'గ్యాంగ్' రివ్యూ

Updated By ManamFri, 01/12/2018 - 17:59
gang

gangచిత్రం: గ్యాంగ్
తారాగణం: సూర్య, కీర్తి సురేష్, రమ్యకృష్ణ, కార్తిక్, సెంథిల్, తంబి రామయ్య, ఆనంద్ రాజ్, బ్రహ్మానందం, సురేష్ మీనన్, నందా, ఆర్‌.జె.బాలాజీ, నిరోషా తదితరులు
ఛాయాగ్రహణం: దినేష్ కృష్ణన్
కూర్పు: ఎ.శ్రీకర్ ప్రసాద్
మాటలు: శ‌శాంక్ వెన్నెల కంటి
సంగీతం: అనిరుధ్‌ రవిచందర్
నిర్మాతలు: ప్రమోద్, వంశీ
బ్యానర్: యువి క్రియేషన్స్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విఘ్నేష్‌ శివన్
విడుదల తేది: జనవరి 12, 2018

మంచి వాళ్లు చెడ్డ‌వాళ్లుగా మారితేనే.. చెడ్డ‌వాళ్లు మంచి వాళ్లుగా మారుతారు.. అని భావించే 1987 కాలం నాటి ఓ యువ‌కుడి ఆలోచ‌న‌కు రూప‌మే 'గ్యాంగ్' చిత్రం. సూర్య‌, కీర్తి సురేష్, ర‌మ్య‌కృష్ణ‌, కార్తీక్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా.. హిందీ చిత్రం ‘స్పెషల్ ఛ‌బ్బీస్‌’ రీమేక్‌గా తెర‌కెక్కింది. శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ సినిమాపై మనం అందిస్తున్న‌ సమీక్ష మీ కోసం:

కథ: 
gangతిలక్ (సూర్య) చిన్నప్పటినుంచి సి.బి.ఐ ఆఫీసర్ అవ్వాలని కల‌లు కంటూ ఉంటాడు. తిల‌క్  తండ్రి (తంబి రామ‌య్య‌) మాత్రం ఓ సి.బి.ఐ ఆఫీస్‌లో గుమాస్తాగా పనిచేస్తూ ఉంటాడు. అయితే తండ్రి ప‌నిచేసే ఆఫీస్‌కే ఇంట‌ర్వ్యూకి వెళ్ళిన తిల‌క్‌ని.. ఇంట‌ర్వ్యూ చేసిన అధికారి అవ‌మానిస్తాడు. ''క్లర్క్‌గా ప‌నిచేసే నీ తండ్రి ఆఫీస్‌కే నువ్వు అధికారిగా రావాల‌నుకుంటున్నావా? ఆయ‌న స‌ర్వీస్‌లో పోతే అదే ఉద్యోగం నీకు వ‌స్తుంది? అది చేయ్‌'' అంటూ వ్యంగ్యంగా మాట్లాడ‌తాడు. దీనికి తోడు పోలీస్ కావాల‌నుకున్న తిల‌క్‌ స్నేహితుడు.. అర్హ‌త ఉన్నా నిరుద్యోగం కార‌ణంగా అత‌ని క‌ళ్ళ ముందే ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు. దీంతో.. ల‌క్ష‌లు పోసి ప‌నిచేసే ఉద్యోగం కంటే.. ల‌క్ష్యం కోసం ప‌నిచేసే ఉద్యోగం ఉత్త‌మం అనుకుంటూ.. త‌ను ఓ ఫేక్ సి.బి.ఐ.అధికారిగా మారి.. త‌నలాగే నిరుద్యోగంతో బాధ‌ప‌డుతున్న మ‌రో ముగ్గురు (ర‌మ్య‌కృష్ణ‌, సెంథిల్‌,) స‌హ‌కారంతో సి.బి.ఐ బృందం అంటూ.. అవినీతితో సంపాదించిన వారి ఇళ్ళ‌ల్లో డూప్లికేట్ రెయిడ్ చేసి డ‌బ్బు, న‌గ‌లు సొంతం చేసుకుంటారు. ఈ సోదాల తర్వాత తెలుస్తుంది.. తిల‌క్ టీమ్‌ అసలు సిబిఐ టీమ్‌ కాదు అని. దీంతో అసలు సి.బి.ఐ టీమ్‌ అప్రమత్తమ‌వుతుంది. తిల‌క్ గ్యాంగ్‌ని పట్టుకోవడానికి రంగంలోకి దిగుతుంది.  దీంతో.. తిల‌క్‌ గ్యాంగ్ మరో డూప్లికేట్ రెయిడ్‌ చేయడం కోసం హైదరాబాద్ వెళుతుంది. మ‌రోవైపు ఈ గ్యాంగ్‌ని పట్టుకోవడానికి సి.బి.ఐ స్పెషల్ ఆఫీసర్‌గా శివ‌శంక‌ర్ (కార్తీక్‌) వస్తాడు. మ‌రి.. శివ‌శంక‌ర్ ఈ బృందాన్ని ప‌ట్టుకుంటాడా?  లేదా?  తిల‌క్ ల‌క్ష్యం ఎంత‌వ‌ర‌కు నెర‌వేరింది? అనేది మిగిలిన క‌థ‌.

