వయ్యారాల గొల్లభామ

Updated By ManamThu, 08/30/2018 - 23:07
gollabhama saree

అగ్గిపెట్టెలో పట్టే చీరను, మదిని దోచే మరెన్నో ఆకృతులకు సజీవ రూపం పోసిన సిద్దిపేట చేనేతల శ్రమైక సౌందర్యంలో నుండే గొల్లభామ పురుడుపోసుకొని నేటికీ  సజీవంగా వర్ధిల్లుతూ వస్తోంది. సిద్దిపేట పట్టణం చేపల మార్కెట్ సమీపంలో నివాసముంటున్న తుమ్మ గాలయ్య పూర్వీకుల అద్భుత ఆలోచనల సృష్టిలో నుండి ఉద్భవించిందే గొల్లభామ చీర. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన అమెరికా విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి, ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఈ గొల్లభామ చీరను మెచ్చారు. ప్రముఖ సినీ నటి సమంత బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్న గొల్లభామ చీరలపై ‘మనం మిసిమి’ ప్రత్యేక కథనం.
 

image


తలమీద పాల కడవ జారిపోకుండా, పెరుగు ముంతను వయ్యారంగా పట్టుకుని సరిలేరు నాకెవ్వరూ అంటూ తన వయ్యారాల నడుము ఒంపులతో నాట్యం చేస్తూ వెళుతున్న గొల్లపిల్ల మళ్ళీ నేనున్నానంటూ వెలుగులోకి వచ్చింది. మారుతున్న ఫ్యాషన్ రంగంలో గుర్తింపు పొందేందుకు పెద్ద సాహసమే చేసింది. ప్రభుత్వాల ప్రోత్సాహమో, సినీ జనాల వకాల్తానో మొత్తానికి గొల్లభామ ముద్రతో సిద్ధపేట గొల్లభామ చీరలు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. 

ఎన్నో కష్టాలను, మరెన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న చేనేత రంగంలో ప్రత్యేకత చూపితే తప్ప మనుగడ అసాధ్యమనే భావనలో నుండి గొల్లభామ పుట్టింది. సిద్దిపేటకు చెందిన తుమ్మ గాలయ్య పూర్వీకులు 70 సంవత్సరాల క్రితమే అత్యంత కళాత్మకంగా గొల్లభామ చీరలకు రూపకల్పన చేశారు. నాడు 90 రూపాయలకు లభించిన గొల్లభామ చీర నేడు రూ.1500 నుండి 5000లు పలుకుతోంది. అత్యంత కష్టతరమైన పని అయినప్పటికీ ఎంతో ఇష్టంగా కార్మికులు గొల్లభామ చీరలను నేస్తూ వస్తున్నారు. ఒకప్పుడు దినదిన ప్రవర్ధమానంగా వెలిగిన గొల్లభామ చీరల అమ్మకం రోజురోజుకు తగ్గిపోతూ ఉనికే ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితికి చేరుకుంది. వందల సంఖ్యలో హైండ్‌లూమ్స్‌పై వయలు పోయిన గొల్లభామ చీర నేడు ఆదరణ కరువై నేసే వారు లేక కాలగర్భంలో కలిసిపోతుందా అన్న అనుమానాలకు తావిస్తోంది. పూర్వీకులు ఇచ్చిన అద్భుత సంపద గొల్లభామను సజీవంగా నేటి తరానికి అందిస్తూ వస్తున్నాడు తుమ్మ గాలయ్య. పాత మార్కెట్ చౌరస్తా సమీపంలో 70 సంవత్సరాలుగా ఇదే వృత్తిని దైవంగా భావిస్తూ గొల్లభామ చీరలను నేటి తరానికి అందిస్తూ వస్తున్నాడు.

పెరుగుతున్న ముడిసరుకుల ధరలు, చీరలను నేసే కార్మికులు లేక ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటు న్నప్పటికీimage ఎలాగైనా గొల్లభామను కాపాడాలన్న సత్సంకల్పంతో చిట్ట చివరికి మిగిలిన 16 మంది కార్మికులతో గొల్లభామ చీరల ప్రశస్తిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. షైనింగ్ కాటన్, మస్రస్ కాటన్, గొల్లభామ కాటన్ వంటి చీరలకు అవసరమైన ముడిసరుకులను సూరత్, భీమండి, ముంబాయి నుండి తెప్పిస్తూ గొల్లభామలను నేస్తున్నాడు. ఒక్కో చీరను నేసేందుకు నాలుగు రోజుల సమయం పడుతుందని, భీము నుండి మగ్గంపైకి చీరను నేసేందుకు వరుస క్రమంలో 3600ల పోగులను సరి చేసే అత్యంత కఠినమైన పనిగా గొల్లభామ చీర ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఒకానొక దశలో గొల్లభామకు ఆదరణ లేక అవసాన దశకు వెళ్ళిపోగా సిద్దిపేటకే చెందిన కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడంతో చేనేత రంగానికి చేయూతను అందించేందుకు ముందుకొచ్చారు.

