గాలి జనార్దన రెడ్డి మిస్సింగ్!

Updated By ManamThu, 11/08/2018 - 15:57
Gali Janardhan Reddy absconding, say police
  • రూ. 18 కోట్ల లంచం ఆరోపణలు

  • మంత్రిగా ఉన్న సమయం నాటి కేసు

  • కనిపించడం లేదన్న పోలీసులు

Gali Janardhan Reddy absconding, say police

బెంగళూరు : బళ్లారి మైనింగ్ కింగ్, మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి అదృశ్యమయ్యారు. రూ. 18 కోట్ల లంచం కేసులో ఆయనను విచారించాలనుకున్న బెంగళూరు పోలీసులు.. ఆయన కనపడటం లేదని తెలిపారు. కర్ణాటకలో అత్యంత శక్తిమంతమైన వ్యాపారవేత్త, నాయకుడు అయిన జనార్దన రెడ్డిపై పలు అవినీతి ఆరోపణలున్నాయి. ఇప్పటికే మూడేళ్ల పాటు జైల్లో ఉండి, 2015లో ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు.

రూ. 18 కోట్ల లంచం కేసులో ఆయనను క్రైం బ్రాంచి పోలీసులు విచారించాలనుకున్నారు. అవినీతి కేసు నుంచి తనను బయట పడేయడానికి మంత్రిగా ఉన్న సమయంలో గాలి జనార్దనరెడ్డి రూ. 18 కోట్ల లంచం డిమాండు చేశారని, ఆ మొత్తాన్ని ఆయన సన్నిహితుల్లో ఒకరికి చెల్లించానని యాంబియెంట్ గ్రూప్ అధినేత ఆరోపించారు. వందలాది మంది పెట్టుబడిదారులను రూ. 600 కోట్ల మేర మోసం చేసినట్లు యాంబియెంట్ గ్రూప్‌పై ఆరోపణలున్నాయి. 

గాలి జనార్దనరెడ్డి ఒక హోటల్లో తనను కలిసి సాయం చేస్తానన్నారని ఆ గ్రూప్ అధినేత సయ్యద్ అహ్మద్ ఫరీద్ తెలిపారు. దాంతో తాను రమేశ్ కొఠారీ అనే బులియన్ వ్యాపారికి రూ. 18 కోట్లు ఇవ్వగా, ఆయన మరో నగల వర్తకుడికి ఇచ్చి, 57 కిలోల బంగారంగా దాన్ని మార్చారన్నారు. ఆ బంగారాన్ని జనార్దనరెడ్డికి సన్నిహిత అనుచరుడైన అలీఖాన్‌కు అందించామని తెలిపారు. దాంతో ఇప్పుడు అలీఖాన్, జనార్దనరెడ్డిలను విచారించాలని చూస్తుండగా ఇద్దరూ కనపడటం లేదని బెంగళూరు పోలీసు కమిషనర్ టి.సునీల్‌కుమార్ తెలిపారు. 

గత సంవత్సరం ఒకవైపు దేశమంతా పెద్దనోట్ల రద్దు అనంతరం కరెన్సీ దొరక్క కష్టాలు పడుతుంటే అదే సమయంలో గాలి జనార్దనరెడ్డి తన కూతురి వివాహాన్ని అంగరంగవైభవంగా చేశారు. ఇపుడు ఆయన అదృశ్యం కావడంపై ఆయన సన్నిహితుడు, బీజేపీ ఎమ్మెల్యే బి. శ్రీరాములును అడగ్గా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తనకు దీనిపై ఎలాంటి సమాచారం లేదని అన్నారు. అలాగే ఎవరూ చట్టానికి అతీతులు కారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. 

English Title
Gali Janardhan Reddy absconding, say police




Related News