హరీశ్‌రావుపై వెల్లువెత్తిన అభిమానం

Harish Rao
  • తరలి వచ్చిన అభిమానులు

హైదరాబాద్: హరీశ్ రావు... ఈ పేరులోనే ఏదో మంత్రం ఉంది. ఆయన ఏ కార్యం చేపట్టినా విజయమే. ఏ పని అప్పగించినా సాకారం అవుతుంది... జనంలో నాలుకగా ఆయనకు మంచి పేరుంది. విదేయతకు నిలువుటద్దంగా గుర్తింపు ఉంది. ఆయన చక్రం తిప్పితే సాధించనిదంటూ ఏమి లేదని ఇప్పటికే అనేక సందర్భాల్లో రుజువైంది. కేసీఆర్‌కు అత్యంత ఆత్మీయుడు. రాముడికి హనుమంతుడు లాంటి సేవకుడు... శివునిలా గరళాన్ని మింగేయగలడు. తనలోని ఆవేదన, ఆవేశంపై నివురు గప్పుకోవడంలో మరొకరు ఆయనకు సాటి రారు. అందుకేనే మో.. అత్యధికులైన కార్యకర్తలకు ఆరాధ్య నాయకుడు. ఆయన మాట అభిమానులకు వేదం. రాగద్వేషాలకు అతీతంగా రాజకీయం నడపడంలో దిట్ట. టీఆర్‌ఎస్‌ను  అనేక ఆపదల నుండి గట్టెక్కించిన ధీరుడు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సమకాలీన రాజకీయాల్లో అందరి నోట్లో నాలుకగా మెదిలే రాజనీతిజ్ఞుడు హరీశ్‌రావు అని చెప్పవచ్చు. శనివారం ఉదయం ఆయన నివాసం అబిమానులతో నిండిపోయింది. మంత్రుల నివాస ప్రాంగణం వందలాది వాహనాలతో కిక్కిరిసింది. వేలాది మంది అభిమానులు ఆయనను అభినందించడానికి వందల వాహనాలతో తరలి రావడంతో మంత్రుల నివాస ప్రాంగణమంతా  కోలాహలంగా మారింది.  రాజకీయాల్లో రికార్డుల మీద రికార్డులు సృష్టించిన టీఆర్‌ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యేగా ఆయనకు సిద్దిపేట, గజ్వేల్ నియోజక వర్గ్లాలో వేలాది అభిమానులు ఉన్నారు. ఆయన వారిని కలవకుండా ఉండలేరు. ఏ మాత్రం సమయం దొరికినా నియోజక వర్గానికి వెళుతుంటారు. అందరిని పలకరిస్తుంటారు. అందుకే  హరీష్‌రావుపై అభిమానం వెల్లువెత్తుతుంది. తాజాగా సిద్దిపేట నుండి 1,18,699 ఓట్ల మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించారు. అలాంటి ఈ టీఆర్‌ఎస్ ట్రబుల్ షూటర్‌ను అభినందనలు  తెలిపేందుకు అభిమానగణం భారీగా తరలివచ్చారు. ఇదిలా ఉంటే టీఆర్‌ఎస్ తొలి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా  కేటీఆర్ నియమితులైన నేపథ్యంలో హరీష్ అభిమానులు వేలాదిగా తరలిరావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. 

తెలంగాణ ఎన్నికల్లో వ్యూహకర్తగా హరీష్‌రావు  పావులు కదిపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఓడించడంలో,  సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో భారీ మెజార్టీతో గెలవడంలో కీలక పాత్రపోషించారు. దీంతో  టీఆర్‌ఎస్ ట్రబుల్ షూటర్‌గా వ్యూహాలు రచించడంలో తాను దిట్టా అని మరోసారి నిరూపించు కున్నారు. కేటీఆర్ ను టీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షునిగా నియమించిన మరుసటి రోజే  హరీష్ రావు ఇంట్లో ఈ హంగామా ఏంటి?. ఒక్కసారిగా ఎందుకు ఆయన అభిమానులు బారులు తీరి హైదరాబాద్ వచ్చారు. మంత్రుల క్వార్టర్లలో బారులు తీరిన కార్లు..వేలాది మంది అభిమానులు శనివారం ఉదయం నుంచి హరీష్ రావు నివాసానికి క్యూ కట్టారు. ఇది టీఆర్‌ఎస్ వర్గాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. శుక్రవారం నాడే సీఎం కెసీఆర్ తన తనయుడు,మాజీ మంత్రి కెటీఆర్ కు పార్టీలో అత్యంత కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారు. ఈ ప్రకటన తర్వాత కేటీఆర్ స్వయంగా హరీష్ రావు నివాసానికి వెళ్లి  మరీ ఆయన్ను కలసి వచ్చారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం వెనక కేసీఆర్, కేటీఆర్ లతోపాటు హరీష్ రావు కూడా కీలక భూమిక పోషించారు. ముఖ్యంగా మహాకూటమిపై వ్యతిరేక ప్రచారం చేయటంలో ఆయన అందరి కంటే ముందు ఉన్నారు. కూటమి అధికారంలోకి వస్తే అత్యంత కీలకమైన, సాగునీటి శాఖలు టీడీపీకి చేతిలోకి వెళతాయని..అప్పుడు వాళ్లు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుంటా రని ప్రచారం చేయటం  ద్వారా ప్రజల్లో అను మానాలు రేకేత్తించేలా చేయటంలో హరీష్  సక్సెస్ సాధించారు. సహజంగానే హరీష్ రావు నిత్యం నియోజకవర్గానికి వెళుతూ అక్కడి ముఖ్యనేతలకు..ప్రజలకు అందుబాటులో ఉంటారు. అలాంటిది వేలాది మంది ఇలా హైదరాబాద్ బయలుదేరి ఎందుకు వచ్చారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది?. పదునైన నాయకుడు, పార్టీని బలోపేతం చేసిన నేత, అనేక సమస్యలను అధిగమించి పార్టీని, ప్రభుత్వాన్ని సాఫీగా నడిపించడంలో వెనుకుండి చక్రం తిప్పిన నాయకుని సేవలను అధినేత గుర్తించడం లేదనే ఆవేదన ఆయనను కలిసి అభినందించిన కార్యకర్తల నుండి వ్యక్తమ యింది. హరీశ్‌రావును తక్కువ చేసే చూస్తు న్నారనే ఆవేదన వెల్లడైంది. అనేక మంది అభిమానులను ఆయన ఓదార్చడం, అభిమా నులు ఎంతగా ఆవేదపడినప్పటికీ నోరు జార కుండా జాగ్రత్తగా వ్యవహరిం చడంతో అంతా బాధతో వెనుదిరిగారని అంటున్నారు. హరీశ్ రావు బలం, బలహీనతలు తెలిసిన అభిమా నులు, సన్నిహితులు ఒక రకంగా ఆవేదన చెందుతున్నారు. టీఆర్‌ఎస్‌లో ఇక హరీశ్‌రావు అవసరమైనప్పుడు ట్రబుల్ షుటర్‌గానే కొనసా గుతారని, కేసీఆర్, కేటీఆర్లు అందలమెక్కడానికి ఆయనొక నిచ్చనగానే దోహదపడతారని అభిమానులు అనడం  గమనార్హం.

Tags

సంబంధిత వార్తలు