గవర్నర్ ఎలా సంతృప్తి చెందారో చెప్పాలి

Updated By ManamFri, 08/10/2018 - 00:35
Kishan
  • బీజేపీ నేత కిషన్ రెడ్డి డిమాండ్   

imageహైదరాబాద్: తెలంగాణలో యూనివర్శిటీల పనితీరుపై గవర్నర్ నరసింహన్  ఎలా సంతృప్తి చెందారో వివరణ ఇవ్వాలని బీజేపీ శాసన సభాపక్ష నాయకుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజంగానే గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారా లేక మంత్రి ఆ విధంగా ప్రకటించుకున్నారో తెలియాలన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత యూనివర్శిటీలను దారుణంగా నిర్లక్ష్యం చేస్తోందని గురువారం నాడు అసెంబ్లీ ఆవరణలోని మీడియా హాల్‌లో విలేకరులతో మాట్లాడుతూ కిషన్ రెడ్డి విమర్శించారు.

అన్ని యూనివర్శిటీల్లో 70 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కనీస సౌకర్యాలు లేక హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్ధులు నానా అవస్థలు పడుతున్నారని చెప్పారు. ఉస్మానియాలో కొన్ని హాస్టళ్లలో విద్యార్ధులు కాలకృత్యాలు తీర్చకునేందుకు ఆరుబయటకు వెళ్లాల్సి వస్తుందన్నారు. బాతురూమ్‌లు లేక బయటే స్నానాలు చేస్తున్నారని చెప్పారు.

టీఆర్‌ఎస్ వచ్చిన తరువాత రెండున్నర సంవత్సరాల పాటు యూనివర్శిటీలకు కనీసం వీసీలను కూడా నియమించలేదని, ఇప్పటి వరకు ఏ యూనివర్శిటీకీ పాలక మండళ్లను నియమించలేదన్నారు. ప్రభుత్వం కనీస నిధులు ఇవ్వకపోవడంతో యూనివర్శిటీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని కిషన్ రెడ్డి చెప్పారు. ఇన్ని సమస్యలు ఉన్నా గవర్నర్ ఎలా సంతృప్తి చెందారో చెప్పాలన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నెల రోజులు పూర్తవుతున్నా ఇంత వరకు ఎక్కడా మెస్‌లు ప్రారంభంకాలేదన్నారు.  విద్యార్ధుల హక్కులను రక్షించాల్సిన బాధ్యత ఛాన్స్‌లర్‌గా గవర్నర్‌కు ఉందన్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు అన్ని యూనివర్శిటీల్లో గవర్నర్ పర్యటించాలని కిషన్ రెడ్డి కోరారు.

English Title
The governor should say how he satisfied
Related News