యూపీలో బీజేపీకి ఎదురుదెబ్బ

Updated By ManamWed, 03/14/2018 - 14:47
yogi adityanath

Yogi Adityanathయూపీ బైపోల్స్‌లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటరు తీర్పు ఇచ్చారు. గోరఖ్‌పూర్, ఫుల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన బైపోల్స్‌లో రెండో చోట్లా బీజేపీ అభ్యర్థులు వెనుకబడ్డారు. ఆ రెండు నియోజకవర్గాల్లోనూ బీఎస్పీ మద్దతుతో పోటీచేసిన సమాజ్‌వాది పార్టీ ముందంజలో ఉంది. లోక్‌సభ సభ్యులైన యోగి ఆధిత్యనాథ్ యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు ఎంపీ పదవికి రాజీనామా చేయగా...కేశవ్ ప్రసాద్ మౌర్య డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో గోరఖ్‌పూర్, ఫుల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గాలకు బైపోల్స్ అనివార్యమయ్యాయి.

16వ రౌండ్ ముగిసే సమయానికి గోరఖ్‌పూర్‌లో సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి 24,529 ఓట్లు ఆధిక్యంలో నిలవగా...ఫుల్‌పూర్‌లోనూ సమాజ్‌వాది పార్టీ 30 వేల ఓట్ల ఆధిక్యంలో ఉంది. సమాజ్‌వాది పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు.  సీఎం యోగీ ఆధిత్యనాథ్ ప్రాతినిధ్యంవహిస్తూ వచ్చిన గోరఖ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో సమాజ్‌వాది పార్టీ ముందంజలో నిలవడం కమలనాథులకు మింగుడుపడని పరిణామంగా మారింది. 

అటు బీహార్‌‌‌లోనూ బీజేపీకి వ్యతిరేకమైన పవనాలు వీచాయి.  అరారియా లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రెండో స్థానానికి పడిపోగా...ఆర్జేడీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక్కడ ఆర్జేడీ అభ్యర్థి 23 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆర్జేడీ అభ్యర్థికి 3,33,030 ఓట్లు పోల్ కాగా...బీజేపీ అభ్యర్థికి 3,09,863 ఓట్లు పోల్ అయ్యాయి. భబువా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన బైపోల్స్‌లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుండడం కమలనాథులకు కాస్త ఊరట కలిగించే అంశం. 

English Title
Gorakhpur Lok Sabha byelections: SP takes huge lead, Yogi Adityanath's citadel crumbles
Related News