కింద మరో 4 శాతం భూముల రికార్డులను పరిష్కరించాల్సి ఉంటుందని తెలిపారు. భూరికార్డుల ప్రక్షాళన ఆధారంగా రైతు పెట్టుబడి పథకం కింద 72,13,111 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ఈ మొత్తం పథకం కింద 2018-19 సంవత్సరానికి బడ్జెట్‌లో రూ.12వేల కోట్లు కేటాయించినట్టు గుర్తు చేశారు. వానాకాలం పంటకు ఏప్రిల్ 20 నుంచి మే చివరి వరకు, యాసంగి పంటకు నవంబరు 20 నుంచి చెక్కులు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ చెక్కులను రైతులకు ఆరు బ్యాంకుల ద్వారా పంపిణీ చేస్తామని, ఏ బ్యాంకులోనైనా చెక్కులు చెల్లుబాటయ్యేలా వీలు కల్పించినట్టు పేర్కొన్నారు. ప్రపంచంలోనే రైతులకు పెట్టుబడి ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. గతంలో పాలకులు రైతుల నుంచి శిస్తు వసూలు చేసేవారని, సీఎం కేసీఆర్ మాత్రం రైతులకే తిరిగి డబ్బులు చెల్లిస్తున్నారని చెప్పారు. ఏజెన్సీలకు ఇచ్చేలా సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని మంత్రి పోచారం పేర్కొన్నారు.

English Title
Farmers need support
Related News