‘ఇశై జ్ఞాని’కి పద్మ విభూషణ్

Updated By ManamFri, 01/26/2018 - 08:08
padmavibushan

padmavibushan కేంద్ర ప్రభుత్వం 2018గాను ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారం ‘పద్మ’ అవార్డులకు ఎంపికైనవారి పేర్లను గురువారం ప్రకటించింది. వీరిలో కొదరు విదేశీయులు, భారత సంతితి ప్రముఖులు, ప్రవాస భారతీయులు కూడా ఉన్నారు. అత్యున్నతమైన పద్మ విభూషణ్ పురస్కారం ప్రముఖ సంగీత దర్శకుడు ‘ఇశై జ్ఞాని’ ఇళయరాజా, మరో సంగీత విద్వాంసుడు గులాం ముస్తఫాఖాన్‌లతోపాటు పరమేశ్వరన్ (సాహిత్యం-విద్య)ను వరించింది. ఈ ఏడాది ‘అజ్ఞాత ధీరోదాత్తుల’ను పద్మ పురస్కారంతో గౌరవిస్తామన్న హామీకి అనుగుణంగా 85 మంది పేర్లతో గురువారం జాబితాను విడుదల చేసింది.

ఈ మేరకు ముగ్గురికి పద్మ విభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 73 మందికి పద్మశ్రీ పురస్కారం అందజేయనున్నట్లు వెల్లడించింది. ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించినవారికి పద్మ పురస్కారాలు ప్రకటించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ప్రకటించిన పద్మభూషణ్ అవార్డు పొందిన దిగ్గజాల్లో మహేంద్ర సింగ్ ధోనీ (క్రికెట్), పంకజ్ అద్వానీ (బిలియర్డ్స్-స్నూకర్), ఫిలిపోస్ మార్ క్రిసోస్తోమ్ (ఆధ్యాత్మిక రంగం), అలెగ్జాండర్ కడాకిన్ (పబ్లిక్ అఫెయిర్స్-మరణానంతరం), రామచంద్రన్ నాగస్వామి (ఆర్కియాలజీ), వేద్‌ప్రకాశ్ నందా (సాహిత్యం-విద్య), లక్ష్మణ్ పాయ్ (చిత్రకళ), అరవింద్ పారిఖ్, శారదా సిన్హా (కళలు-సంగీతం) ఉన్నారు.

ఈ ఏడాది కొత్త విధానం
పద్మ అవార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వశాఖలు సహా భారతరత్న, పద్మ విభూషణ్ అవార్డులు పొందినవారు, గవర్నర్లు, కేంద్ర-రాష్ట్ర మంత్రులు, ఎంపీలు కూడా అర్హుల పేర్లను ప్రతిపాదించవచ్చు. ఈ ఏడాది తొలిసారి స్వీయ ప్రతిపాదన అవకాశం కల్పించడంతో సుమారు 15,700కుపైగా దరఖాస్తులు వచ్చాయని ఒక అధికారి తెలిపారు. ఈ ప్రతిపాదనలన్నిటినీ ప్రధానమంత్రి ఏర్పాటు చేసిన పద్మ అవార్డుల కమిటీ పరిశీలించి తుది నిర్ణయం ప్రకటించింది.   ఈసారి పద్మ అవార్డులలో అత్యధికం కర్ణాటక రాష్ట్రానికి దక్కగా, మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. అలాగే 14 మంది విదేశీయులు కూడా ఈ పురస్కారానికి ఎంపిక కావడం విశేషం.

English Title
Government announces recipients of 2018 Padma awards
Related News