గొర్రెలకు ఉచితంగా దాణా

Updated By ManamSun, 04/01/2018 - 01:32
talasani
  • ఒక్కో యూనిట్‌కు 4 బస్తాలు

  • గొర్రెలకాపరి మరణిస్తే 6 లక్షలు

  • రాష్ట్రవ్యాప్తంగా 17వేల నీటితొట్టెలు

talasaniహైదరాబాద్ (మనం ప్రతినిధి): వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెల కోసం ఉచితంగా దాణా అందిం చనున్నట్టు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇందుకుగానూ రూ.66 కోట్లు వెచ్చించనున్నట్లు వివరించారు. శనివారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణాలో ఇప్పటి వరకు 2,53,785 మంది లబ్ధిదారులకు 53 లక్షల పైచిలుకు గొర్రెలను పంపిణీ చేశామన్నారు. వీటి రక్షణకోసం యూనిట్‌కు 4 బస్తాల దాణాను అందిస్తున్నామన్నారు. వేసవిలో ఎక్కువ కోతలు ఇచ్చే మేలు రకపు పశుగ్రాస విత్తనాలను 75 శాతం రాయితీపై ఇవ్వనున్నట్టు వివరించారు. గొర్రెలకు బీమా సౌకర్యం కల్పించామని, చనిపోయిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తే పరిహారం పొందవచ్చని మంత్రి తెలిపారు.

             గొర్రెల పెంపకందారుడు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని తెలిపారు. రాబోయే కొద్దిరోజుల్లో తెలంగాణ మాంసం ఎగుమతి చేసే స్థాయికి చేరుతుందని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో ఆధునిక సౌకర్యాలతో గొర్రెల పెంపకంపై శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. పశువుల ఆరోగ్యానికి సంబంధించి 1962 కాల్‌సెంటర్ ద్వారా వెటర్నరీ సేవలందిస్తున్నామని, మొత్తం 100 సంచార పశు వైద్యశాలలు పనిచేస్తున్నాయన్నారు. శాఖ కార్యద ర్శి సందీప్‌కుమార్ సుల్తానియా మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకుని గొర్రెల తాగునీటిపై రాష్ట్రవ్యాప్తంగా 17వేల నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 3వేల నీటితొట్లు అందుబాటులోకి వచ్చాయని, గొర్రెల కోసం 90% సబ్సిడీ పై షెడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

English Title
food for goats free
Related News