చేనేతకు చేయూత అందించడంతోపాటు గొల్లభామకు పూర్వపు వైభవాన్ని తీసుకురావాలన్న నిర్ణయం తీసుకోవడంతో గత నాలుగేళ్ల నుండి గొల్లభామ పేరు ఎక్కడ చూసినా నానుతుంది. చేనేత ఎగ్జిబిషన్‌లలో తప్పనిసరిగా గొల్లభామ ఉండి తీరాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అయితే ప్రభుత్వం ప్రోత్సహించిన రీతిలో గొల్లభామకు ఆదరణ లేకపోవడం, టెస్కో గొల్లభామలను ఖరీదు చేసేందుకు ముందుకు రాకపోవడం పవర్ లూమ్స్‌పై తయారవుతున్న చీరలు గొల్లభామ  చీరలకంటే తక్కువ ఖరీదు కావడంతో గొల్లభామను కొనుగోలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదన్నది అందరికీ తెలిసిందే. 

image


తుమ్మ గాలయ్య కుటుంబమంతా గొల్లభామ చీరలను విక్రయించడం ద్వారానే జీవనోపాధి పొందుతుంది. తుమ్మ గాలయ్యతోపాటు అతని భార్య రాజమణి ఇదే పనిని చేస్తూ బతుకుబండిని ఈడ్చుతున్నారు. దీనిలో ఒక కుమారుడు దేశవ్యాప్తంగా జరిగే ఎగ్జిబిషన్‌లలో చీరలను విక్రయిస్తుండగా, మరో కుమారుడు ఆన్‌లైన్‌లో చీరలను విక్రయిస్తున్నాడు. ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న చీరలకు అద్భుతమైన స్పందన  ఉండడం మూలంగానే కనీసం బతుకుబండిని లాగుతున్నామంటూ చెప్పుకొచ్చాడు తుమ్మ గాలయ్య. తాతలు అందించిన అద్భుతమైన కళను భావితరాలకు అందించాలని ఎంతో ఉన్నప్పటికీ నేర్చుకునేందుకు నేటి తరం యువకులు ముందుకు రావడం లేదన్నారు. కార్మికులకు సరైన కూలీ గిట్టక పోవడం, ఎప్పటివో మగ్గాలు ఉండడం మూలంగా కార్మికులు నేర్చుకోవడానికి ముందుకు రావడం లేదంటున్నాడు. ప్రభుత్వం చేయూతనిస్తే గొల్లభామ చీరల ప్రాభవాన్ని రక్షించేందుకు కృషి చేస్తానంటున్నాడు తుమ్మ గాలయ్య. 150 సంవత్సరాల చరిత్ర కలిగి ప్రపంచవ్యాప్తమవుతున్న గొల్లభామ చీర తమ  పూర్వీకులు సంపాదించిన గొప్ప ఆస్తి అని గాలయ్య పేర్కొన్నాడు, గత మూడు తరాల నుండి గాల్లభామ చీరలనే నేస్తున్నానని, గొల్లభామ చీర సిద్దిపేట పేటెంట్ కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నాడు. 1990 సంవత్సరం నుండి చేనేత సంక్షోభంలో ఉన్నా కళను కాపాడుకుంటూ వస్తున్నామని, ఇటీవల అంతర్జాతీయ చీరల ప్రదర్శనలో గొల్లభామకు 41వ స్థానం లభించిందన్నారు. 

గొల్లభామ చీరలకు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తున్నప్పటికీ అంతగా స్థానికుల నుండి స్పందన రావడం లేదనే చెప్పవచ్చు. ఇతర ప్రాంతాలకు చెందిన మహిళలే గొల్లభామ చీరలను కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు తప్పితే స్థానిక మహిళలు అంతగా ఆసక్తిని చూపడం లేదు. గొల్లభామ చీరలనే కాకుండా గొల్లభామ వస్త్రాన్ని కూడా తయారు చేస్తున్నారు. ఇటీవల కాలంలో గొల్లభామ వస్త్రంతో షర్ట్స్, వాస్‌కోట్స్ ధరించడం కూడా ఫ్యాషన్‌గా మారింది. ఎంత మార్పు వచ్చినా ప్రభుత్వం నుండి ప్రత్యక్షంగా ప్రోత్సాహం అందిస్తే తప్ప గొల్లభామ బతికిబట్టకట్టేలా కనిపించడం లేదు. గొల్లభామను తప్పనిసరిగా ధరించాలన్న నిబంధన కానీ, గొల్లభామ చీరలను ప్రభుత్వమే కొనుగోలు చేయడం ద్వారా మాత్రమే కళను కాపాడుకునే అవకాశం ఉంది. కొత్తగా కార్మికులకు గొల్లభామ చీరల తయారీ పట్ల మెలకువలు నేర్పించేందుకు ప్రభుత్వం చొరవ చూపి ట్రైనింగ్  సెంటర్ ఏర్పాటు చేస్తే గొల్లభామ పది కాలాలపాటు పరిఢవిల్లే అవకాశం లేకపోలేదు.

సంక్లిష్టం తయారీ విధానం
    గొల్లబామ చీరల తయారీ అత్యంత సంక్లిష్టమైనది. గతంలో ముడి సరుకులు తీసుకువచ్చి, రంగులు అద్ది, చీరలు నేసేవారు. కాలక్రమేణా రంగులద్దే విధానం మరుగునపడింది. ప్రస్తుతం కలర్‌కోంబ్ (దారపు ఉండలు) తీసుకువచ్చి వాటిని బింగిరీలకు చుట్టి వాటిని అత్యంత నేర్పుగా గ్రిల్ మిషన్‌పైకి ఎక్కించి ఒక్కో బింగిరీ నుండి వచ్చే దారంతో బీముపై పోస్తారు. ఒక్కో బీముపై పోసిన దారాన్ని తీసుకువెళ్లి మగ్గంపై అచ్చుకు ఎక్కిస్తారు. అచ్చుకు ఎక్కించే క్రమంలో 3600ల పోగులను ఒక్కొ రంధ్రం గుండా మగ్గంపై ఏర్పాటు చేసి, రెండు మూడు రోజులు కష్టిస్తేనే చీర తయారవుతుంది. ఒక్కో బీముపై తయారు చేసిన దారం 30 చీరలకు సరిపోతుంది. 


 

English Title
gollabhama saree
Related News