‘హ్యాపి వెడ్డింగ్’ రివ్యూ

Updated By ManamSat, 07/28/2018 - 14:53
Happy wedding
Happy wedding

ప్రెజెంట్స్: యువి క్రియేషన్స్ 
ప్రొడ‌క్ష‌న్ హౌస్‌: పాకెట్ సినిమా 
ఆర్టిస్ట్ లు: సుమంత్ అశ్విన్, నిహారిక, న‌రేష్, ముర‌ళి శ‌ర్మ‌, ప‌విత్ర లోకేష్, తుల‌సి, ఇంద్ర‌జ‌, మ‌ధుమ‌ణి త‌దిత‌రులు
డైర‌క్ష‌న్‌: లక్ష్మణ్ కార్య 
ట్యూన్స్:  శక్తికాంత్ కార్తిక్ 
లిరిక్స్:  సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, శ్రీమ‌ణి
రీరికార్డింగ్‌: త‌మ‌న్‌
రిలీజ్ డేట్‌: 28.07.2018

మెగా కుటుంబం నుంచి న‌ట‌న‌లోకి వ‌చ్చిన తొలి అమ్మాయి నీహారిక‌. నాన్న‌కు, పెద‌నాన్న‌కు గారాల‌ప‌ట్టి ఈమె. ముందు వ్యాఖ్యాత‌గా, త‌ర్వాత వెబ్‌సీరీస్‌తో ఆ త‌ర్వాత `ఒక మ‌న‌సు` సినిమాతో మెల్ల‌మెల్ల‌గా తెరంగేట్రం చేసింది. తెలుగులో త‌న రెండో సినిమా అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డానికి `హ్యాపీ వెడ్డింగ్‌` చేసింది. మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సుమంత్ అశ్విన్ క‌థానాయకుడు. వీరిద్ద‌రికి ఈ సినిమా ఎలాంటి అనుభూతిని మిగులుస్తుందో చూద్దాం..
 
క‌థ‌
అక్ష‌ర (నీహారిక) విజ‌య్ (రాజు)ని ప్రేమిస్తుంది. అయితే అత‌ను చిన్న పొర‌పాటు చేశాడ‌నే కార‌ణంతో అత‌న్ని వ‌ద్ద‌నుకుంటుంది. అక్క‌డి నుంచి ముందుకు వెళ్లి ఆనంద్ (సుమంత్ అశ్విన్‌)ని పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటుంది. ఆమె క‌న్నా ముందు వాళ్ల పెద్ద‌లే ఆమెకు పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యించుకుంటారు. అంతా బావుంద‌ని అనుకునేలోపు అక్ష‌ర‌ను విజ‌య్ క‌లుస్తాడు. వారిద్ద‌రి మ‌ధ్య మ‌ర‌లా మాట‌లు పెరుగుతాయి. ఇద్ద‌రూ క‌లిసి ప‌నిచేస్తారు. ఆక్ర‌మంలో త‌ను విజయ్ క‌రెక్టా? ఆనంద్ క‌రెక్టా? అనే ఆలోచ‌న అక్ష‌ర‌లో మొద‌ల‌వుతుంది. ఈ ఆలోచ‌న ఎటు దారితీసింది? ఆమె చివ‌రికి విజ‌య్‌తో జ‌త క‌డుతుందా? ఆనంద్‌ని పెళ్లి చేసుకుంటుందా? అనేది ఆస‌క్తిక‌రం.

ప్ల‌స్ పాయింట్లు
- ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్
- పాట‌ల్లో సాహిత్యం
- కెమెరా
- నిర్మాణ విలువ‌లు

మైన‌స్ పాయింట్లు
- ఎమోష‌న్స్ ని స‌రిగా క్యారీ చేయ‌లేక‌పోవ‌డం
- క‌థ‌ల కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం
- నెమ్మ‌దిగా సాగే స్క్రీన్‌ప్లే
- రొటీన్ క్లైమాక్స్

విశ్లేష‌ణ‌:
ఎటూ తేల్చుకోలేని ఓ అమ్మాయి పాత్ర చుట్టూ తిరిగే క‌థే `హ్యాపీ వెడ్డింగ్‌`. త‌ల్లిదండ్రులు, చేసుకోబోయే వ్య‌క్తి, అత్త‌వారిల్లు.. అంద‌రూ బాగా స‌పోర్ట్ చేసినా, తెలియ‌ని భ‌యాల‌తో, తాను అనుకున్న‌దే నిజ‌మ‌ని న‌మ్మే ఓ యువ‌తి క‌థ ఇది. మాన‌సిక సంఘ‌ర్ష‌ణ ప్ర‌ధానంగా సాగే సినిమా. అయితే ఇందులో హీరోయిన్ ప‌డే మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌ను పోట్రెయిట్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు ఫెయిల్ అయ్యాడు. స‌న్నివేశాల‌ను కూడా మ‌రింత ప‌దునుగా రాసుకోవాల్సింది. సినిమా న‌డ‌క‌లోనూ కాసింత వేగాన్ని పెంచాల్సింది. రీరికార్డింగ్‌తో కొన్ని ఎమోష‌న్స్ ని క్యారీ చేయాల‌ని ప్ర‌య‌త్నించినా అది కూడా స‌రిగా పండ‌లేదు. కామెడీ అస‌లు లేదు. త‌ల్లికి దూర‌మ‌వుతానేమోన‌ని పెళ్లి కుదిరిన అమ్మాయి ప‌డే బాధ మ‌న‌సును తాకుతుంది. కానీ సిల్లీ రీజ‌న్స్, వాటిని కూడా స‌రిగా క‌న్విన్స్ చేయ‌లేక‌పోవ‌డంతో సినిమా అంతా కంగాళీగా అనిపిస్తుంది. హీరో న‌వ్వుతూ మేనేజ్ చేస్తాడు కానీ, ఓ స‌న్నివేశంలో నాయికే అన్న‌ట్టు.. బోర్ కొడుతుంది. సినిమాలో ద‌ర్శ‌కుడు చెప్పాల‌నుకున్న విష‌యాన్ని స‌రిగా క్యారీ చేయ‌లేక‌పోయారు. ఇలాంటి సినిమాల‌కు లొకేష‌న్లు, పాట‌లు చాలా కీల‌కం. కానీ చూపించిన చోట్లనే మ‌ర‌లా చూపించారు. పాట‌లు కూడా అతికిన‌ట్టుగా ఉండ‌వు. మ‌ళ్లీ మ‌ళ్లీ పాడుకునేలా అనిపించ‌వు. 

రేటింగ్‌: 2.75I5
బాట‌మ్ లైన్‌: మాన‌సిక సంఘ‌ర్ష‌ణతో `హ్యాపీ వెడ్డింగ్‌`.

English Title
Happy Wedding movie review
Related News