సీబీఐ వలలో మంత్రి.. డీజీపీ!

Updated By ManamWed, 09/05/2018 - 12:03
Gutka Scam: CBI Raids Tamil Nadu Health Minister C Vijaya Baskar
  • తమిళనాట గుట్కా స్కాం కలకలం

  • మంత్రి, డీజీపీ ఇళ్లలో సీబీఐ సోదాలు

  • మరికొందరు సీనియర్ పోలీసులపైనా..

  • ఏక కాలంలో 40 ప్రదేశాలలో దాడులు

  • గుట్కా తయారీదారుల నుంచి లంచాలు

  • వారి వద్ద డైరీలో మంత్రి.. డీజీపీల పేర్లు

Gutka Scam: CBI Raids Tamil Nadu Health Minister C Vijaya Baskar

చెన్నై : తమిళనాడులో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సి. విజయభాస్కర్, రాష్ట్ర డీజీపీ టీకే రాజేంద్రన్‌ల ఇళ్లపై సీబీఐ దాడులు చేసింది. వందల కోట్ల విలువైన గుట్కా స్కాంకు సంబంధించి బుధవారం తెల్లవారుజాము నుంచి ఈ దాడులు మొదలయ్యాయి. ఉదయం 7 గంటలకు ఏక కాలంలో 40 ప్రదేశాలలో సీబీఐ అధికారులు మోహరించారు. వీళ్లిద్దరితో పాటు మాజీ డీజీపీ ఎస్. జార్జి సహా మరికొందరు సీనియర్ పోలీసు అధికారుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరిగాయని మాత్రమే సీబీఐ అధికారులు తెలిపారు తప్ప మిగిలిన వివరాలు వెల్లడించలేదు. 

ఏమిటీ గుట్కా స్కాం?
తమిళనాడులోని కొన్ని పాన్ మసాలా, గుట్కా తయారీ కేంద్రాలు, వాటి తయారీదారుల ఇళ్లపై ఆదాయపన్ను శాఖ అధికారులు 2017 జూలై 8న దాడులు చేశారు. అప్పుడే గుట్కా స్కాం వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ. 250 కోట్ల మేర పన్నులు ఎగవేసినట్లు తెలిసింది. దాడుల సమయంలో అక్కడ ఒక డైరీ దొరికింది. అందులో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సి. విజయభాస్కర్, రాష్ట్ర డీజీపీ టీకే రాజేంద్రన్‌ల పేర్లున్నాయి. గుట్కా తయారీదారుల నుంచి మంత్రి, డీజీపీ తీసుకున్న లంచాల బాగోతాలన్నీ బయటపడ్డాయి. కేన్సర్ కారకాలైన గుట్కా, పాన్‌మసాలాల తయారీ, విక్రయాలను 2013లోనే తమిళనాడులో నిషేధించారు. అయినా అవి యథేచ్ఛగా మార్కెట్లలోకి వస్తూనే ఉన్నాయి.

అన్నాడీఎంకే నాయకులు నిందితులతో చేతులు కలిపారన్న ఆరోపణలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. డీఎంకే ఎమ్మెల్యే అంబళగన్ ఈ స్కాంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోర్టును ఆశ్రయించడంతో, ఈ మేరకు మద్రాస్ హైకోర్టు ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఆదేశించింది. తమిళనాడు ప్రభుత్వాధికారులు, సెంట్రల్ ఎక్సైజ్ శాఖ, ఆరోగ్యభద్రత శాఖలపై మే నెలలో సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్ దాఖలుచేశారు. ఇప్పుడు ఏకంగా మంత్రి, డీజీపీల ఇళ్లలోనే సోదాలు చేయడంతో ఇది ఇంకెంత దూరం వెళ్తుందోనని చూస్తున్నారు. 

కొన్ని నెలల క్రితమే తమిళనాడు మంత్రుల ఇళ్లలో ఐటీ దాడులతో మొదలైన ఈ కేసు చివరికి గుట్కా మాఫియా దగ్గర ఆగింది. ఎమ్‌డీఎమ్ పేరుతో గుట్కా అమ్ముతున్నారని వాదించిన పిటిషనర్ తరపు న్యాయవాది కేసుకు సంబంధించిన పలు సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. తమిళనాడు ఆరోగ్యమంత్రికి నెలకు 14లక్షల రూపాయలు చొప్పున మూడు నెలల పాటు ముడుపులు ఇచ్చారని, ఓ సెంట్రల్ ఎక్సైస్ విభాగం అధికారికి నెలకు రూ.2లక్షల వరకు చెల్లించారని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు.

దీంతో పాటు రెడ్ హిల్స్ ప్రాంతానికి చెందిన ఓ ఏసీపీకి నెలకు 10లక్షల మామూళ్లు ఇచ్చేవారని సాక్ష్యాల్లో పేర్కొన్నారు. 250 కోట్ల విలువైన ఈ స్కాంపై సీబీఐ సమగ్ర విచారణ జరిపించాలని మద్రాసు హైకోర్టు ఆదేశించడంతో అధికారులు ఆపరేషన్ మొదలైంది.

English Title
Gutka Scam: Raids in health minister home
Related News