మరో సిరీస్‌పై దృష్టి 

Updated By ManamWed, 02/21/2018 - 00:19
indian team
  • నేడు ఇండియా, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20

  • రాత్రి 9-30 నుంచి సోనీ టెన్-1లో ప్రత్యక్షప్రసారం

indian teamసెంచూరియన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో టీ20కి పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశముంది. వరుస విజయాలు సాధిస్తున్న టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో సిరీస్‌ను సొంతం చేసుకునేందుకు బరిలోకి దిగనుండగా.. వరుస ఓటములకు గురవుతున్న సౌతాఫ్రికా జట్టు సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకునేందుకు పోరాడ నుంది. ఇండియా, సౌతాఫ్రికా మధ్య బుధవారమిక్కడ రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన తొలి టీ20లో కోహ్లీ సేన 28 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. అయితే రెండో టీ20లోనూ గెలిచిన సౌతాఫ్రికా పర్యటనలో మరో సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. టెస్టుల్లో 1-2తో ఓటమిపాలై తర్వాత 5-1తో వన్డే సిరీస్‌ను గెలిచిన టీమిండియా సుదీర్ఘ సౌతాఫ్రికా పర్యటనను సంతోషదాయకంగా ముగించాలని భావిస్తోంది. అయితే టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0తో గెలిస్తే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకునే అవకాశముంది. కానీ బుధవారమే జరగనున్న టీ20 ముక్కోణపు సిరీస్ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్‌ను ఓడిస్తే టీమిండియా మూడో ర్యాంక్‌కే పరిమితమవు తుంది.  మ్యాచ్ సమయానికి కోహ్లీ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని జట్టు సభ్యులు అనుకుంటున్నారు. ఆదివారం జరిగిన తొలి టీ20లో కోహ్లీ తొడ కండరాల నరం పట్టేసిన గాయానికి గురైన విషయం విదితమే. అయితే కోహ్లీ గాయం అంత తీవ్రమైందేమీ కాదని.. రెండో టీ20లో అతను టాస్‌లో పాల్గొంటాడని టీమిండియా మేనేజ్‌మెంట్ అంటోంది.

డర్బన్‌లో జరిగిన తొలి వన్డేలోనూ కోహ్లీ మోకాలి గాయానికి గురయ్యాడు. అయినప్పటికీ తర్వాతి మ్యాచ్‌ల్లో అతను అద్భుత ప్రతిభ కనబరిచాడు. అయితే కోహ్లీ మరో గాయానికి గురికావడం అతనిపై పడిన పని ఒత్తిడిని తెలియజేస్తోంది. ఒకవేళ రెండో టీ20లో టీమిండియా గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంటే కేప్‌టౌన్‌లో జరగనున్న చివరి, మూడో టీ20కి కోహ్లీ విశ్రాంతి తీసుకునే అవకాశముంది. ఎందుకంటే రాబోయే మూడు నెలల్లో టీమిండియా ఎడతెరిపిలేని షెడ్యూల్‌లో పాల్గొననుంది. ఒకవేళ రెండో టీ20కి కోహ్లీ దూరమైతే అతని స్థానంలో కేఎల్ రాహుల్‌కు జట్టులో చోటు దక్కే అవకాశముంది. గత మ్యాచ్‌లో మనీష్ పాండే కోసం రాహుల్ పక్కన కూర్చున్నాడు. కానీ ఇప్పుటు కోహ్లీ ఫిట్‌నెస్ సమస్యల వల్ల రాహుల్‌కు చోటు దక్కనుంది. అయితే టీమిండియా తుది జట్టులో ఇదొక్క మార్పే ఉంటుందని అనుకోవడానికి వీల్లేదు. వాండరర్స్ మాదిరిగా ఈ సూపర్‌స్పోర్ట్ పార్క్ పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశముండడంతో ఎడమ చేతి స్పిన్నర్ జైదేవ్ ఉనద్కట్‌కు మరోసారి తుది జట్టులో చోటు కల్పించే అవకాశముంది. టీమిండియా పర్యటన అంతా ఈ సూపర్‌స్పోర్ట్ పార్క్ పిచ్.. స్లోగా స్పందించింది. మరోసారి అలాంటి స్వభావం కనబరిచే అవకాశముంది. దీంతో టీమిండియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. చినమన్ బౌలర్ కుల్‌దీప్ యాదవ్‌కు మళ్లీ తుది జట్టులో చోటు కల్పించే అవకాశముంది. మరోవైపు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని అక్షర్ పటేల్‌కు తన సత్తా చాటుకునే అవకాశాన్ని టీమిండియా కల్పించనుంది. 

