12న తెలంగాణలో ఆజాద్ పర్యటన

Updated By ManamFri, 09/07/2018 - 16:11
uttam kumar reddy
Uttam Kumar Reddy

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఈ నెల 12న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్రువీకరించారు. సంగారెడ్డిలో జరిగే మైనార్టీ సభలో ఆజాద్ పాల్గొంటారని ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు. ఈనెల 11 నుంచి 18 వరకూ కాంగ్రెస్ జెండా పండుగ నిర్వహిస్తామన్నారు.

అలాగే వార్ రూమ్‌ను మళ్లీ ప్రారంభిస్తున్నామని, పొత్తుల విషయంలో చర్చలు మొదలుపెడుతున్నామని ఉత్తమ్ వెల్లడించారు.  కాగా ఆజాద్ తెలంగాణ పర్యటన గతంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే వైరల్ ఫీవర్ కారణంగా ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.

అభ్యర్థి ఇంటికే బీ ఫారం..
టికెట్ ఆశించే నేతలు ఢిల్లీకి కానీ, గాంధీభవన్‌కుగానీ రావద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. సర్వే ఆధారంగా అభ్యర్థి ఇంటికే బీ ఫారం పంపుతామని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని ఉత్తమ్ పేర్కొన్నారు. అలాగే ఈ నెల 10న జరిగే భారత్ బంద్‌లో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ కూడా తమతో కలిసి రావాలని ఆయన కోరారు.

పార్టీ వీడిన వాళ్ల గురించి బాధలేదు..
మాజీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత సురేష్ రెడ్డి పార్టీ వీడటంపై తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కుంతియా స్పందించారు. పార్టీని వీడిన వారి గురించి బాధపడాల్సిన అవసరం లేదన్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మానసిక స్థితి సరిగా లేకే రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. కాగా సురేష్ రెడ్డి ఈ నెల 12న కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరనున్నారు. సచివాలయానికి రానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రనేనని ఎద్దేవా చేశారు.

English Title
Ghulam Nabi Azad telangana visit on september 12
Related News