చొరబాటుదారుల వివరాలు ఇవ్వండి

Updated By ManamFri, 08/03/2018 - 01:10
kishan
  • తెలంగాణ ప్రభుత్వానికి కిషన్‌రెడ్డి డిమాండ్

kishanహైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్రమ చొరబాటుదారుల వివరాలను బయటపెట్టి కేంద్రానికి ఇవ్వాలని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మజ్లిస్ పార్టీ సహకారంతోనే నగరానికి అక్రమ చొరబాటుదారులు వచ్చారని ఆయన ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి  విలేకరులతో మాట్లాడారు. ఎంఐఎం పార్టీ, వారికి ఎందుకు మద్దతు ఇస్తోందోనని, కోవా అనే ఎన్జీవో సంస్థ గుర్తింపు కార్డు ఎలా ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. మజ్లిస్ కారణంగా హైదరాబాద్.. రోహింగ్యాలకు సేఫ్ జోన్‌గా మారిందని ఆరోపించారు. బాలాపూర్ దర్గాలో ఏకంగా బర్మా కాలనీ ఏర్పడిందని, హఫీజ్ బాబానగర్, పహాడీషరీఫ్, కిషన్‌బాగ్‌లో రోహింగ్యాలు నివాసముంటున్నారని ఆయన అన్నారు. చొరబాటుదారుల విషయం ఒక మతానికి, భాషకు, ప్రాంతానికి సంబంధించింది కాదని, దేశ సమగ్రత, ఆత్మగౌరవంతో ముడిపడి ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో చొరబాటు దారులను పెంచి పోషించారని, దేశాన్ని నాశనం చేశారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. దేశంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారే రెండు కోట్ల మంది ఉన్నారని తెలిపారు. ఇస్లాం దేశాలు కూడా రోహింగ్యాలను తీసుకోవడానికి భయపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ నుంచి వచ్చే హిందువులు శరణార్థులని, వారికి ఆశ్రయం ఇవ్వడంలో తప్పులేదని కిషన్ రెడ్డి చెప్పారు.

English Title
Give details of intruders
Related News