వాటా పెంచుకుంటున్న  జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్

Updated By ManamSat, 02/03/2018 - 19:30
airport

airportహైదరాబాద్: జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో మలేషియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ బెర్హార్డ్ (ఎం.ఏ.హెచ్.బి)కి ఉన్న 11 శాతం వాటా రూ. 484 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఆ సంస్థతో జీఎంఆర్ గ్రూప్‌నకు చెందిన అనుబంధ సంస్థ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. సంస్థ శుక్రవారంనాడు స్టాక్ ఎక్స్చేంజ్‌కి ఈ సంగతి తెలియజేసింది. రూ. 10 ముఖ విలువ కలిగిన 4.15 కోట్ల షేర్లను ఎం.ఏ.హెచ్.బి నుంచి కొనుగోలు చేస్తున్నట్లు జీఎంఆర్ తెలిపింది. అది విమానాశ్రయంలో 11 శాతం ఈక్విటీకి సమానమవుతుంది. దీనికి నియంత్రణా పరమైన అనుమతులు లభించవలసి ఉంది. జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ఒక స్పెషల్ పర్పస్ వెహికల్. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అదే అమలుజరిపి, నిర్వహిస్తోంది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్‌కి రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో ఇప్పటికే 63 శాతం ఈక్విటీ వాటా ఉంది. ఇప్పుడు ఎం.ఏ.హెచ్.బి నుంచి 11 శాతం వాటా కైవసం చేసుకుంటే, దాని మొత్తం వాటా 74 శాతానికి పెరుగుతుంది. మిగిలిన వాటాలో 13 శాతం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వద్ద, మరో 13 శాతం తెలంగాణ ప్రభుత్వం వద్ద ఉంది. లావాదేవీ 2018 డిసెంబర్ 1న లేదా అంతకుముందు పూర్తయిందని భావించి, ధరను ఆధారం చేసుకున్నట్లు  సంస్థ తెలిపింది. జీహెచ్‌ఏఐఎల్‌కు 2008 మార్చి నుంచి 60 ఏళ్ళ రాయితీ పీరియడ్ ఉంది. రూ. 2,500 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ విమానాశ్రయ విస్తరణ చేపట్టే ప్రక్రియలో జీఎంఆర్ ఉంది. విస్తరణకు,పాత అప్పును తిరిగి చెల్లించడానికి అది ఇటీవల నిధులు సేకరించింది.  

Tags
English Title
GMR Airports to acquire MAHB's stake in GMR Hyderabad airport
Related News