విశ్లేషణ: 
హిందీలో విజ‌యం సాధించిన స్పెష‌ల్ 26కి రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందించినా.. చెప్పుకోద‌గిన మార్పుల‌తో ఈ సినిమాని తెర‌కెక్కించాడు విఘ్నేష్ శివ‌న్‌. అయితే.. ప్ర‌ధానంగా త‌మిళంలో తెర‌కెక్కిన ఈ సినిమాకి త‌మిళ వాస‌న‌లు ఎక్క‌వ‌గా ఉండ‌డంతో ఇక్క‌డివారిని ఆక‌ట్టుకోవ‌డంలో ఫెయిలయింద‌నే చెప్పాలి. ప్ర‌థ‌మార్థంలో మినిస్ట‌ర్ ఇంటిపై సోదా చేసే స‌న్నివేశం, ద్వితీయార్థంలో వ‌చ్చే ఇంట‌ర్వ్యూ సీన్ మాత్ర‌మే ఈ సినిమాలో క‌ట్టిప‌డేసే దృశ్యాలు. ఇక‌ మిగిలిన సినిమా.. అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. న‌టీన‌టుల విషయానికి వ‌స్తే.. త‌న ఆశ‌యం నెర‌వేర‌క‌పోయినా నిరాశ‌ప‌డ‌క‌.. మ‌రో మార్గంలో దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకునే యువ‌కుడిగా సూర్య న‌ట‌న మెప్పిస్తుంది. చేసే ప‌నితోనే మ‌న గుర్తింపు అంటూ చెప్పుకొచ్చే స‌న్నివేశంలో ఆయ‌న న‌ట‌న మెప్పిస్తుంది. ఆయ‌న సొంత డ‌బ్బింగ్ ఒక‌ట్రెండు చోట్ల ఇబ్బంది పెట్టినా.. త‌న‌ ప్ర‌య‌త్నాన్ని మెచ్చుకోక‌త‌ప్ప‌దు. ఎనిమిది మంది పిల్ల‌ల త‌ల్లి అయిన నిస్స‌హాయ‌క మ‌ధ్య‌త‌ర‌గ‌తి గృహిణి బుజ్జ‌మ్మ‌గానూ.. (ఫేక్‌) సి.బి.ఐ.ఝూన్సీరాణిగానూ.. ఇలా రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌ట‌న గుర్తుండిపోతుంది. కీర్తి సురేష్‌కి ఇందులో న‌టించ‌డానికి పెద్ద‌గా స్కోప్ లేదు. ఒక‌ట్రెండు స‌న్నివేశాల్లో మాత్ర‌మే కాస్త అందంగా క‌నిపించింది. మిగిలిన న‌టులు త‌మ పాత్ర‌ల ప‌రిధుల్లో ఓకే అనిపించుకున్నారు. 
సాంకేతికంగా తీసుకుంటే.. ఈ సినిమాకి దినేష్ అందించిన ఛాయాగ్ర‌హ‌ణం బాగా కుదిరింది. అనిరుధ్ పాట‌లు, నేప‌థ్య సంగీతం ఇంప్రెసివ్‌గా లేవు. శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్ ఎడిటింగ్ వ‌ర్క్ బాగుంది. శశాంక్ మాట‌ల్లో ''ఒక్కడు కోటీశ్వరుడు అవడానికి కోటి మంది చావాల్సి వస్తోంది. మొత్తం తవ్వి బయటికి తీస్తే మన దేశంలో ఉన్న చాలా ప్రాబ్ల‌మ్స్‌ని ఈకల్లా పీకి పారేయొచ్చు”, “గుండెల్లో ధైర్యం...చేతిలో ధర్మం ఉంటే మనం దేనికి భయపడక్కర్లేదు”వంటి డైలాగులు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్‌
సూర్య‌, ర‌మ్య‌కృష్ణ‌
ఛాయాగ్ర‌హ‌ణం
మాట‌లు
నిర్మాణ విలువలు
సినిమా నిడివి

మైన‌స్ పాయింట్స్‌
సంగీతం
ద‌ర్శ‌క‌త్వం
త‌మిళ వాస‌న‌లు ఎక్కువ‌గా ఉండ‌డం

చివ‌ర‌గా.. రీమేక్ వ‌ర్క‌వుట్ కాలేదు
రేటింగ్‌.. 2.5/5
 

English Title
'gang' review
Related News