మరోసారి ఒత్తిడిలో సౌతాఫ్రికా
గత మంగళవారం సౌతాఫ్రికా జట్టు చావో రేవో పరిస్థితిని పోర్ట్ ఎలిజబెత్‌లో ఎదుర్కొంది. మరో ఎనిమిది రోజుల తర్వాత ప్రొటీస్‌కు మరోసారి అదే పరిస్థితి ఎదురైంది. టీమిండియా నుంచి ఎదురవుతున్న అత్యధిక సవాల్‌ను ఎదుర్కొనేందుకు ఆతిథ్య జట్టు కొత్త ముఖాలపైనే ఆధారపడుతోంది తప్ప తగిన బలాన్ని సమకూర్చుకోవడం లేదు. సౌతాఫ్రికా జట్టుకు బలంగా ఉన్న ఏకైక సీనియర్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ కూడా ఇప్పుడు గాయం కారణంగా దూరమయ్యాడు. కానీ సౌతాఫ్రికా క్రికెట్ జట్టు డివిలియర్స్‌కు ప్రత్యామ్నాయాన్ని ప్రకటంచలేదు. కనుక జట్టులో ఉన్న వారిలోనుంచే కెప్టెన్ జేపీ డుమిని ఒక పరిష్కారాన్ని వెతుక్కోవాలి. తొలి టీ20లో షార్ట్ పిచ్ బంతులతో టీమిండియాను దెబ్బతీయాలన్న ప్రొటీస్ తాత్కాలిక కెప్టెన్ డుమిని ఎత్తుగడ బెడిసికొట్టింది. ఇటువంటి పరిస్థితుల్లో తొలి మ్యాచ్‌లో ఆడే జట్టుతోనే బరిలోకి దిగే అవకాశముంది. సెంచూరియన్‌లోనూ డుమిని షార్ట్ పిచ్ బంతి ఎత్తుగడను వేసే అవకాశముంది. పిచ్ సహకరిస్తే సరే.. లేదంటే డుమిని ప్లాన్-బితో బరిలోకి దిగాల్సివుంటుంది. 

రైనాకు నం. 3 దక్కుతుందా?
suresh-rainaసురేష్ రైనాకు పదోన్నతి కల్పించి తొలి టీ20లో మూడో నంబర్ స్థానంలో బరిలోకి దించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఒకవేళ ఈ మ్యాచ్‌కు కోహ్లీ అందుబాటులోకి వస్తే అదే స్థానంలో రైనా ఆడతాడా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. జొహన్నెస్ బర్గ్‌లో టీమిండి యా మేనేజ్‌మెంట్ పరిస్థితులను ముందుగానే పసిగట్టింది. ఈ క్రమంలో రైనాకు పదోన్నతి కల్పించి అటాకింగ్ గేమ్ ఆడాలని కోరింది. ఆ పిచ్‌పై కోహ్లీ సేన 200కుపైగా పరుగులు సాధించింది. తన మూడో నంబర్ స్థానాన్ని రైనాకిచ్చిన కోహ్లీ మిడిలార్డర్‌లో బరిలోకి దిగాడు. అంతేకాదు తనదైన శైలిలో బ్యాటింగ్ ఆడేందుకు రైనాకు కోహ్లీ పూర్తి స్వేచ్ఛ కూడా ఇచ్చాడు. 

English Title
Focus on another series
Related News