విజయనగరాన్ని వీడని జ్వరాలు

Updated By ManamMon, 09/03/2018 - 23:40
chandrababu
  • 80కి పైగా డెంగ్యూ కేసులు, 50 మంది మృతి

  • సీఎం హెచ్చరించినా కదలని యంత్రాంగం    

  • ముఖ్యమంత్రి పోర్టుపోలియో కావడంతో.. పట్టనట్టు వ్యవహారిస్తున్న జిల్లా మంత్రులు! 

chandrababuవిజయనగరం: విజయనగరం జిల్లా ప్రజలను విష జ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. సీజన్ ప్రారంభమైన తర్వాత జిల్లాలో ఆగస్టు 25 నాటికి 2,22,354 మంది జ్వరాల బారిన పడ్డారు. ఇందులో 294 మలేరియా కేసులు కాగా, 81 డెంగ్యూ కేసులున్నాయని వైద్య,ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. అయితే వాస్తవంలో మాత్రం పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గ్రామాల్లోని చిన్న చిన్న ఆస్పత్రుల నుంచి పట్టణంలోని కార్పోరేట్ ఆస్పత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్‌లు కూడా దొరకని పరిస్థితి ఉంది. జిల్లా 81 డెంగ్యూ కేసులు నమోదు కాగా వారిలో ఇద్దరే మరణించారని అధికారులు చెబుతన్నారు. నిజానికి డెంగ్యూ, ఇతర విష జ్వరాల బారిన పడి మరణించిన వారి సంఖ్య 50కి పైగా ఉంటుంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు చేసుకొని, అటు తర్వాత చనిపోయిన వారిని అధికారిక లెక్కల్లోకి తీసుకోబోమంటూ డీఎంహెచ్ విజయలక్ష్మి తెలిపారు. దీని ప్రకారం ప్రభుత్వ గణాంకాలకు వాస్తవానికి చాలా తేడా ఉందని స్పష్టమవుతుంది. సాలూరు మండలం ఖరాస వలసలో 20 రోజుల్లో పది మంది విష జ్వరాలు, వివిధ రకాల వ్యాధులతో మరణించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీనిపై స్పందించారు. జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. సోమవారం నాటికి జ్వరాలు నియంత్రణలోకి రాకపోతే తానే స్వయంగా పర్యటిస్తానని, కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. దీంతో జిల్లా యంత్రాంగం ఆదివారం మరోసారి ఖరాసవలసకు పరుగులు తీసింది. గ్రామంలోని పరిస్థితిని ఆరా తీసింది. మరో పది మందికి పైగా జ్వరాలతో బాధపడుతున్నట్టు గమనించారు. వారిని విశాఖ, విజయనగరం, సాలూరు ఆసుపత్రులకు తరలించారు.

chandrababu

పట్టనట్టు వ్యవహరిస్తున్న మంత్రులు.. 
జిల్లాలో ఇంత జరుగుతున్నా జిల్లాకు చెందిన మంత్రులు మాత్రం పెద్దగా స్పందించడం లేదు. జిల్లా నేత, రాష్ట్ర గనుల శాఖ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు ఇప్పటివరకు  ఖరాసువలస వైపు కన్నెత్తి చూడలేదు. జిల్లాలో సోమవారం జరిగిన పలు కార్యక్రమాల్లో బిజీబిజీగా గడిపిన సుజయ్‌కృష్ణ జ్వరాల విషయాన్ని మాత్రం పట్టించుకోలేదు. మరోపక్క జిల్లా ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా జిల్లాలో ప్రబలిన జ్వరాలపై ఇప్పటివరకు కనీసం స్పందించలేదు. వీరి తీరు పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరు మంత్రులు వర్షాకాలం సీజన్ మొదలైన తర్వాత నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించలేదు. జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్నా గంటా, విశాఖ నుంచే పని మొత్తం కానిస్తున్నారు. ఒకటి, అరా కార్యక్రమాలలో పాల్గొనడానికి మంత్రి గంటా జిల్లాకు వచ్చారు. ఆ తర్వాత జిల్లా పాలనపై, పరిస్థితులపై ఒక్కసారి కూడా సమీక్షలు చేయలేదు. టీడీపీకి జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న ఎంపీ అశోక్‌గజపతిరాజుతో మంత్రి గంటాకు సఖ్యత లేకపోవడం వల్లే గంటా జిల్లా వ్యవహారాలపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

సీఎం పోర్టుపోలియో కావడం వల్లే..
కామినేని శ్రీనివాస్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా రాజీనామా చేసిన తర్వాత ఆ శాఖను ప్రభుత్వం ఎవ్వరికీ కేటాయించలేదు. వైద్య, ఆరోగ్య శాఖ ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆధీనంలోనే ఉంది. శాఖ సీఎం పరిధిలో ఉన్నందువల్ల సమీక్షలు చేయాలన్నా, ఆ శాఖ అధికారులతో చర్చించాలన్నా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు వెనకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. విజయనగరంతో పాటు విశాఖ జిల్లాలోను పెద్ద ఎత్తున జ్వరాలు ప్రబలుతున్నా, ప్రజల ప్రాణాలో పోతున్నా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ కనీసం ప్రకటనలు కూడా చేయలేకపోవడానికే ఇదే ప్రధాన కారణమని పలువురు చెబుతున్నారు.

English Title
fever of vijayanagaram
Related News