మహాసంప్రోక్షణ ఆరంభం

Updated By ManamMon, 08/13/2018 - 04:58
tirumala
  • 12 ఏళ్ల విరామం తర్వాత కార్యక్రమం.. 300 గ్రాముల బంగారంతో కూర్చ

  • దర్భల కూర్చకు బదులు బంగారం.. బంగారు కలశంతో పాటు ప్రతిష్ఠాపన

  • కలశంలోకి దేవతామూర్తుల ఆవాహన.. రోజూ 6 గంటల నుంచి హోమాలు

  • ఈ నెల 16 వరకు కార్యక్రమాలు

imageతిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు ఆదివారం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఆగస్టు 16వ తేదీన మహాసంప్రోక్షణతో ఇవి ముగియను న్నాయి. ఉదయం ఒక హోమగుండాన్ని వెలిగించి పుణ్యాహ వచనం, పంచగవ్యారాధన, వాస్తు హోమం, రక్షాబంధనం చేపట్టారు. శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణలో వినియోగించే బంగారు కూర్చను టీటీడీ సిద్ధం చేసింది. 300 గ్రాముల బంగారంతో దీన్ని తయారుచేశారు. సాధారణంగా వైదిక కార్యక్రమాల్లో అర్చకులు దర్భలతో చేసిన కూర్చలను వినియోగిస్తారు. కూర్చలోకి మంత్రావాహన చేసి వైదిక క్రతువులకు దాన్ని ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ మాత్రం బంగారు కూర్చను వాడుతుండటం విశేషం. శ్రీవారి మూలమూర్తిని ఆవాహన చేసిన బంగారు కలశంతో పాటు ఈ బంగారు కూర్చను యాగశాలలో ప్రతిష్ఠిస్తామని తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు తెలిపారు.

కళాకర్షణ
రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు కళాకర్షణలో భాగంగా గర్భాలయంలోని మూలవర్లతోపాటు ఉప ఆలయాల్లోని imageదేవతామూర్తుల శక్తిని కుంభం(కలశం) లోకి ఆవాహన చేశారు. శ్రీవారి మూలమూర్తికి తల, నుదురు, ముక్కు, నోరు, గొంతు, రెండు భుజాలు, హృదయం, నాభి, కటి, మోకాలు, పాదాల్లో 12 జీవస్థానాలు ఉంటాయి. ఒక్కో జీవస్థానానికి 4 కళల చొప్పున మొత్తం 48 కళలు ఉంటాయి. ఈ 48 కళలను కుంభంలోకి ఆవాహన చేస్తారు. ఈ కుంభాలతో పాటు శ్రీ భోగశ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు, శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి, శ్రీ చక్రత్తాళ్వార్, శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరాముల వారు, రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూర్తులను యాగశాలలోకి వేంచేపు చేస్తారు. ఉప ఆలయాల్లోని జయవిజయులు, ధ్వజస్తంభం, శ్రీ విష్వక్సేనుడు, శ్రీగరుడాళ్వార్, ప్రసాదం పోటులోని అమ్మవారు, లడ్డూపోటులోని అమ్మవారు, శ్రీ భాష్యకారులు, శ్రీ యోగ నరసింహస్వామి, శ్రీ వేణుగోపాలస్వామి, శ్రీ బేడి ఆంజనేయస్వామివారి శక్తిని కూడా కుంభంలోకి ఆవాహనచేసి యాగశాలకు తీసుకెళతారు. మొత్తం 18 వేదికలపై కుంభాలను కొలువుదీరుస్తారు. యాగశాలలో ప్రతిరోజూ నిత్య కైంకర్యాలతో పాటు ఉదయం 6 గంటల నుంచి హోమాలు నిర్వహిస్తారు.

English Title
Great start OF MAHASAMPROKSHANA
Related News