స్మార్ట్ సిటీలకు ఫ్రాన్స్ నిధులు?

Updated By ManamMon, 02/19/2018 - 03:21
smart-city

జూ800 కోట్లు ఇవ్వనున్న ఏఎఫ్‌డీ
smart-cityన్యూఢిల్లీ:
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్మార్ట్ సిటీస్ మిషన్‌పై ఫ్రాన్స్ డెవలప్‌మెంట్ బ్యాంకు ఆసక్తి ప్రదర్శిస్తోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మిషన్ అమలుకు నిధులు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిందని శాఖ అధికారి ఒకరు తెలిపారు. స్మార్ట్ సిటీ పథకం కింద వివిధ రాష్ట్రాల్లోని పలు నగరాలను ఎంపికచేసి కేంద్రం వాటిని మరింత అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే! ఇప్పటి వరకు 99 నగరాలను ఈ పథకం కింద ప్రభుత్వం ఎంపిక చేసింది. వీటి అభివృద్ధికి రూ.2.03 లక్షల కోట్ల అవసరం ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ తరహా ప్రాజెక్టులకు ఫ్రాన్స్‌కు చెందిన ఏజెన్సీ ఫ్రాంచైజీ డీ డెవలప్‌మెంట్(ఏఎఫ్‌డీ) బ్యాంక్ ఆర్థిక సహాయం చేస్తుంది. భారత్‌లోనూ 2008 నుంచి ఈ బ్యాంక్ సేవలందిస్తోంది. తాజాగా స్మార్ట్ సిటీ మిషన్‌కు 100 మిలియన్ల యూరోలు(సుమారు రూ.800కోట్లు) ఇచ్చేందుకు ఏఎఫ్‌డీ ఆసక్తి కనబరుస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మేక్రాన్ భారత్ పర్యటనకు ముందే దీనిపై తుది నిర్ణయం వెలువడుతుందని ఆర్థికశాఖ అధికారి వెల్లడించారు.  జర్మనీ, జపాన్ దేశాలు కూడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు.

Tags
English Title
France to finance smart cities?
Related News