ఫలసాయం లేని వ్యవసాయం

Updated By ManamSat, 02/10/2018 - 01:16
agriculture

agricultureగతంలో వ్యవసాయం ఉత్తమం, వ్యాపారం మధ్యమం, ఉద్యోగం అధమం అన్న నానుడి ఉందంటే నేటి కాలంలో ఆశ్చర్యం వేయక మానదు. కానీ అది ముమ్మాటికీ నిజం. నేడు ఆ పరిస్థితి తలకిందులై ‘రైతే రాజు‘ అన్న పదం పేరుకే స్థిరపడిపోయింది. ‘రైతు లేనిదే రాజ్యం లేదు‘, ’రైతే దేశానికి వెన్నెముక’ అను పదాలతో సంతృప్తి చెందడమే తప్ప రైతుకు ఒరుగుతున్నది ఏమీ లేదు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా నేటికీ రైతన్న రైతుగానే ఉండగా, ఇతర రంగాల వారు మాత్రం అంత ఎత్తుకు ఎదుగు తున్న తీరే రైతు దీనస్థితికి ప్రబల నిదర్శనం. అందరికీ అన్నం పెట్టే రైతన్న పురుగుల మందు ఎందుకు తాగుతున్నాడు? ఇంటి చూరుకో, చెట్టుకొమ్మకో ఎందుకు దీనంగా వేలాడుతున్నడు? భీకరమైన ఈ దృశ్యాలు నిత్యం పత్రికల్లో సర్వ సాధారణమై పోవడం దురదృష్టకరం. ఎన్నో కమిటీలు, రిపోర్టులు, సమావేశాలు, ప్రకటనలు, వరాలు అయినా నేటికీ రైతు పరిస్థితిలో మార్పు రాలేదు. నిజానికి ప్రపంచంలో పెరు గుతున్న జనాభా ఒకవైపు, తరుగుతున్న వ్యవసాయ భూములు మరొకవైపు, గతి తప్పుతున్న రుతు పవనాలు, కల్తీ మయమైన విత్తనాలు, రసాయ నాలు, క్రిమి సంహారక పురుగుమందులు ఇత్యాది కారణాలతో భవిష్యత్తులో ఆహార భద్రతకు పెను సవాలు రానున్నది. అంతేకాకుండా వ్యవసాయ భూములను సైతం తేరగా వచ్చిన ధనాన్ని నయా పెట్టుబడిదారులు గ్రామాల్లో చేరి భూములను చెరబట్టడం, రియల్ ఎస్టేట్ వైపు మళ్లించడం లాంటి చర్యలతో నిజమైన రైతులే రైతు కూలీలుగా మారుతున్న దుస్థితి దాపు రించింది. ‘సేద్యం గానీ స్వేదం గానీ ఎరుగని‘ నయా పెట్టుబడిదారులచెరలోకి భూమి తరలుతున్నది.  వ్యవసాయదారులు చినుకు కోసం నింగి వైపు, చినుకు పడితే పెట్టుబడి కోసం గ్రామ సేటుల దగ్గరికి,  విత్తులకై ఆరాటం, కూలీ డబ్బుల చెల్లింపులకై పోరాటం, తదనంతరం క్రిమిసంహారక మందులతో కుస్తీతోనే పంట కాలం గడుపుతున్నా, చివరికి దిగుబడి వచ్చేసరికి అతనికి పెట్టిన పెట్టుబడి సైతం రాని దుస్థితి. రైతులకు దక్కని గిట్టుబాటు దళారీలకు దక్కుతున్న తీరు ఇంకెన్నేళ్ళు? పైపై ప్రకటనలు, ఎన్నికల హామీలతో రైతులను నమ్మించి నట్టేట ముంచుతున్న ప్రభు త్వాలు ఇప్పటికైనా రైతుగోసను మన్నించి వ్యవ సాయ రంగ సమూల క్షాళనకై  పూనుకోవాలి. భారత హరిత విప్లవ పితామహుడు స్వామినాధన్ లాంటి శాస్త్రవేత్తలు చేసిన మేలైన సూచనలు ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవాలి.  ముఖ్యంగా రైతులకు అదనుకు పెట్టుబడి సాయం, నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు, భూసార పరీక్షలు, సేంద్రియ జీవ ఎరువులు, ఉపాధిహామీ పథకానికి  అనుసంధానత, మార్కెట్ సదుపాయాలు ఆధునీకరణ, గిట్టుబాటు ధర, నిల్వ సదుపాయాలు, మౌలిక వసతుల పెంపు, వ్యవసాయ యాంత్రీకరణ, ఆధునిక సేద్య పద్ధతులు, నీటి పారుదల వ్యవస్థ మెరుగు వంటి చర్యలుయుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. 


దళారీ వ్యవస్థ తగ్గించడానికి చర్యలు, ప్రభుత్వ నిత్య పర్యవేక్షణ, ధరలను మాయచేసే మాయగాళ్ల అదుపు, రైతులను మోసం చేసే వారిపై కఠిన చట్ట ప్రయోగంతో పాటు విరివిగా  గిడ్డంగులు,శీతల గిడ్డంగుల ను పెంచి నిలువ సౌకర్యాన్ని పెంచాలి. అంతేకాకుండా ఆహారశుద్ధి పరిశ్రమను ప్రోత్సహించాలి. వ్యవసాయేతరులు వ్యవసాయ భూమి కొనుగోలును  నిరుత్సాహ పరచాలి. రైతుకూలీల సంక్షేమానికి ప్రభుత్వాలు కృషిచేస్తే రైతులపై భారం తగ్గుతుందని మరవరాదు. అంతేకాకుండా ప్రతి రైతును ప్రభుత్వానికి అనుసంధానం చేసుకుని నేరుగా రుణాలు, ఇతర ఉపకరణాలు అర్హులకే చేరేలా చర్యలు చేపట్టాలి. అంతేకాకుండా తనఖా లేకుండా బ్యాంకు రుణాలు, కంపెనీల అడ్డగోలు ప్రచారంపై నియంత్రణ, వ్యాపారస్తుల నుండి రశీదులు తప్పనిసరి చేయటం, వ్యవసాయోత్పత్తులు ప్రభుత్వం ద్వారా కొనుగోలు (వీలైనంత మేరకు), కరువు, వరద, పంటలపై చీడపీడలు లేదా వాతావరణ మార్పుల వల్ల నష్టం వాటిల్లితే నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వంకృషి చేయాలి. రైతు కష్టానికి ఫలసాయం దక్కేలా చర్యలు గైకొనడమే కాదు వ్యవసాయ సంబంధ అన్ని సమస్యలను క్రమక్రమంగా పరిష్కరించాలి.  వ్యవసాయంతో పాటు గా అనుబంధ రంగాలకు సైతం ఊతమిచ్చీ ప్రోత్సహించినపుడే ఆరుగాలం శ్రమించే రైతన్నకు కాసింత ఆలంబనగా ఉంటుంది.
 

వినోద్‌కుమార్ సుద్దాల
రీసెర్చ్‌స్కాలర్,
ఉస్మానియా యూనివర్సిటీ

English Title
Farmless agriculture
Related News