కాశీపై వరాలజల్లు

Updated By ManamWed, 09/19/2018 - 00:23
modi
  • రూ. 550 కోట్ల ప్రాజెక్టులు.. ప్రారంభాలు.. శంకుస్థాపనలు

  • నగర స్వరూపం మారిపోయింది.. గతంలో శివుడి భిక్షపైనే ఆధారం

  • నాలుగేళ్లలో కళ్లముందు అభివృద్ధి.. తలమీద వేలాడే వైర్లు ఉన్నాయా

  • వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీ

modiవారణాసి: తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో రూ. 550 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం ప్రారంభించారు. గడిచిన నాలుగేళ్లలో వారణాసి నగర స్వరూపం మొత్తం సమగ్రంగా మారిపోయిందని, అదే ఇంతకుముందు అయితే.. పాత ప్రభుత్వాల దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వచ్చేదని ఆయన అన్నారు. పాత కాశీ నగరంలో సమీకృత ఇంధన అభివృద్ధి పథకం (ఐపీడీఎస్), బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ)లో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ లాంటి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. వాటితో పాటు.. బీహెచ్‌యూలోనే రీజనల్ ఆఫ్తల్మాలజీ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. వారణాసిలో మోదీ రెండు రోజుల పర్యటన మంగళవారంతో ముగిసింది. ఇక్కడ చేసిన పనులన్నీ స్పష్టంగా కళ్లకు కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. కాశీని సమూలంగా మార్చాలన్నదే తన లక్ష్యమని, అదే సమయంలో ఇక్కడి సంప్రదాయాలు, పురాతన వారసత్వ విలువలను మాత్రం కాపాడతామని అన్నారు. ఒకప్పుడు కాశీ అంతా శివుడి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండేదని తెలిపారు. నాలుగేళ్ల క్రితం కాశీవాసులు ఈ నగరాన్ని మార్చాలని తీర్మానించుకున్నారని, వారికి ఈరోజు మార్పు స్పష్టంగా కనిపిస్తోందంటూ పాత ప్రభుత్వాలను ఎద్దేవా చేశారు. 2014కు ముందు రింగ్‌రోడ్డుకు సంబంధించిన ఫైలు బూజు పట్టి ఉండేదని, ఆ ప్రాజెక్టు వేగంగా పూర్తయితే మోదీకి పేరు వస్తుందని వాళ్లు ఆపేశారని మండిపడ్డారు. యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఇక్కడి పని వేగం పుంజుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మహేంద్రనాథ్ పాండే కూడా పాల్గొన్నారు. మంగళవారం రూ. 550 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామన్నారు. కేవలం వారణాసిలోనే కాక చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఈ అభివృద్ధి విస్తరిస్తుందని మోదీ తెలిపారు. స్థానిక యాసలో మాట్లాడుతూ కాశీవాసులను ఆకట్టుకున్న మోదీ.. ముందుగా ‘హర్‌హర్ మహాదేవ్’ అంటూ గట్టిగా చెప్పడంతో ఒక్కసారిగా బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఉన్న ప్రేక్షకులంతా అదే స్థాయిలో అలాగే నినదించారు. శివుడు, గంగామాతల ఆశీర్వాదాలతో తాను ఇదంతా చేయగలుగుతున్నానని, ప్రజలందరి ఆశీర్వాదాలు, అభిమానం తనకు మరింత బలాన్నిస్తున్నాయని మోదీ చెప్పారు. ఎంపీ కాకముందు తాను కాశీకి వచ్చినపుడల్లా ఇక్కడ తలమీద వేలాడుతున్న కరెంటువైర్ల బాధ ఎప్పటికి పోతుందోనని పలుమార్లు అనుకునేవాడినని, ఇప్పుడు నగరంలో చాలావరకు భూగర్భ కేబుళ్లు రావడంతో ఆ వైర్ల బాధ తప్పిందని చెప్పారు.

English Title
Harvesting on Kashi
Related News