ఫెడ్‌కప్ ప్రతిభ ప్రోత్సాహకరంగా ఉంది

Updated By ManamTue, 02/13/2018 - 21:14
Sania Mirza

హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా
Sania Mirzaన్యూఢిల్లీ:
ఫెడ్‌కప్ టెన్నిస్ టోర్నీలో అంకిత రైనా ప్రతిభ ప్రోత్సాహకరంగా ఉందని.. కానీ భారత జట్టు తదుపరి లెవెల్‌కు అర్హత సాధించాలని హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చెప్పింది. గతవారం జరిగిన ఫెడ్‌కప్ ప్లే ఆఫ్ టోర్నీలో ఇండియా 2-0తో చైనీస్ తైపీని ఓడించి ఆసియా/ఓసియేనియా గ్రూప్-1లో స్థానాన్ని పదిలపరచుకున్న సంగతి తెలిసిందే. కానీ అంతకుముందు చైనా, కజకిస్థాన్ జట్ల చేతుల్లో భారత్ ఓటమిపాలైంది. ‘ప్రతిసారీ మనం వట్టి చేతులతో తిరిగొస్తున్నాం. కానీ ఇప్పుడు యువకులు అద్భుత ప్రతిభతో దూసుకెళుతున్నారు. టాప్-100 ప్లేయర్స్‌పై అంకిత రైనా గెలవడం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. అంతకుముందు మ్యాచ్‌ల్లో ఓడిపోయినా తర్వాత పోరులో గెలవడం పాజిటివ్ సంకేతాలనిస్తోంది’ అని సానియా చెప్పింది. అయితే సానియా తర్వాత అంతటి ప్లేయర్ ఎవరని భావిస్తున్నారు? అన్న ప్రశ్నకు 31 ఏళ్ల సానియా సమాధానమిస్తూ.. ప్రతిభావంతులైన యువతకు తాను బెంచ్ మార్క్ కాదలచుకోలేదని తెలిపింది. ‘సానియా తర్వాత ఎవరు? అని చాలా ఏళ్లుగా నన్ను అడుతున్నారు. కానీ నేను ఎల్లప్పుడు చెప్పేదేంటంటే.. సానియా తర్వాత ఎవరు? అన్న ప్రశ్న ఎందుకు? సానియా కంటే మెరుగైన ప్లేయర్‌గా ఎందుకు ప్రయత్నించకూడదు. నేనే ఎందుకు?’ అని సానియా పేర్కొంది. గాయాల కారణంగా సానియా డబుల్స్ ర్యాంకింగ్ 14కు పడిపోయింది. పట్టుదల, స్థిరంగా రాణించడం కెరీర్ సక్సెస్‌కు ప్రధాన కారణమని.. యువ తరం ఎల్లప్పుడు శ్రమిస్తూ ఉండాని సానియా చెప్పింది. ఆరు గ్రాండ్ శ్లామ్ టైటిల్స్ విజేత సానియా మోకాలి గాయం కారణంగా 2017 అక్టోబర్ నుంచి టెన్నిస్‌కు దూరమైంది. అయితే ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో మళ్లీ బరిలోకి దిగే అవకాశముందని సానియా తెలిపింది. ‘కోలుకునేందుకు సమయ నిబంధన అంటూ ఏమీ లేదు. దాని కోసం ఓ తేదీ అంటూ నిర్ణయించలేదు.  ప్రతి రోజూ పోరాడుతున్నాను. కానీ ఫ్రెంచ్ ఓపెన్‌కు పూర్తిగా కోలుకుని బరిలోకి దిగుతానని భావిస్తున్నాను’ అని సానియా చెప్పింది. 

English Title
Fed Cup performance very encouraging, says Sania Mirza
Related News